అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల అదృశ్యం
అమెరికాలోని న్యూయార్క్ నగరం నుంచి పది రోజుల క్రితం ఓ భారతీయ నర్సింగ్ విద్యార్థి అదృశ్యం అయ్యి, ఇంకా దొరక్కముందే ఫ్లోరిడాలో మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద రీతిలో అదృశ్యమయ్యాడు. పనామా సిటీ బీచ్‌కి శనివారం నాడు వచ్చిన రెనీ జోస్ అనే విద్యార్థి సోమవారం సాయంత్రం నుంచి అదృశ్యం అయినట్లు ఫ్లోరిడీ బే కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది. ఇంటి వెనుక ఉన్న చెత్తకుప్పలోమాత్రం అతడి దుస్తులు కనిపించాయి. అతడు చదువుతున్న రైస్ యూనివర్సిటీ కూడా అతడు అదృశ్యమైన విషయాన్ని నిర్ధారించింది. జోస్ ముందుగా లాథమ్లోని షకేర్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసి, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కోసం రైస్ యూనివర్సిటీలో చేరినట్లు అతడి ఫేస్బుక్ పేజీ ద్వారా తెలిసింది. అతడి సోదరి రేష్మా తన సోదరుడి ఆచూకీ తెలుసుకోడానికి ఫేస్బుక్ పేజీ ఒకటి క్రియేట్ చేసింది.
ఇంతకుముందు జాస్మిన్ వి. జోసెఫ్ (22) అనే విద్యార్థిని కూడా అదృశ్యం అయ్యింది. ఆమె ఆచూకీ తెలుసుకోడానికి స్థానికులు సాయం చేయాలని పోలీసులు కోరారు. తమ కుమార్తెకు న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరేందుకు ఫీజు కట్టినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతుండగా, యూనివర్సిటీ వాళ్లు మాత్రం ఆమె గత మే నెల నుంచి తమ వర్సిటీలో చేరలేదని అంటున్నారు. ఆమె క్లాసులకు వెళ్తోందో లేదో తల్లిదండ్రులకు తెలీదని, ఆమె మార్కులు కూడా వాళ్లెప్పుడూ చూడలేదని చెబుతున్నారు. తమ కుమార్తె ప్రవర్తన పట్ల కూడా వారికి ఎప్పుడూ అనుమానం రాలేదు. ఆమె ఆచూకీ తెలుసుకోడానికి వాళ్లిప్పుడు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.