నాలుగు జిల్లాలకు కలిపి డీహెచ్ఓ
మారనున్న డీఎంహెచ్ఓ పోస్టు
డీసీహెచ్ఎస్ పోస్టు కనుమరుగు
ఎంజీఎం : జిల్లాల పునర్విభజనతో వైద్య ఆరోగ్యశాఖలో మార్పులు భారీ కానున్నాయి. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులను జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోకి తెచ్చేలా అధికారులు ప్రాతి పాదనలు సిద్ధం చేశారు. దీంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పోస్టు కాస్త జిల్లా హెల్త్ ఆఫీసర్ (డీహెచ్ఓ)గా మారనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో వైద్యవిధాన పరిషత్, వైద్యారోగ్యశాఖ ఆస్పత్రులను డీహెచ్ఓ పర్యవేక్షిస్తారని పేర్కొంటున్నారు. ఈమేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
భవనాల కోసం కసరత్తు
వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోనే హన్మకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రాతిపాదనలు చేయడంతోపాటు భూపాలపల్లి వైద్యారోగ్యశాఖ కార్యాలయం కోసం సింగరేణి జీఎంను సంప్రదించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే మహబూబ్‌బాద్‌లో ఎలాంటి ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో అద్దె భవనం కోసం ప్రయత్నిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పరిధిలోకి వచ్చేలా ప్రతిపాదనలు చేయడంతో వైద్యావిధాన పరిషత్ కోఆర్డినేటర్ పోస్టు కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది.
పీహెచ్‌సీల విభజన పూర్తి
ఓరుగల్లు జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో నాలుగు జిల్లాలకు 69 పీహెచ్‌సీల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వరంగల్ జిల్లాలో ఏర్పడే జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో ఉన్న 17 మండలాలకు 18 పీహెచ్‌సీలతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల కమ్యూనిటీ హెల్త్సెంటర్లు కేటాయించారు. హన్మకొండ జిల్లాకు 19 మండలాల్లోని 22 పీహెచ్‌సీలతోపాటు స్టేషన్‌ఘన్‌పూర్, హుజూ రాబాద్, జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్ సెం టర్లు, భూపాలపల్లి పరిధిలో ఉండే 15 మండలాలకు 23 పీహెచ్‌సీలతోపాటు చిట్యాల, మహాదేవ్‌పూర్, ములుగు, ఏటూర్‌నాగారం సీహెచ్‌సీలు వస్తాయి. మహబూబాబాద్ జిల్లాలోని 12 మండలాలకు 14 పీహెచ్‌సీలు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రితోపాటు గుడూ రు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండేలా విభజన ప్రక్రియ ప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి అధికారులు పంపారు. అలాగే జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న 93 మందిని ఈ నాలుగు జిల్లాల వైద్యారోగ్యశాఖ కార్యాలయాలకు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.