లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) ఇటీవల ఎక్కువగా వింటున్న పదం. కోవిడ్ తర్వాత గుండె వైఫల్యం చెందిన వారిని ఎక్కువగా చూస్తున్నట్లు హృద్రోగ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో ఉన్న కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందించే పక్రియ గుండె పంపింగ్ చర్యలపై ఆధారపడి ఉంటుంది. గుండె తన సామర్థ్యానికి తగిన విధంగా రక్తాన్ని పంపింగ్ చేయలేని స్థితిని హార్ట్ ఫెయి ల్యూర్ అంటారని వైద్యులు చెపుతున్నారు. కొందరిలో హార్ట్ పంపింగ్ సాధారణ స్థితిలో ఉన్నా ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చని పేర్కొంటున్నారు.
ఇందుకు అనేక కారణాలు ఉంటాయని సూచిస్తున్నారు. గుండె పంపింగ్ తగ్గి హార్ట్ ఫెయి ల్యూర్ అయిన వారితో పాటు, గుండె పంపింగ్‌లో తరచూ వ్యత్యాసాలు ఉండి హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీసి సడన్ డెత్ అయిన వారిని కూడా చూస్తున్నామని వివరిస్తున్నారు. గుండె వైఫల్యాన్ని ముందుగా గుర్తించి, మెరుగైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సూచిస్తున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు అధునాతన చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
హార్ట్ ఫెయిల్యూర్‌కు కారణాలు
మధుమేహం, రక్తపోటు, గుండె రక్తనాళాల్లో పూడికలు, సైలెంట్ హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. వైరల్ జ్వరం వచ్చిన వారిలో కూడా ఒక్కోసారి హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. గర్భిణులు, బాలింతల్లోనూ హార్మోన్ల అసమతుల్యత వల్ల, కిడ్నీ రోగుల్లో హార్ట్ ఫెయిల్యూర్ ఎదురవ్వొచ్చని పేర్కొన్నారు. జెనటిక్‌గా కూడా హార్ట్ ఫెయిల్యూర్ సంభవించొచ్చని వివరిస్తున్నారు. గుండె వైఫల్యంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వారానికి పది మంది వరకు, ప్రయివేటు ఆస్పత్రులకు 100 మంది వరకూ కొత్త రోగులు వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
లక్షణాలు ఇవీ..
హార్ట్ ఫెయిల్యూర్ అయిన వారు ఆయాసం, నీరసం, నిస్సత్తువ, అలసట, కనీస వ్యాయామం చేయలేక పోవడం, కాళ్లలో, పొట్టలో వాపు, నీరు చేరడం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.
తొలిదశలో గుర్తించడం ముఖ్యం
గుండె వైఫల్యం చెందిన వారిని తొలిదశలో గుర్తించడం చాలా ముఖ్యం. హార్ట్ ఫెయిల్యూర్‌కు గురైన వారికి సత్వర వైద్యం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు. క్వాడ్రాఫుల్ థెరపీ, ఎమర్జెన్సీ బైపాస్ శస్త్ర చికిత్సలతో హార్ట్ ఫెయిల్యూర్ రోగుల జీవన ప్రమాణాలను పదేళ్ల పాటు పొడిగించొచ్చని పేర్కొంటున్నారు. కొన్ని ప్రత్యేకమైన అత్యాధునిక డివైజ్‌లు, క్లిష్టతరమైన కరోనరీ ఇటర్వెన్షనల్ పక్రియల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు ఉపశమనం కలిగించొచ్చని సూచిస్తున్నారు.
తొలి దశలో గుర్తించాలి
ఇటీవల కాలంలో హార్ట్ ఫెయిల్యూర్ రోగులను ఎక్కువగా చూస్తున్నాం. కోవిడ్ తర్వాత రోగులు పెరిగారు. హార్ట్ ఫెయిల్యూర్ గుండె పంపింగ్ తగ్గడంతో పాటు, పంపింగ్ నార్మల్‌గా ఉన్న వారిలో కూడా జరుగుతుంది. తొలిదశలో గుర్తించడం ద్వారా ఫెయిల్యూర్‌ను నివారించేందుకు ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ, అత్యవసర బైపాస్ సర్జరీతో పాటు, పలు డివైజ్‌లు ఉన్నాయి.
– డాక్టర్ బి.విజయ్‌చైతన్య, కార్డియాలజిస్టు, విజయవాడ ప్రభుత్వాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment