గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్‌ చేస్తే..నేరుగా గుండెల్లోకి .. | Australia 22 Years Old Woman Had A Contraceptive Implanted, Lodges In A Womans Heart She Faced Open Heart Surgery - Sakshi
Sakshi News home page

గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్‌ చేస్తే..నేరుగా గుండెల్లోకి దూసుకుపోయి..

Published Fri, Sep 29 2023 4:01 PM | Last Updated on Fri, Sep 29 2023 5:22 PM

Contraceptive Implant Migrates And Lodges In A Womans Heart - Sakshi

ఇటీవల చాలామంది స్త్రీలు గర్భం రాకుండా ప్లానే చేసుకునేలా అందుబాటులోకి వచ్చిన సరికొత్త వైద్య విధానాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. టాబ్లెట్ల దగ్గర నుంచి వివిధ రకాల వైద్య విధానాలను అనుసరిస్తున్నారు. కాకపోతే అవన్నీ వైద్యుల సూచనలు సలహాల మేరకే వినియోగించాల్సి ఉంటుంది. అలానే ఇక్కడొక మహిళ కూడా గర్భం రాకుండా ఉండేలా అత్యాధునిక వైద్యం చేయించుకుంది. అందులో భాగంగా ఓ పరికరాన్ని ఇంప్లాంట్‌ చేస్తే అది కాస్త నేరుగా ఆమె గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఆస్ట్రేలియాలో  చోటు చేసుకుంది.

ఆస్ట్రేలియన్‌కి చెందిన 22 ఏళ్ల క్లో వెస్టర్‌వే తన చేతికి రెండేళ్ల క్రితం గర్భ నిరోధక పరికరాన్ని ఇంప్లాంట్‌ చేశారు. ఈ వైద్య విధానంలో భాగంగా ఓ ఫ్లైక్సిబుల్‌ రాడ్‌ని ఆమె చేతికి ఇంప్లాంట్‌ చేశారు. నిజానికి ఈ రాడ్‌ ప్రతినెల అండోత్సర్గాన్ని ఆపేలా ప్రొజెస్టెరాన్‌ను రక్తప్రవాహంలో విడుదల చేస్తుంది. ఈ రాడ్‌ మూడు సంవత్సరాల వరకు గర్భరాకుండా చేస్తుంది. పైగా చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే రోజు గర్భం రాకుండా మాత్ర వేసుకునే ఇబ్బందకి చెక్‌ పెడుతుంది. ఆరోగ్య పరంగా మంచిది. అందుకనే ఎక్కువ మంది మహిళలు గర్భం రాకుండా ఉండేలా ఈ ఇంప్లాంట్‌కే ఎక్కువ మక్కువ చూపించడానికి ప్రధాన కారణం.

అయితే ఏం జరిగిందో ఏమో! సడెన్‌గా ఈ ఇంప్లాంట్‌ జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి క్లో గుండెల్లో మంట, వాంతులు, అధిక రక్తస్రావం, దడ వంటి సమస్యలను ఎదుర్కొంది. పరిస్థితి సీరియస్‌ అవ్వడంతో ఆస్పత్రికి వెళ్లి చెకప్‌చేయగా ఆమెకు ఇంప్లాంట్‌ చేసిన రాడ్‌ చేతి వద్ద కనపించలేదు. ఎంత ప్రయత్నించిన వైద్యులుఆ రాడ్‌ ఎక్కడుందనేది కనుగొనలేకపోయారు. చివరికి ఆ రాడ్‌ ఆమె గుండెలోని పల్మనరీ ధమనుల్లోకి వెళ్లిపోయిందని గుర్తించి షాక్‌కి గురయ్యారు వైద్యులు.  అది సుమారు నాలుగు సెంటిమీటర్ల పరికరం. నిజానికి ఇది వైద్యులు గర్భం రాకుండా ఉండేలా ఆమె చేతిపై చర్మం వద్ద ఉంచిన ఒక ఫ్లెక్సిబుల్‌ ప్లాస్టిక్‌ రాడ్‌.

దీని కారణంగా ఆమె తీవ్రమైన నరాల నొప్పి, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలను చవిచూసింది. ఇప్పుడూ ఆ ఫ్లెక్సిబుల్‌ రాడ్‌ని తొలగించేందుకు సదరు బాధిత మహిళకు మొదటగా ఊపిరితిత్తుల ఆపరేషన్‌, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, తదితర శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని వైద్యులు ఆమెకు తెలిపారు. ఆమె కోలుకోవడానికే దగ్గర దగ్గర ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుంది. దీని కారణంగా ఆమె జీవితంలో ఆమె ఏ బరువైనా వస్తువుని పైకి ఎత్తలేదు, తనంతట తాను స్వయంగా లేవలేదు.

కాగా యూకే మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకారం గర్భనిరోధక ఇంప్లాంట్‌ వికటించిన కేసులు 18 ఉన్నాయి. అలాగే ఆమెలా గుండె పల్మనరీ ధమనుల్లోకి పరికరం చేరిన కేసులు 107 ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వాస్తవానికి ఆ పరికరం పనిచేయకపోతే ఇలా గుండెల్లోకి నేరుగా చొచ్చుకుపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరాలు గర్భధారణను నివారించడంలో 99% సమర్థవంతంగా పనిచేస్తుందని, పైగా ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్యులు. ఐతే ఇలా కొన్ని కేసుల్లో ఈ పరికరం ఎందుకు వికటిస్తోందో తెలియాల్సి ఉందన్నారు. దీని గురించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందన్నారు ఆరోగ్య నిపుణులు.

(చదవండి: క్యాన్సర్‌కు సంబంధించి భారత్ ఎన్ని మందులు ఫ్రీగా ఇస్తోందంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement