Indian cricket fan
-
ఐసోలేషన్‌లో రోహిత్ శర్మ
మెల్బోర్న్: భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ అభిమానం కారణంగా భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్ శర్మ, యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, పృథ్వీ షా, వికెట్‌కీపర్ రిషభ్ పంత్, పేసర్ నవదీప్ సైనీలను ఐసోలేషన్‌కు తరలించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం వెల్లడించింది. ఆటగాళ్లు బయో బబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది. ► సీఏ ప్రొటోకాల్ ప్రకారం ఆటగాళ్లు ఇన్డోర్ ప్రదేశాల్లో భోజనం చేయకూడదు. ప్రజా రవాణా వ్యవస్థను వాడకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ కాలిబాటన వారికి సమీపంలోని అవుట్డోర్ వేదికలకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ► అయితే శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా మెల్బోర్న్లోని సమీప రెస్టారెంట్‌కు వెళ్లి భారత క్రికెటర్లు అల్పాహారం చేస్తుండగా... అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వారికి తెలియకుండా క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. ఇది తెలుసుకున్న రోహిత్ శర్మ తనను వారించినట్లు, రిషభ్ పంత్ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని ఆ అభిమాని ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో ఈ సంగతి సీఏ దృష్టికి వచ్చింది. ► బయో బబుల్ దాటి వచ్చారనే ఆరోపణలతో తాజాగా సీఏ ఈ ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచింది. దీంతో వీరు ప్రయాణాల్లో, ప్రాక్టీస్ సమయాల్లో... మిగతా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7 నుంచి జరుగనున్న మూడో టెస్టు కోసం ఇరు జట్లు 2 రోజుల ముందుగా సిడ్నీకి వస్తాయి. ► ‘ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మన వాళ్లకు నిబంధనల గురించి బాగా తెలుసు. వారిపై బీసీసీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టడం లేదు. రెండో టెస్టు లో భారత్ చేతిలో ఓటమి అనంతరం ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఇలాంటి ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేస్తోంది. మూడో టెస్టు ముందర భారత జట్టును కలవరపెట్టేందుకు ఇది ఓ ప్రయత్నమైతే, ఇది చాలా చెడ్డ కుట్ర అని భావించవచ్చు. ఇప్పుడు ఈ వివాదం 2007–08లో జరిగిన ‘మంకీ గేట్’ నాటి పరిస్థితులను తలపిస్తోంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వివరణ ఇచ్చారు. రెస్టారెంట్లో భారత క్రికెటర్లు -
బాబ్బాబు... గెలవండి ప్లీజ్!
డియర్ ధోని అండ్ కో... ఐపీఎల్ వినోదాన్ని ఆస్వాదించాక భారత జట్టు బంగ్లాదేశ్ వెళుతోందంటే ఏముందిలే అనుకున్నాం. టైమ్‌పాస్ చేస్తూ క్లీన్‌స్వీప్ చేసి వస్తారని భావించాం. కానీ తొలి వన్డే ఫలితం చూసి షాక్ తిన్నాం. అయినా... ఏముందిలే ఒక ‘బ్యాడ్ డే’ ఉంటుందిగా అని సరిపెట్టుకున్నాం. కానీ రెండో వన్డేలో మరింత ఘోరంగా ఓడిన తర్వాత ఒక్కసారిగా అయోమయంలోకి వెళ్లాం. ఈ జట్టేనా... ప్రపంచకప్‌లో సెమీస్ దాకా వెళ్లింది. ఈ క్రికెటర్లేనా ఐపీఎల్లో సిక్సర్ల మోత మోగించింది! * బంగ్లాదేశ్ జట్టు మెరుగుపడిందని అంటున్నారు. మంచిదే... మన పక్క దేశంలో పసికూనలా ఉన్న జట్టు ఎదిగితే సంతోషమే. కానీ దానికి మనం ‘బలి’ కావడమే జీర్ణించుకోలేకపోతున్నాం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లను సంచ లన ఆటతీరుతో వణికించే ధోనిసేన బంగ్లా ముందు ఎందుకు ఇంతలా తేలిపోతోందో అర్థం కాక బుర్రలు బద్దలవుతున్నాయి. అసలు అంత చిత్తుగా ఓడిపోవడం ఏంటి? బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ఆడుకున్న పిచ్ మీద మనం 200 చేయడానికే మల్లగుల్లాలు పడుతున్నాం. ఏం జరుగుతోంది? సమస్య ఎక్కడ వచ్చింది? దీనికి సమాధానం మీకైనా తెలిస్తే ఫర్వాలేదు. * 19 ఏళ్ల బక్కపలచని కుర్రాడు ముస్తాఫిజుర్ వేసిన బంతులు మీకు బాంబుల్లా ఎలా కనిపిస్తున్నాయో అర్థం కావడం లేదు. స్టెయిన్‌కు చుక్కలు చూపించి... అండర్సన్‌ను చితక్కొట్టి... జాన్సన్‌ను వణికించిన బ్యాట్స్‌మెన్... ఒక కొత్త బంగ్లా బౌలర్‌ని ఆడటానికి ఎందుకు తడబడుతున్నారు. ఏదో ఒక్క మ్యాచ్‌లో అలా జరిగిందంటే అనుకోవచ్చు. వరుసగా రెండో వన్డేలోనూ తనకే వికెట్లు ఎలా ఇచ్చారు? అంటే మీ సన్నాహాలు సరిగా లేవా? హోమ్ వర్క్ చేయడం లేదా? ప్రాక్టీస్‌లో ఫుట్‌బాల్ ఆడే బదులు... నెట్స్‌లో అలాంటి బంతులు ఆడితే ఉపయోగం ఉంటుందేమో... ఒక్కసారి ఆలోచించండి. * బంగ్లా చేతిలో ఇలాంటి ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ అందరూ ఒకేలా ఉండరు. మైదానం బయట మీ ‘సరదాలు’ చూసి ముచ్చటపడిన వాళ్లే... ఇప్పుడు అవే ‘సరదాల’ వల్ల మీ ఆట దెబ్బతిన్నదని తిడుతున్నారు. గత ఐదేళ్లలో ఎన్నో ఘనతలు సాధించారు. ప్రపంచకప్, చాంపియన్స్‌ట్రోఫీ గెలిచారు. ఆ రోజు ఎంతో సంబరపడ్డాం. పండగ చేసుకున్నాం. ప్రతి రోజూ గెలవడం సాధ్యం కాదని తెలుసు. కానీ బంగ్లాదేశ్ చేతిలో క్లీన్‌స్వీప్ అయితే మాత్రం చరిత్ర క్షమించదు. * ప్రపంచ క్రికెట్ ఆర్థికంగా భారత్ మార్కెట్‌పై ఆధారపడింది. ఈ మార్కెట్ బాగుండాలంటే భారత్ నిలకడగా ఆడుతూ ఉండాలి. ఇప్పటికే చాలా మంది క్రికెట్ చూడటం తగ్గించారు. ఇక ఇలాంటి ఫలితాలే వస్తే ‘వీరాభిమానులు’ కూడా టీవీలు కట్టేస్తారు. అప్పుడు ప్రపంచ క్రికెట్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. అందుకే జాగ్రత్త. * ఈ రెండు రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒకరేమో ‘డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చెడింది’ అంటున్నారు. మరొకరేమో ‘శాస్త్రికి, ధోనికి సరిపడటం లేదంటున్నారు’...! ఫలితాలు సరిగా రానప్పుడు ఇలాంటి వార్తలు రావడం సహజం. అయినా వాటితో మాకు సంబంధం లేదు. మాకు కావలసింది క్రికెట్ వినోదం. భారత్ జట్టు గెలవడం. పాపం... వీరాభిమాని సుధీర్ పరిస్థితి చూడండి. గతంలో ఢాకాలో స్వేచ్ఛగా తిరిగిన మన అభిమాని ఇప్పుడు స్టేడియానికి రావడానికి గడగడలాడుతున్నాడు. మీ కోసం ప్రాణమిచ్చే అలాంటి అభిమాని కోసమైనా కనీసం ఆఖరి వన్డేలో అయినా గెలవండి. ప్లీజ్..! -సగటు భారత క్రికెట్ అభిమాని