పెట్టుబడులే లక్ష్యంగా సంస్కరణలు: జైట్లీ
న్యూఢిల్లీ: పెట్టుబడులే లక్ష్యంగా భారత్‌ను సంస్కరణల పథంలో నడిపించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ముఖ్యంగా మౌలిక రంగంలో పెట్టుబడులకు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భారత్-బ్రిటన్ టెక్ రెండవరోజు సదస్సులో జైట్లీ మాట్లాడారు. రక్షణాత్మక విధానాలు ఆర్థిక వ్యవస్థ విస్తరణకు అడ్డంకని అన్నారు. కొన్ని అభివద్ధి చెందుతున్న దేశాలు ఇలాంటి ధోరణిని అవలంభిస్తున్నప్పటికీ భారత్ మాత్రం ఇలాంటి విధానాలకు దూరమని వివరించారు.
భారత్ ఆర్థికాభివృద్ధి వేగం ప్రపంచంలోనే అధికంగా ఉన్నప్పటికీ, భారత్‌కు ఇప్పటికీ ఈ వృద్ధి తీరుపై సంతప్తి లేదన్నారు. మరింత వృద్ధి రేటు సాధన అవసరమని వివరించారు. తయారీ రంగంలో పెట్టుబడులకు భారత్ తగిన అవకాశాలను కల్పిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో 15%గా ఉన్న తయారీ రంగం వాటా 25%కి చేరాల్సిన అవసరముందని పేర్కొన్న ఆయన, ఇది దేశంలో భారీ ఉపాధి కల్పనకు దారితీస్తుందని విశ్లేషించారు.