ఔరంగజేబు కుటుంబంతో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
శ్రీనగర్ : దేశ రక్షణలో ప్రాణాలొదిలిన ఆర్మీ జవాన్లను జాతి ఎన్నటికీ మరచిపోదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇండియన్ ఆర్మీ 44వ రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేస్తున్న ఔరంగజేబును అపహరించిన హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్రవాదులు గురువారం అతన్ని కాల్చి చంపిన విషయం తెలిసిందే. పూంచ్ జిల్లాలోని శాలినీ గ్రామంలో ఔరంగాజేబు కుంటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు.
‘చెట్టంత ఎదిగిన కొడుకును కోల్పోయిన కుటుంబం బాధను పంచుకుందామని వచ్చాను. సైనికుల సేవలను యావత్ భారత జాతి సదా స్మరించుకుంటుంది. ఔరంగజేబు పేరు శాశ్వతంగా నిలిచిఉంటుంద’ని వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. బాధిత కుటుంబానికి కేంద్రం సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. నిర్మలా సీతారామన్ వెంట ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్, శరన్‌జీత్ సింగ్, కల్నల్ ఎన్‌ఎన్ జోషి ఉన్నారు. ఔరంగజేబు కుటుంబానికి ఆర్మీ ఎల్లవేళలా అండగా ఉంటుందని రావత్ అన్నారు. దేశంలో ఉగ్రమూకల ఆగడాలకు నూకలు దగ్గర పడ్డాయని అన్నారు.
రంజాన్ పండుగ జరుపుకుందామని డ్యూటీ నుంచి ఇంటికి బయలుదేరిన ఔరంగజేబును గురువారం కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు కాల్చి చంపారు. గతంలో ఆర్మీ జరిపిన ఎన్‌కౌంటర్లకు సంబంధించిన వివరాలు తెలపాలనీ, చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసిన వీడియో వైరల్‌గా మారింది. కరడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది సవిూర్ టైగర్‌ను మట్టుబెట్టడంలో ఔరంగజేబు కీలక పాత్రపోషించారు.
Comments
Please login to add a commentAdd a comment