ఎయిమ్స్ సీవీఓకు పెరుగుతున్న మద్దతు
న్యూఢిల్లీ: ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీఓ) సంజీవ్ చతుర్వేదికి మద్దతుగా సంతకాల సేకరణ కొనసాగుతోంది. ఎయిమ్స్ డాక్టర్లు చేస్తున్న ఈ ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఎయిమ్స్ సీవీఓగా విధులు నిర్వర్తిస్తున్న చతుర్వేదిని పదవి నుంచి తొలగిస్తూ సీనియర్ అధికారుల బృందం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
చతుర్వేది నిజాయతీపరుడైన అధికారి అని, విధి నిర్వహణలో ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, ఎయిమ్స్‌లోని అనేకమంది అవినీతి అధికారుల బాగోతాలను ఆయన బయటపెట్టారని ఆందోళనకారులు తెలిపారు. అందుకే ఆయనకు మద్దతుగా సంతకాల సేకరణను ప్రారంభించామని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపా రు. ఎయిమ్స్ హక్కుల సంఘం ఆధ్వరంలో నిర్వహిస్తున్న ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ స్పందన కనిపిస్తోందన్నారు. నిజాయతీపరుడైన అధికారిని తొలగించడం ద్వారా సిబ్బందికి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకావశముందని హెచ్చరిస్తున్నారు.
ఈ విషయమై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ... ‘సీవీఓ పదవికి చతుర్వేది అనర్హుడు. అందుకే ఆయనను ఎయిమ్స్‌లో కొనసాగించాలని భావించడంలేదు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనుమతి లేకుండానే ఆయన పదవిని చేపట్టినట్లు తెలిసింది. అందుకే ఆయనను విధుల నుం చి తప్పిస్తున్నాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనుమతి లేకుండా ఎవరు కూడా సీవీఓలుగా పదవులు చేపట్టే అవకాశం లేదు. ఈ విషయం మా దృష్టికి రావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా తొలగించడంలో తప్పేమీ లేద’న్నారు.
ఇదిలాఉండగా కేంద్ర మంత్రిత్వశాఖ ఎటువంటి కారణం చెప్పకుండానే చతుర్వేదిని పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో విశ్వాస్ మెహతాను నియమిస్తున్నట్లు కూడా ఎయిమ్స్‌కు సమాచారం పంపింది. హర్యానా ఫారెస్ట్ సర్వీస్, 2002 బ్యాచ్‌కు చెందిన చతుర్వేది నిజానికి 2016 వరకు కొనసాగాల్సి ఉంది. నాలుగేళ్ల విధి నిర్వహణ పూర్తి కాకుండానే రెండేళ్లకే అతణ్ని పదవి నుంచి తొలగించారు. గడిచిన రెండేళ్ల తన పదవీకాలంలో చతుర్వేది అనేక అవినీతి బాగోతాలను బయటపెట్టారు. ఎయిమ్స్‌లో ఆయన బయటపెట్టిన అవినీతిపై సీబీఐ కూడా పలు కేసులు నమోదు చేసి, విచారిస్తోంది.
దీంతో ఆయన వ్యవహారం సీనియర్ అధికారులకు ఇబ్బందికరంగా మారినందునే ఆయనను పదవి నుంచి తప్పించేందుకు కుట్రలు పన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చతుర్వేదిని విధుల నుంచి తప్పించిన సీనియర్ అధికారుల్లో కూడా ఆయనంటే పడనివారు ఉన్నారని, నిజాయతీగా నడుచుకోవడం వల్లే ఆయనను ఎయిమ్స్ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారని పలువురు సిబ్బంది, డాక్టర్లు ఆరోపిస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు.