భారత్- పాక్ సరిహద్దుల్లో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే పర్యటించి 24 గంటలు గడవ లేదు. పాక్ మరోసారి భారత్ సరిహద్దుల్లోని ఆర్ ఎస్ పురా, పర్గవాల్ సెక్టార్లోని బీఎస్ఎఫ్ పోస్ట్లు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఆ ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం అర్థరాత్రి నుంచి దాదాపు ఆరు గంటల పాటు పాక్ బలగాలు ఎడతెరిపి లేకుండా కాల్పులు జరిపారని సీనియర్ పోలీసు అధికారి బుధవారం వెల్లడించారు. క్షతగాత్రులు మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ఇరుదేశాల సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ సమీపంలోని భారత్ భూభాగంపై పాక్ భద్రతా దళాలు తరుచుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అంతేకాకుండా భారత్లో పాక్ తీవ్రవాదుల చోరబాట్లు అధికమైనాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి షిండే భారత్, పాక్ సరిహద్దుల్లో మంగళవారం పర్యటించిన సంగతి తెలిసిందే.
అలాగే స్థానిక భద్రత దళ ఉన్నతాధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. అందులోభాగంగా బీఎస్ఎఫ్ సిబ్బందితో షిండే ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 సార్లకు పైగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిందని ఈ సందర్భంగా షిండే తెలిపారు.