గుండె వైఫల్యాన్ని ముందే గుర్తిస్తుంది..!
రోగి కంటే ముందే గుండె వైఫల్యాన్ని గుర్తించే సరికొత్త ఇంప్లాంట్ ఇది. ‘కార్డియోమెమ్స్’ అనే ఈ పరికరాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం తీసుకెళ్లే పుప్పుస ధమనిలో అమర్చుకుంటే చాలు.. రోగి జీవితాంతం బ్యాటరీ సైతం అవసరం లేకుండానే పనిచేస్తుంది. పుప్పుస ధమనిలో బీపీ(రక్తపోటు)ని, గుండె కొట్టుకునే తీరును ఇది నిరంతరం సెన్సర్ల ద్వారా పరిశీలిస్తుంది. గుండె వైఫల్యానికి దారితీసేలా రక్తపోటులో తేడా వచ్చిన తక్షణమే రిసీవర్‌కు సమాచారం పంపుతుంది. ఆ వెంటనే రిసీవర్ నుంచి వైద్యులకు సమాచారం చేరుతుంది.
వైద్యులు వెంటనే రోగికి ఏ మందులు వేసుకోవాలో చెప్పడంతో పాటు తగిన సూచనలు చేస్తారు. దీనిని ఇప్పటిదాకా ఏడుగురిలో అమర్చగా కచ్చితత్వంతో పనిచేసిందని లండన్‌లోని రాయల్ బ్రాంప్టన్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. గుండె వైఫల్యం ముప్పు ఎక్కువగా ఉండే రోగులకు ఇది బాగా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. దీని ధర సుమారు రూ. 12 లక్షలు.