గుజరాత్ తీరంలో కలకలం రేగింది. భారతదేశంపై ఉగ్రవాద దాడి చేసేందుకు పాకిస్థాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు ఓ నౌకలో పోర్బందర్ తీరం గుండా మన దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే.. వారి ప్రయత్నాన్ని భారత కోస్ట్ గార్డ్ బృందాలు గమనించాయి. వెంటనే వాళ్లను వెంబడించి, గంట పాటు వారిని నిలువరించారు. పట్టుకోడానికి ప్రయత్నం చేయగా, ఈలోపు నౌకలోని ఉగ్రవాదులు తమ నౌకను తామే పేల్చేసుకున్నారు. భారతదేశం మీద మరో ఉగ్రవాద దాడి జరిపేందుకు పాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ముంబై మీద ఉగ్రదాడి చేసినప్పుడు కూడా ఇలాగే జలమార్గంలోనే ముంబైకి దూరంగా తీరంలోకి చిన్నబోటు సాయంతో ప్రవేశించారు. అయితే ఈసారి మన కోస్ట్ గార్డ్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడంతో ఉగ్రవాదులు ఆత్మాహుతి చేసుకున్నారు. మత్స్యకారుల బోటులో వచ్చి భారత దేశంలో జనవరి ఒకటోతేదీన విధ్వంసం సృష్టించాలని లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు ప్రయత్నించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. ముందుగా ఓ నౌకలో పోర్ బందర్ వరకు వచ్చిన ఉగ్రవాదులు... ఆ తర్వాత ఓ మత్స్యకార బోటు ద్వారా దేశంలోకి ప్రవేశించాలనుకున్నారు. అయితే.. వాళ్లు ఇంకా నౌకలో ఉండగానే అనుమానించిన కోస్ట్ గార్డ్ బృందాలు వాళ్లను వెంబడించడంతో.. భయపడి తమకు తాము పేల్చేసుకున్నారు. ఈ మేరకు కోస్ట్ గార్డ్ అందించిన రహస్య నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరింది. పోర్బందర్కు 360 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కరాచీలోని కేతిబందర్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు ఓ నౌకలో బయల్దేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బోటులో నలుగురు ఉన్నట్లు కోస్ట్ గార్డ్ బృందాలు గుర్తించాయి. లష్కరే తాయిబా బృందాలు దాడికి పాల్పడొచ్చని ఐబీ బృందాలు ఇటీవలే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. జనవరి 1న.. లేదా జనవరి 26న ఉగ్రవాద దాడి జరగొచ్చని ముందుగానే హెచ్చరికలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలకు తగినట్లుగానే తాజా ఘటన జరగడంతో.. రాష్ట్రాలన్నింటినీ కేంద్రం మరోసారి హెచ్చరించింది.
Published Fri, Jan 2 2015 4:48 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement