శ్రీనగర్ : భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కాశ్మీర్లోని యురి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పుల్లో భారత్ సైనిక అధికారి మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్తాన్కు పరిపాటిగా మారిపోయింది.
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఎలాంటి కాల్పులు ఉండకూడదంటూ 2003 నవంబర్ నెలలో ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం ఒకటి కుదిరింది. అయితే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండానే పాక్ దళాలు పదే పదే కాల్పులకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వద్ద, జమ్ము కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ దళాలు కాల్పులకు పాల్పడుతున్నట్లు భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి.