భారత్ ప్రాజెక్టులకు ఆస్ట్రేలియా అంగీకారం
మెల్బోర్న్: భారత్తో పలు ప్రాజెక్టులకు ఆస్ట్రేలియా అంగీకారం తెలిపింది. విద్యా, సైన్స్, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాలకు సంబంధించి 19 ప్రాజెక్టులలో భారత్తో కలిసి పనిచేయడానికి ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 3.22 కోట్లను తమ దేశం కేటాయించిందని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి జులీ బిషాప్ బుధవారం తెలిపారు.
నీటి శుద్ధీకరణ వ్యవస్థ మరింత అభివృద్ధి చేసి దేశంలో నీటి సరఫరాను సమర్థవంతంగా అమలు చేసేందుకుగాను, మహిళల హక్కులను తెలిపే వెబ్సైట్, న్యాయ సలహాలు ఇచ్చేందుకు కార్యాలయాలు నెలకొల్పడానికిగాను ఈ నిధులు ఉపయోగించనున్నట్లు ఆమె వెల్లడించారు. హాకీలో యువ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి అనుగుణంగా ముంబైలోని పలు స్టేడియాల అభివృద్ధికి, భారత్– ఆస్ట్రేలియా దేశాల మధ్య చారిత్రక ఒప్పందాలను తెలియజేస్తూ చేపట్టబోయే సాహిత్యపరమైన ప్రదర్శనలకు ఈ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.