20లోగా ‘కర్మయోగి’ కోర్సులను పూర్తి చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆధునికతకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు సమర్థంగా సేవలందించాలన్నా.. భవిష్యత్తు కార్యాచరణకు సర్వసన్నద్ధంగా ఉండాలన్నా నిరంతర అభ్యసన అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ కర్మయోగి భారత్ అందించే ఆన్‌లైన్ కోర్సులను ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేసి, సర్టిఫికెట్లు పొందాలని అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ లక్ష్మీశ.. ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) సలహాదారు ఎం.వెంకటేశ్వరస్వామితో కలిసి ఐగాట్ కర్మయోగి కోర్సులపై వివిధ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ తాను కూడా ఇటీవల మూడు కోర్సులను పూర్తిచేశానని.. జిల్లా పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది ఈ కోర్సులను పూర్తిచేయాలన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌తో అనుసంధానించిన మొబైల్ నంబర్‌తో సంబంధిత వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి హార్ట్ ఇన్ గవర్నెన్స్, కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓరియెంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ కోర్సులు పూర్తిచేయొచ్చన్నారు. మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని కూడా ఈ కోర్సులు పూర్తిచేయొచ్చని తెలిపారు. సర్టిఫికెట్ కోర్సుల వివరాలను వెంకటేశ్వరస్వామి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ మూడు కోర్సులను 90 నిమిషాల వ్యవధిలో చాలా తేలిగ్గా పూర్తిచేయడం ద్వారా కర్మ పాయింట్లు సాధించవచ్చని తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన కర్మచారిలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్జెట్స్, రివార్డులు, సర్టిఫికెట్లతో పాటు సీఎం చేతుల మీదుగా నగదు బహుమతి కూడా ఉంటుందని వివరించారు. ఏపీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలపర్తి వెంకటేశ్వరరావు నేతృత్వంలో కోర్సుల పూర్తికి ఉద్యోగులకు సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment