
ఒబామా వస్తున్నారనే కుట్ర?
కొత్త సంవత్సరం వేడుకల్లో అంతా మునిగి ఉంటారు. ఆ సమయంలో ఎవరూ పట్టించుకోరు కాబట్టి సులభంగా దేశంలో ప్రవేశించవచ్చు.. జనవరి 26వ తేదీ.. రిపబ్లిక్ డే నాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి, ఆ రోజున భారతదేశంలో భారీగా ఉగ్రదాడులకు పాల్పడాలి.. స్థూలంగా ఇదీ లష్కరే తాయిబా ఉగ్రవాదుల కుట్ర.
ఈ విషయం కోస్ట్ గార్డ్ సిబ్బంది, నిఘా వర్గాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందించిన నివేదికలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే... వాళ్ల కుట్రను ముందుగానే పసిగట్టిన భారతీయ కోస్ట గార్డ్ సిబ్బంది.. దాన్ని సమర్థంగా భగ్నం చేయగలిగారు. లష్కరే తాయిబా ఉగ్రవాదులు వేసుకొచ్చిన బోటులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అందులో కనీసం నలుగురు ఉన్నారని, వాళ్లను కోస్ట్ గార్డ్ సిబ్బంది దాదాపు గంటపాటు వెంటాడటంతో.. చివరకు వాళ్లు తమను తాము పేల్చేసుకున్నారని సమాచారం. పాక్ తాలిబన్లు పెషావర్ లోని ఓ పాఠశాలలో 130 మంది పిల్లలను కాల్చి చంపిన తర్వాతే భారత నిఘా సంస్థలు మన దేశం మీద ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు పంపాయి. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. లష్కరే తాయిబా ఉగ్రవాదుల మాటలను తాము ఇంటర్సెప్ట్ చేశామని, దాంట్లోనే ఉగ్రవాద దాడి విషయం తెలిసిందని నిఘా వర్గాలు చెప్పాయి. 26/11 దాడి వెనక కూడా లష్కర్ హస్తం ఉన్న విషయం తెలిసిందే. ఆనాటి దాడిలో 166 మంది మరణించారు.
ఇక ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు ఒకరు రావడం ఇదే మొదటిసారి. దాంతో.. ఇలాంటి సందర్భాన్నే తాము వాడుకోవాలని ఉగ్రవాదులు కూడా భావించినట్లు తెలిసింది.