29సార్లు ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్తాన్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ యథేచ్చగా కాల్పలు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం పాకిస్తాన్ ఇప్పటివరకూ 29సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా, రాజౌరి సెక్టార్‌ల్లో పాక్ బలగాలు గతరాత్రి కాల్పులకు పాల్పడ్డాయి. అయితే అప్రమత్తంగా ఉన్న భద్రతా సిబ్బంది సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. కాల్పుల్లో ఓ జవాను గాయపడినట్లు ఆర‍్మీ అధికారులు తెలిపారు.
మూడు రోజుల వ్యవధిలో పాక్ కాల్పులు జరపడం ఇది రెండోసారి. కాగా సర్టికల్ స్ట్రైక్స్ దాడుల నేపథ్యంలో పలుమార్లు పాక్ తన దుర్భిద్ధిని ప్రదర్శించింది. పూంఛ్, రాజౌరీ, ఝానగర్, మక్రీ, నౌషెరా, గిగ్రియల్, ప్లాటాన్, పుల్వామా, బల్లోయ్, కృష్ణగాటి తదితర ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. మరోవైపు పాక్ కాల్పుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. కాల్పుల మోతలో పరిసర ప్రాంతాలు తరచు దద్దరిల్లుతున్నాయి.