మళ్లీ యూరిలో బరితెగించిన పాకిస్థాన్!
18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ కు దీటుగా జవాబు చెప్పేందుకు భారత్ సన్నద్ధమవుతున్న తరుణంలోనే ఆ దేశం మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది. యూరి సెక్టర్‌లో దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. చిన్నస్థాయి ఆయుధాలతో భారత ఆర్మీ పోస్టు లక్ష్యంగా 20 రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో భారత సైన్యం దీటుగా బదులు ఇచ్చింది.
కాగా, యూరి సెక్టర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. లాచిపుర ప్రాంతంలో దాడులకు దిగిన ఉగ్రవాదులను భారత సైన్యం ఏరిపారేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పదిమంది ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
యూరి ఉగ్రవాద దాడితో రగిలిపోతున్న భారత్.. 26/11 ముంబై దాడుల అనంతరం పాకిస్థాన్‌ను ఏవిధంగా అయితే అంతర్జాతీయంగా ఇరకాటంలో పెట్టిందో ఇప్పుడు కూడా అదేవిధంగా పాక్ ను ఏకాకిని చేయాలని నిశ్చయించింది. దౌత్యపరంగా, ఆర్థికంగా, సైనికంగా పాక్ కు దీటుగా బదులు చెప్పేందుకు వ్యూహం రచించాలని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించింది. భారత భూభాగంలో ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్థాన్ తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో సరిహద్దుల్లో మళ్లీ పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం గమనార్హం.
యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.