అన్నమో రామచంద్రా!
జూనియర్ కళాశాలల్లో అమలు కాని మధ్యాహ్న భోజనం
ఎదురు చూస్తున్న 21,500 మంది విద్యార్థులు
జూలై ఒకటి నుంచే ప్రారంభిస్తామన్న ప్రభుత్వం
స్పష్టత ఇవ్వని విద్యాశాఖాధికారులు
సంగెం : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై అయోమయం నెలకొంది. పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు జూనియర్ కళాశాలల్లో జూలై ఒకటి నుంచే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. అయితే నెల రోజులు దాటినా ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్లలో ఆయా మండలాల పరిధిలోని గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన బాలబాలికలు సైతం వస్తున్నారు. అందుబాటులో ఉన్న విద్యార్థులు బస్సులు, లేదంటే ఆటోలు, సైకిళ్లపై, కాలినడకన కళాశాలలకు వచ్చి వెళ్తుంటారు. ఉదయం 9:30 గంటలకు కాలేజీకి రావాలంటే ఇంటి నుంచి 7–8 గంటల మధ్యనే బయలుదేరాల్సి వస్తోందని, తిరిగి వెళ్లేసరికి రాత్రి అవుతోందని, దీంతో మధ్యాహ్నం ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు చెపుతున్నారు.