సమ్మెకు సై అంటున్న బ్యాంకులు
చెన్నై: కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా త్వరలోనే బ్యాంకులు సమ్మెకు దిగనున్నాయి. దాదాపు 10 లక్షల బ్యాంకులు జులై 29నుంచి సమ్మె చేపట్టనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ నేత ఒకరు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన యునైడెట్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఎఎన్ఎస్ కు తెలిపారు. బ్యాకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్ల (AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, INBOC, NOBW, NOBO) ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐబీఈఎ) గురువారం ఒక ప్రకటలో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపర్చేవిగా ఉన్నాయని ఎఐబీఈఎ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం ఆరోపించారు. ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణ, కొత్త బ్యాంకు లైసెన్సుల జారీ, క్యాపిటల్ ఇన్ఫూజన్, ఏకీకరణ, విలీనం, గ్రామీణ బ్యాంకుల్లో ప్రయివేటు మూలధనం అనుమతి పెంపు తదితర చర్యల వల్ల బ్యాంకులు నిర్వీర్యమయ్యే ప్రమాదముందని వెంకటాచలం హెచ్చరించారు.
ఇప్పటికే బ్యాంకింగ్ సెక్టార్ లో చెడు రుణాల మొత్తం రూ.10 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. పెద్ద మొత్తంలో రుణాలను ఎగవేస్తున్న కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకోకవడమే దీనికి కారణమన్నారు. బ్యాంకు ప్రయోజనాలకు భిన్నంగా కార్పొరేట్ సంస్థలకు రుణాల మంజూరు, మాఫీ జరుగుతోందన్నారు. బ్యాంకులకు అప్పులను ఎగవేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 7,000 మందికిపైగా డిఫాల్టర్ల తో 60,000కోట్ల రుణ భారం బ్యాంకింగ్ రంగంపై పడిందని వెంకటాచలం తెలిపారు.