indian coastguard
-
ఒబామా వస్తున్నారనే కుట్ర?
కొత్త సంవత్సరం వేడుకల్లో అంతా మునిగి ఉంటారు. ఆ సమయంలో ఎవరూ పట్టించుకోరు కాబట్టి సులభంగా దేశంలో ప్రవేశించవచ్చు.. జనవరి 26వ తేదీ.. రిపబ్లిక్ డే నాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి, ఆ రోజున భారతదేశంలో భారీగా ఉగ్రదాడులకు పాల్పడాలి.. స్థూలంగా ఇదీ లష్కరే తాయిబా ఉగ్రవాదుల కుట్ర. ఈ విషయం కోస్ట్ గార్డ్ సిబ్బంది, నిఘా వర్గాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందించిన నివేదికలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే... వాళ్ల కుట్రను ముందుగానే పసిగట్టిన భారతీయ కోస్ట గార్డ్ సిబ్బంది.. దాన్ని సమర్థంగా భగ్నం చేయగలిగారు. లష్కరే తాయిబా ఉగ్రవాదులు వేసుకొచ్చిన బోటులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అందులో కనీసం నలుగురు ఉన్నారని, వాళ్లను కోస్ట్ గార్డ్ సిబ్బంది దాదాపు గంటపాటు వెంటాడటంతో.. చివరకు వాళ్లు తమను తాము పేల్చేసుకున్నారని సమాచారం. పాక్ తాలిబన్లు పెషావర్ లోని ఓ పాఠశాలలో 130 మంది పిల్లలను కాల్చి చంపిన తర్వాతే భారత నిఘా సంస్థలు మన దేశం మీద ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు పంపాయి. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. లష్కరే తాయిబా ఉగ్రవాదుల మాటలను తాము ఇంటర్సెప్ట్ చేశామని, దాంట్లోనే ఉగ్రవాద దాడి విషయం తెలిసిందని నిఘా వర్గాలు చెప్పాయి. 26/11 దాడి వెనక కూడా లష్కర్ హస్తం ఉన్న విషయం తెలిసిందే. ఆనాటి దాడిలో 166 మంది మరణించారు. ఇక ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు ఒకరు రావడం ఇదే మొదటిసారి. దాంతో.. ఇలాంటి సందర్భాన్నే తాము వాడుకోవాలని ఉగ్రవాదులు కూడా భావించినట్లు తెలిసింది. -
ఉగ్రవాద దాడియత్నం.. ఎప్పుడేం జరిగింది?
* అది డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి సమయం. పోర్బందర్ తీరానికి సరిగ్గా 365 కిలోమీటర్ల దూరంలో పాక్ వైపు నుంచి ఓ బోటు అనుమానాస్పదంగా రావడాన్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది గమనించారు. * ఆ మత్స్యకార బోటును వెంటనే ఆపాల్సిందిగా బోటులోని వారికి కోస్ట్ గార్డ్ సిబ్బంది హెచ్చరికలు జారీచేశారు. * కానీ బోటులో ఉన్నవాళ్లు వినిపించుకోలేదు. బోటు స్పీడు పెంచి, అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. * హెచ్చరికగా కోస్ట్ గార్డ్ సిబ్బంది కాల్పులు జరిపి..బోటు సమీపంలోకివళ్లారు. * కోస్ట్ గార్డ్ సిబ్బంది పాక్ బోటును దాదాపు గంట సేపు వెంబడించారు. * ఎట్టకేలకు బోటుకు అత్యంత సమీపంలోకి కోస్ట్ గార్డ్ సిబ్బంది వెళ్లి చూశారు. *అయితే బోటు సిబ్బంది మొత్తం డెక్ కింది భాగంలో దాక్కుని ఉన్నారు. వాళ్లను లొంగిపోవాలని హెచ్చరించగా కొద్ది సేపటికే తమను తాము పేల్చేసుకున్నారు. * ఫిషింగ్ బోటులో మొత్తం నలుగురు మాత్రమే ఉన్నారు. అయితే అందులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నాయి. దాంతో భారీ ఎత్తున పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. * ఈ పేలుడు నుంచి ఎవరైనా తప్పించుకున్నారేమోనన్న అనుమానంతో కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు నేవీ హెలికాప్టర్లు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు జరిపాయి. * కరాచీ సమీపంలోని కేతిబందర్ ప్రాంతం నుంచి ఈ బోటు బయల్దేరినట్లు భారత వర్గాలు గుర్తించాయి. * ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నేవీ చీఫ్ గత నెలలోనే చెప్పారు. -
గుజరాత్ తీరంలో పాక్ ఉగ్రవాదుల కలకలం
-
గుజరాత్ తీరంలో పాక్ ఉగ్రవాదుల కలకలం
గుజరాత్ తీరంలో కలకలం రేగింది. భారతదేశంపై ఉగ్రవాద దాడి చేసేందుకు పాకిస్థాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు ఓ నౌకలో పోర్బందర్ తీరం గుండా మన దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే.. వారి ప్రయత్నాన్ని భారత కోస్ట్ గార్డ్ బృందాలు గమనించాయి. వెంటనే వాళ్లను వెంబడించి, గంట పాటు వారిని నిలువరించారు. పట్టుకోడానికి ప్రయత్నం చేయగా, ఈలోపు నౌకలోని ఉగ్రవాదులు తమ నౌకను తామే పేల్చేసుకున్నారు. భారతదేశం మీద మరో ఉగ్రవాద దాడి జరిపేందుకు పాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ముంబై మీద ఉగ్రదాడి చేసినప్పుడు కూడా ఇలాగే జలమార్గంలోనే ముంబైకి దూరంగా తీరంలోకి చిన్నబోటు సాయంతో ప్రవేశించారు. అయితే ఈసారి మన కోస్ట్ గార్డ్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడంతో ఉగ్రవాదులు ఆత్మాహుతి చేసుకున్నారు. మత్స్యకారుల బోటులో వచ్చి భారత దేశంలో జనవరి ఒకటోతేదీన విధ్వంసం సృష్టించాలని లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు ప్రయత్నించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. ముందుగా ఓ నౌకలో పోర్ బందర్ వరకు వచ్చిన ఉగ్రవాదులు... ఆ తర్వాత ఓ మత్స్యకార బోటు ద్వారా దేశంలోకి ప్రవేశించాలనుకున్నారు. అయితే.. వాళ్లు ఇంకా నౌకలో ఉండగానే అనుమానించిన కోస్ట్ గార్డ్ బృందాలు వాళ్లను వెంబడించడంతో.. భయపడి తమకు తాము పేల్చేసుకున్నారు. ఈ మేరకు కోస్ట్ గార్డ్ అందించిన రహస్య నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరింది. పోర్బందర్కు 360 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కరాచీలోని కేతిబందర్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు ఓ నౌకలో బయల్దేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బోటులో నలుగురు ఉన్నట్లు కోస్ట్ గార్డ్ బృందాలు గుర్తించాయి. లష్కరే తాయిబా బృందాలు దాడికి పాల్పడొచ్చని ఐబీ బృందాలు ఇటీవలే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. జనవరి 1న.. లేదా జనవరి 26న ఉగ్రవాద దాడి జరగొచ్చని ముందుగానే హెచ్చరికలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలకు తగినట్లుగానే తాజా ఘటన జరగడంతో.. రాష్ట్రాలన్నింటినీ కేంద్రం మరోసారి హెచ్చరించింది.