పని చేయకపోతే కాళ్లు పట్టుకుంటాం
♦ సీఎం దయతోనే 21 ఇన్‌క్లైన్ పునరుద్ధరణ
♦ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఇల్లెందుఅర్బన్(కొత్తగూడెం) : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి ఓటు వేసి గెలిపించ ండి..మా గల్లా పట్టుకోండి .. పని చేయలేకపోతే కార్మికుల కాళ్లు పట్టుకుంటామే తప్ప ఎవరికి తలవంచే పరిస్థితి ఉత్పన్నం కాదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో 21 ఇన్‌క్లైన్, జేకేఓసీలో ఏర్పాటు చేసిన పిట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించడానికి కేసీఆర్ కొత్తచట్టాన్ని కూడా రూపొందించడానికి వెనుకాడరని, కార్మికులు అధైర్యపడ్డవద్దన్నారు.
కార్మికులకు లాభాల వాటా 16 శాతంను 23 శాతం పెంచిన సీఎం తమ సహకారంతో మరింత పెంచేందుకు కృషి చేస్తారన్నారు. ఇల్లెందు ఏరియా 21 ఇన్‌క్లైన్ మూతపడే దశలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, కార్మిక నేతలు తమ దృష్టికి వచ్చిన సందర్భంలో సీఎం కేసీఆర్‌కు ఒకే ఒక్క ఫోన్ కాల్ చేయగా తను వెంటనే స్పందించి గని జీవితకాలం పెంచారన్నారు. టీబీజీకేఎస్‌తోనే సింగరేణి సంస్థ పరిరక్షించ బడుతుందని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతోనే సింగరేణి సంస్థ పరిరక్షించబడుతుందన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు గెలవడం వల్ల కార్మికులకు ఒరిగేదేమిలేదన్నారు. టీబీజీకేఎస్‌ను గెలిపించుకుని సింగరేణి పుట్టినిల్లయిన బొగ్గుట్టను కాపాడుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపునిచ్చారు. ఈ పిట్‌మీటింగ్‌లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీబీజీకేఎస్ నేతలు లింగాల జగన్నాథం, గడ్డం వెంకటేశ్వర్లు, రంగనాథ్ సుదర్శన్, కనగాల పేరయ్య, పీవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.