పూంఛ్ : యుద్ధోన్మాదంతో పేట్రేగుతోన్న పాకిస్తాన్.. భారత పల్లెలే లక్ష్యంగా దాడులు జరుపుతున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి గడిచిన మూడురోజుల్లో పలుమార్లు కాల్పులకు పాల్పడింది. దీంతో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ), సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి భయానకవాతావరణం నెలకొంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ఐదు జిల్లాల్లో బార్డర్‌కు దగ్గరగా ఉన్న పాఠశాలలను శనివారం నుంచి మూయించారు.
‘జమ్ము, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో సరిహద్దును ఆనుకుని ఉన్న స్కూళ్లన్నింటినీ మూసేశాం. వచ్చే మూడురోజుల వరకు వాటిని తెరవకూడదని సిబ్బందిని ఆదేశించాం. పరిస్థితిని బట్టి మరోమారు ఆదేశాలు జారీచేస్తాం’ అని అధికారులు మీడియాకు చెప్పారు.
మూడురోజుల్లో 9 మంది మృతి : భారత పల్లెలే లక్ష్యంగా పాక్ బలగాలు జరుపుతోన్న కాల్పుల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది చనిపోయారు. వారిలో ఐదుగురు సాధారణ పౌరులుకాగా, ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు, ఇద్దరు ఆర్మీ సిబ్బంది ఉన్నారు. ఇటీవల భారత సైన్యం మినీ సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ బలగాల్ని మట్టుపెట్టిన తర్వాత సరిహద్దులో మళ్లీ యుద్ధవాతావరణం నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై ఇరుదేశాలూ ఆయా రాయబారులకు నిరసనలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment