Implant
-
గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి ..
ఇటీవల చాలామంది స్త్రీలు గర్భం రాకుండా ప్లానే చేసుకునేలా అందుబాటులోకి వచ్చిన సరికొత్త వైద్య విధానాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. టాబ్లెట్ల దగ్గర నుంచి వివిధ రకాల వైద్య విధానాలను అనుసరిస్తున్నారు. కాకపోతే అవన్నీ వైద్యుల సూచనలు సలహాల మేరకే వినియోగించాల్సి ఉంటుంది. అలానే ఇక్కడొక మహిళ కూడా గర్భం రాకుండా ఉండేలా అత్యాధునిక వైద్యం చేయించుకుంది. అందులో భాగంగా ఓ పరికరాన్ని ఇంప్లాంట్ చేస్తే అది కాస్త నేరుగా ఆమె గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్‌కి చెందిన 22 ఏళ్ల క్లో వెస్టర్వే తన చేతికి రెండేళ్ల క్రితం గర్భ నిరోధక పరికరాన్ని ఇంప్లాంట్ చేశారు. ఈ వైద్య విధానంలో భాగంగా ఓ ఫ్లైక్సిబుల్ రాడ్‌ని ఆమె చేతికి ఇంప్లాంట్ చేశారు. నిజానికి ఈ రాడ్ ప్రతినెల అండోత్సర్గాన్ని ఆపేలా ప్రొజెస్టెరాన్‌ను రక్తప్రవాహంలో విడుదల చేస్తుంది. ఈ రాడ్ మూడు సంవత్సరాల వరకు గర్భరాకుండా చేస్తుంది. పైగా చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే రోజు గర్భం రాకుండా మాత్ర వేసుకునే ఇబ్బందకి చెక్ పెడుతుంది. ఆరోగ్య పరంగా మంచిది. అందుకనే ఎక్కువ మంది మహిళలు గర్భం రాకుండా ఉండేలా ఈ ఇంప్లాంట్కే ఎక్కువ మక్కువ చూపించడానికి ప్రధాన కారణం. అయితే ఏం జరిగిందో ఏమో! సడెన్‌గా ఈ ఇంప్లాంట్ జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి క్లో గుండెల్లో మంట, వాంతులు, అధిక రక్తస్రావం, దడ వంటి సమస్యలను ఎదుర్కొంది. పరిస్థితి సీరియస్ అవ్వడంతో ఆస్పత్రికి వెళ్లి చెకప్చేయగా ఆమెకు ఇంప్లాంట్ చేసిన రాడ్ చేతి వద్ద కనపించలేదు. ఎంత ప్రయత్నించిన వైద్యులుఆ రాడ్ ఎక్కడుందనేది కనుగొనలేకపోయారు. చివరికి ఆ రాడ్ ఆమె గుండెలోని పల్మనరీ ధమనుల్లోకి వెళ్లిపోయిందని గుర్తించి షాక్‌కి గురయ్యారు వైద్యులు. అది సుమారు నాలుగు సెంటిమీటర్ల పరికరం. నిజానికి ఇది వైద్యులు గర్భం రాకుండా ఉండేలా ఆమె చేతిపై చర్మం వద్ద ఉంచిన ఒక ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ రాడ్. దీని కారణంగా ఆమె తీవ్రమైన నరాల నొప్పి, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలను చవిచూసింది. ఇప్పుడూ ఆ ఫ్లెక్సిబుల్ రాడ్‌ని తొలగించేందుకు సదరు బాధిత మహిళకు మొదటగా ఊపిరితిత్తుల ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, తదితర శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని వైద్యులు ఆమెకు తెలిపారు. ఆమె కోలుకోవడానికే దగ్గర దగ్గర ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుంది. దీని కారణంగా ఆమె జీవితంలో ఆమె ఏ బరువైనా వస్తువుని పైకి ఎత్తలేదు, తనంతట తాను స్వయంగా లేవలేదు. కాగా యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకారం గర్భనిరోధక ఇంప్లాంట్ వికటించిన కేసులు 18 ఉన్నాయి. అలాగే ఆమెలా గుండె పల్మనరీ ధమనుల్లోకి పరికరం చేరిన కేసులు 107 ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వాస్తవానికి ఆ పరికరం పనిచేయకపోతే ఇలా గుండెల్లోకి నేరుగా చొచ్చుకుపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరాలు గర్భధారణను నివారించడంలో 99% సమర్థవంతంగా పనిచేస్తుందని, పైగా ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్యులు. ఐతే ఇలా కొన్ని కేసుల్లో ఈ పరికరం ఎందుకు వికటిస్తోందో తెలియాల్సి ఉందన్నారు. దీని గురించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందన్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: క్యాన్సర్‌కు సంబంధించి భారత్ ఎన్ని మందులు ఫ్రీగా ఇస్తోందంటే..) -
ఇంప్లాంట్ ఉందన్నా బట్టలిప్పించి తనిఖీ
గౌహతి: నడుము భాగంలో ఇంప్లాంట్ (మెటల్ ప్లేట్) వేయించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలిని బట్టలిప్పించి తనిఖీ చేసిన ఘటన అస్సాంలోని గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గురువారం చోటుచేసుకుంది. వృద్ధురాలి నడుముకు గత ఏడాది శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు మెటల్ ప్లేట్ వేశారు. ఢిల్లీకి వెళ్లడానికి నాగాలాండ్ నుంచి గౌహతికి చేరుకుంది. మనవరాలితో కలిసి చక్రాల కుర్చీలో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తుండగా, మెటల్ డిటెక్టర్ అలారం మోగింది. దీంతో సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది ఆమెను ఆపారు. బట్టలు ఇప్పించి తనిఖీ చేశారు. శరీరంలో ఇంప్లాంట్ ఉందంటూ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వృద్ధురాలిని అవమానించినట్లు ఫిర్యాదు అందడంతో అందుకు కారణమైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గౌహతి ఎయిర్‌పోర్టులో వృద్ధురాలికి అవమానం -
ఆసుపత్రిలో కమల్, రేపు సర్జరీ
సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరనున్నారు. ఆయన కాలులో వున్న ఇంప్లాంట్‌ను తొలగించేందుకు వైద్యులు శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్ఎం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2016 లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగినపుడు వైద్యులు ఇంప్లాంట్‌ను అమర్చారని, దీన్ని తొలగించాల్సి అవసరం ఉందని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారని ఎంఎన్ఎం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్ మహేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యుల సలహా మేరకు రేపు (నవంబర్ 22) కమల్ హాసన్ ఇందుకోసం ఆసుపత్రిలో చేరనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కోలుకునేందుకు కొన్ని వారాలు పాటు విరామం తీసుకోవాల్సి వుంటుందని మహేంద్రన్ వెల్లడించారు. -
గుండె వైఫల్యాన్ని ముందే గుర్తిస్తుంది..!
రోగి కంటే ముందే గుండె వైఫల్యాన్ని గుర్తించే సరికొత్త ఇంప్లాంట్ ఇది. ‘కార్డియోమెమ్స్’ అనే ఈ పరికరాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం తీసుకెళ్లే పుప్పుస ధమనిలో అమర్చుకుంటే చాలు.. రోగి జీవితాంతం బ్యాటరీ సైతం అవసరం లేకుండానే పనిచేస్తుంది. పుప్పుస ధమనిలో బీపీ(రక్తపోటు)ని, గుండె కొట్టుకునే తీరును ఇది నిరంతరం సెన్సర్ల ద్వారా పరిశీలిస్తుంది. గుండె వైఫల్యానికి దారితీసేలా రక్తపోటులో తేడా వచ్చిన తక్షణమే రిసీవర్‌కు సమాచారం పంపుతుంది. ఆ వెంటనే రిసీవర్ నుంచి వైద్యులకు సమాచారం చేరుతుంది. వైద్యులు వెంటనే రోగికి ఏ మందులు వేసుకోవాలో చెప్పడంతో పాటు తగిన సూచనలు చేస్తారు. దీనిని ఇప్పటిదాకా ఏడుగురిలో అమర్చగా కచ్చితత్వంతో పనిచేసిందని లండన్‌లోని రాయల్ బ్రాంప్టన్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. గుండె వైఫల్యం ముప్పు ఎక్కువగా ఉండే రోగులకు ఇది బాగా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. దీని ధర సుమారు రూ. 12 లక్షలు. -
గ్లూకోజ్ స్థాయిలను గుర్తించేందుకు కొత్త ప్రొటీన్
మధుమేహ బాధితులు ప్రతిసారీ వేలిపై సూదితో గుచ్చుకుని రక్తపు చుక్కతో గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించుకోవాల్సిన అవసరం ఇక తప్పనుంది. చిన్న ఇంప్లాంట్‌ను శరీరంలో అమర్చుకుంటే చాలు.. 24 గంటలూ ఆ పరికరమే గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ అణువులతో కలవగానే ఆకారం మారిపోయేలా శాస్త్రవేత్తలు సృష్టించిన ఓ కొత్త ప్రొటీన్‌తో ఇది సాధ్యం కానుంది. ఈ గ్లూకోజ్ బైండింగ్ ప్రొటీన్ (జీబీపీ) ఆధారంగా గ్లూకోజ్ స్థాయిలను గుర్తించే సూక్ష్మ పరికరాలను రూపొం దించవచ్చని, దాని ద్వారా చాలా చౌకగా గ్లూకోజ్ పర్యవేక్షణ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం నిమిషానికోసారి గ్లూకోజ్ స్థాయిలను గుర్తించే పరికరాలు కూడా ఉన్నా.. అవి చాలా ఖరీదైనవని, పైగా ఎక్కువ కాలం పనిచేయవని అంటున్నారు. జీబీపీ సాయంతో రూపొందించే ఇంప్లాంట్లు మధుమేహ బాధితులకు బాగా ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు.