పాక్‌పై మరో సర్జికల్‌ స్ట్రైక్: ఆర్మీ చీఫ్‌ | more surgical strikes if needed: Indian Army chief General Bipin Rawat | Sakshi
Sakshi News home page

పాక్‌పై మరో సర్జికల్‌ స్ట్రైక్: ఆర్మీ చీఫ్‌

Published Wed, Jan 4 2017 9:35 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

పాక్‌పై మరో సర్జికల్‌ స్ట్రైక్: ఆర్మీ చీఫ్‌

పాక్‌పై మరో సర్జికల్‌ స్ట్రైక్: ఆర్మీ చీఫ్‌

- టెర్రరిస్టు స్థావరాలపై దాడి ‘మన హక్కు’
- ఏక్షణంలోనైనా మెరుపు దాడికి సిద్ధమన్న జనరల్‌ బిపిన్‌ రావత్‌


న్యూఢిల్లీ: గత ఏడాది సెప్టెంబర్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రరిస్టు లాంచ్‌ ప్యాడ్లపై మెరుపుదాడి చేసిన విధంగా మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేపడతామని ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించే ఉగ్రవాదుల పీచమణచడం ‘మన హక్కు’ అని ఆయన పునరుద్ఘాటించారు.

తద్వారా ఉగ్రవాద సంస్థలకు, వారికి సహకరిస్తోన్న పాకిస్థాన్‌ సైన్యానికి పరోక్ష హెచ్చరికలు చేశారు. అవసరంమైన క్షణంలో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి వెలసిన ఉగ్రస్థావరాలపై మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌కు దిగుతామని మంగళవారం రాత్రి ఓ జాతీయ చానెల్‌కు ఇంటర్వ్యూలో ఆర్మీచీఫ్‌ వెల్లడించారు. (పీఓకేలో భారత కమాండోల మెరుపు దాడి)



సెప్టెంరబ్‌ 29నాటి సర్జికల్‌ స్ట్రైక్స్‌ వ్యూహకర్తల్లో ఒకరైన రావత్‌.. ఆర్మీ డిప్యూటీ చీఫ్‌ హోదాలో నాటి దాడుల ఆపరేషన్‌ను స్వయంగా పరిశీలించారు. పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా నిర్వహించిన తొలి సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించిన పలు విషయాలనూ జనరల్‌ రావత్‌ వెల్లడించారు. ‘పాక్‌ సైన్యం నుంచి శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడానికి సిద్దంగా ఉన్న ఏడు లాంచ్‌ ప్యాడ్లను టార్గెట్‌ చేశాం. ఇందుకోసం బృహత్‌ప్రణాళిక రచించించి పకడ్బందీగా అమలుచేశాం. మన సైనికుల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తూనే భీకర దాడులు చేపట్టాం. అది రియల్‌టైమ్‌ ఆపరేషన్‌ కాబట్టి బేస్‌ క్యాంపుల నుంచి ఆదేశాల జారీ కూడా అంతే త్వరగా జారీ అయ్యాయి. ఎల్‌వోసీ నుంచి 2కిలోమీటర్ల దూరంలోని స్థావరాలపై దాడులుచేసి మనవాళ్లు సూర్యోదయానికల్లా తిరిగి వచ్చేశారు. ఆపరేషన్‌ మొత్తాన్ని డ్రోన్‌ కెమెరాలతో రికార్డుచేశాం’ అని ఆర్మీ చీఫ్‌ వివరించారు.

భారత సైన్యానికి 29వ చీఫ్‌గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ గత వారమే బాధ్యతలు చేపట్టడం, సీనియర్లను పక్కనపెట్టి పెద్ద పోస్టుకు రావత్‌ను ఎంపిక చేయడంపై వివాదం చెలరేగడం తెలిసిందే. (చదవండి: ఆర్మీ చీఫ్‌  నియామకంపై వివాదం) దీనిపై విలేకరి అడిగిన ప్రశ్నకు, ‘ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యక్తిగా నేనైనా, మరొకరైనా ప్రభావితం చేయలేరు. ఒకవేళ అలా జరిగితే ఎవరికివారు కోరుకున్న పదవులు దక్కించుకుంటారు కదా!’అని జనరల్‌ రావత్‌ బదులిచ్చారు.

ఆర్మీ చీఫ్‌ పదవికి చేపట్టేందుకు అర్హులై ఉండి కూడా రావత్‌ నియామకంతో ఆ అవకాశాన్ని కోల్పోయిన ఇద్దరు సీనియర్‌ అధికారులను (లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రవీన్‌ బక్షి(ఈస్ట్రన్‌ కమాండ్‌ చీఫ్‌), లెఫ్టినెంట్‌ జనరల్‌ పి.ఎం. హరీజ్‌(సదరన్‌ కమాండ్‌ చీఫ్‌)) ఉద్దేశంచి మాట్లాడుతూ.. ‘మేమంతా కలిసే ఎదిగాం. ఒకే కంచం, ఒకే మంచం అన్న చందంగా వారితో నాకు స్నేహం ఉంది. వారిద్దరూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకోగలరు’అని జనరల్‌ రావత్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement