న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ ఆగడాలు సరిహద్దుల్లో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికి పాక్ మాత్రం దాన్ని తుంగలో తొక్కుతూ తరచూ సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇదే తరహా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే సరిహద్దులో అప్రమత్తంగా ఉండే భారత సైన్యం… పాకిస్తాన్ దాడులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉంటుంది. అయితే 17 ఏళ్లలో మొదటిసారి సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎక్కువసార్లు ఉల్లంఘించింది. ఈ జనవరి నుంచి సెప్టెంబర్ 7 వరకు దాదాపు తొమ్మిది నెలల్లో 3186 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలిపింది. అయితే ప్రతిసారి భారత సైన్యం పాకిస్తాన్‌ను సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా, పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ ప్రాంతంలో 242 సరిహద్దు కాల్పులు (జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు) జరిగాయని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రాజ్యసభలో తెలిపారు. (చదవండి: భారత్‌పై ఆన్‌లైన్ వార్‌కు పాక్ కుట్ర)
ఈ ఏడాది కాల్పుల విరమణ ఉల్లంఘనల సందర్భంగా ఎనిమిది మంది ఆర్మీ సిబ్బంది దేశం కోసం మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు చంపబడ్డారు, అనేక ఇళ్ళు, భవనాలు ధ్వంసమయ్యాయని శ్రీపాద్ నాయక్ తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు 2,432 కాల్పుల విరమణ ఉల్లంఘనలు నమోదయ్యాయని ఇవి అప్రకటిత దాడులే కాక 2003 కాల్పుల విరమణ అవగాహనకు విరుద్ధంగా జరిగాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉపసంహరణతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని గతేడాది ఆగస్టులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం కూడా పెరిగింది. 2019 అంతటా సుమారు 2,000 కాల్పుల విరమణ ఉల్లంఘనలు మాత్రమే జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment