Indian Army chief General Bipin Rawat
-
ఉగ్రవాదుల నియంత్రణలో పీఓకే
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. గిల్గిత్–బల్టిస్తాన్, పీఓకేలు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నాయని శుక్రవారం పేర్కొన్నారు. 1947 అక్టోబర్ 24న మహారాజ హరిసింగ్ భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే కశ్మీర్ భారత్‌లో విలీనమైందన్నారు. ఆర్టికల్ 370 కూడా తాత్కాలికమైందేనన్నారు. భారత భూభాగాలైన పీఓకే, గిల్గిత్–బల్టిస్తాన్‌లను పాక్ ఆక్రమించుకొని వాటిని ఉగ్రస్థావరాలుగా మార్చిందన్నారు. ఇటీవల యాపిల్ వ్యాపారులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై స్పందించారు. ఇది ముమ్మాటికి పాక్ ఉగ్రవాదుల పనేనని, కశ్మీర్లో దుకాణాలు తెరవనివ్వకుండా భయపెట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులను సైతం భయపెడుతున్నారన్నారు. శాంతియుత పరిస్థితులను కల్లోలంగా మార్చడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం కశ్మీర్లో శాంతిని, అభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు. -
ఆ బాధ వాళ్లకూ తెలియాలి
జైపూర్ / ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల అనాగరిక చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ఓ బీఎస్ఎఫ్ జవాన్ గొంతును పాక్ సైనికులు కత్తితో కోయడం, కశ్మీర్లో పోలీసులను ఉగ్రవాదులు కిడ్నాప్‌చేసి హత్యచేసిన ఘటనలపై రావత్ ఈ మేరకు స్పందించారు. జైపూర్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారత జవాన్లపై పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు పాల్పడుతున్న ఇలాంటి అనాగరిక, ఆటవిక ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాక్ వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ బాధేంటో వాళ్లకూ తెలియాలి. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్ పాటించే అనారిగక, ఆటవిక విధానాలను భారత్ అనుసరించకూడదు’ అని తెలిపారు. సరిహద్దులో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను పాక్ సైన్యం తుపాకితో కాల్చి, గొంతు కోయడంపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కావనీ, దీనిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: పాక్ రావత్ వ్యాఖ్యలపై పాక్ తీవ్రంగా స్పందించింది. భారత్‌తో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే దేశ ప్రయోజనాల రీత్యా శాంతినే ఆకాంక్షిస్తున్నామని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ తెలిపారు. -
వారి బాధను పంచుకుందామనే వచ్చా
శ్రీనగర్ : దేశ రక్షణలో ప్రాణాలొదిలిన ఆర్మీ జవాన్లను జాతి ఎన్నటికీ మరచిపోదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇండియన్ ఆర్మీ 44వ రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేస్తున్న ఔరంగజేబును అపహరించిన హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్రవాదులు గురువారం అతన్ని కాల్చి చంపిన విషయం తెలిసిందే. పూంచ్ జిల్లాలోని శాలినీ గ్రామంలో ఔరంగాజేబు కుంటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు. ‘చెట్టంత ఎదిగిన కొడుకును కోల్పోయిన కుటుంబం బాధను పంచుకుందామని వచ్చాను. సైనికుల సేవలను యావత్ భారత జాతి సదా స్మరించుకుంటుంది. ఔరంగజేబు పేరు శాశ్వతంగా నిలిచిఉంటుంద’ని వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. బాధిత కుటుంబానికి కేంద్రం సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. నిర్మలా సీతారామన్ వెంట ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్, శరన్‌జీత్ సింగ్, కల్నల్ ఎన్ఎన్ జోషి ఉన్నారు. ఔరంగజేబు కుటుంబానికి ఆర్మీ ఎల్లవేళలా అండగా ఉంటుందని రావత్ అన్నారు. దేశంలో ఉగ్రమూకల ఆగడాలకు నూకలు దగ్గర పడ్డాయని అన్నారు. రంజాన్ పండుగ జరుపుకుందామని డ్యూటీ నుంచి ఇంటికి బయలుదేరిన ఔరంగజేబును గురువారం కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు కాల్చి చంపారు. గతంలో ఆర్మీ జరిపిన ఎన్కౌంటర్లకు సంబంధించిన వివరాలు తెలపాలనీ, చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసిన వీడియో వైరల్‌గా మారింది. కరడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది సవిూర్ టైగర్‌ను మట్టుబెట్టడంలో ఔరంగజేబు కీలక పాత్రపోషించారు. -
పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్: ఆర్మీ చీఫ్
- టెర్రరిస్టు స్థావరాలపై దాడి ‘మన హక్కు’ - ఏక్షణంలోనైనా మెరుపు దాడికి సిద్ధమన్న జనరల్ బిపిన్ రావత్ న్యూఢిల్లీ: గత ఏడాది సెప్టెంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్లపై మెరుపుదాడి చేసిన విధంగా మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పారు. భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించే ఉగ్రవాదుల పీచమణచడం ‘మన హక్కు’ అని ఆయన పునరుద్ఘాటించారు. తద్వారా ఉగ్రవాద సంస్థలకు, వారికి సహకరిస్తోన్న పాకిస్థాన్ సైన్యానికి పరోక్ష హెచ్చరికలు చేశారు. అవసరంమైన క్షణంలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి వెలసిన ఉగ్రస్థావరాలపై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగుతామని మంగళవారం రాత్రి ఓ జాతీయ చానెల్‌కు ఇంటర్వ్యూలో ఆర్మీచీఫ్ వెల్లడించారు. (పీఓకేలో భారత కమాండోల మెరుపు దాడి) సెప్టెంరబ్ 29నాటి సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహకర్తల్లో ఒకరైన రావత్.. ఆర్మీ డిప్యూటీ చీఫ్ హోదాలో నాటి దాడుల ఆపరేషన్‌ను స్వయంగా పరిశీలించారు. పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా నిర్వహించిన తొలి సర్జికల్ స్ట్రైక్స్ గురించిన పలు విషయాలనూ జనరల్ రావత్ వెల్లడించారు. ‘పాక్ సైన్యం నుంచి శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడానికి సిద్దంగా ఉన్న ఏడు లాంచ్ ప్యాడ్లను టార్గెట్ చేశాం. ఇందుకోసం బృహత్ప్రణాళిక రచించించి పకడ్బందీగా అమలుచేశాం. మన సైనికుల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తూనే భీకర దాడులు చేపట్టాం. అది రియల్‌టైమ్ ఆపరేషన్ కాబట్టి బేస్ క్యాంపుల నుంచి ఆదేశాల జారీ కూడా అంతే త్వరగా జారీ అయ్యాయి. ఎల్వోసీ నుంచి 2కిలోమీటర్ల దూరంలోని స్థావరాలపై దాడులుచేసి మనవాళ్లు సూర్యోదయానికల్లా తిరిగి వచ్చేశారు. ఆపరేషన్ మొత్తాన్ని డ్రోన్ కెమెరాలతో రికార్డుచేశాం’ అని ఆర్మీ చీఫ్ వివరించారు. భారత సైన్యానికి 29వ చీఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ గత వారమే బాధ్యతలు చేపట్టడం, సీనియర్లను పక్కనపెట్టి పెద్ద పోస్టుకు రావత్‌ను ఎంపిక చేయడంపై వివాదం చెలరేగడం తెలిసిందే. (చదవండి: ఆర్మీ చీఫ్ నియామకంపై వివాదం) దీనిపై విలేకరి అడిగిన ప్రశ్నకు, ‘ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యక్తిగా నేనైనా, మరొకరైనా ప్రభావితం చేయలేరు. ఒకవేళ అలా జరిగితే ఎవరికివారు కోరుకున్న పదవులు దక్కించుకుంటారు కదా!’అని జనరల్ రావత్ బదులిచ్చారు. ఆర్మీ చీఫ్ పదవికి చేపట్టేందుకు అర్హులై ఉండి కూడా రావత్ నియామకంతో ఆ అవకాశాన్ని కోల్పోయిన ఇద్దరు సీనియర్ అధికారులను (లెఫ్టినెంట్ జనరల్ ప్రవీన్ బక్షి(ఈస్ట్రన్ కమాండ్ చీఫ్), లెఫ్టినెంట్ జనరల్ పి.ఎం. హరీజ్(సదరన్ కమాండ్ చీఫ్)) ఉద్దేశంచి మాట్లాడుతూ.. ‘మేమంతా కలిసే ఎదిగాం. ఒకే కంచం, ఒకే మంచం అన్న చందంగా వారితో నాకు స్నేహం ఉంది. వారిద్దరూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోగలరు’అని జనరల్ రావత్ పేర్కొన్నారు.