ఐసోలేషన్‌లో రోహిత్‌ శర్మ | Rohit Sharma And Four Other Indian Cricketers Put In Isolation | Sakshi
Sakshi News home page

ఐసోలేషన్‌లో రోహిత్‌ శర్మ

Published Sun, Jan 3 2021 5:32 AM | Last Updated on Sun, Jan 3 2021 5:32 AM

Rohit Sharma And Four Other Indian Cricketers Put In Isolation - Sakshi

మెల్‌బోర్న్‌: భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ అభిమానం కారణంగా భారత జట్టు టెస్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్‌ శర్మ, యువ ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్, పృథ్వీ షా, వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్, పేసర్‌ నవదీప్‌ సైనీలను ఐసోలేషన్‌కు తరలించినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం వెల్లడించింది. ఆటగాళ్లు బయో బబుల్‌ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది.  

► సీఏ ప్రొటోకాల్‌ ప్రకారం ఆటగాళ్లు ఇన్‌డోర్‌ ప్రదేశాల్లో భోజనం చేయకూడదు. ప్రజా రవాణా వ్యవస్థను వాడకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ కాలిబాటన వారికి సమీపంలోని అవుట్‌డోర్‌ వేదికలకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.  

► అయితే శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా మెల్‌బోర్న్‌లోని సమీప రెస్టారెంట్‌కు వెళ్లి భారత క్రికెటర్లు అల్పాహారం చేస్తుండగా... అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వారికి తెలియకుండా క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. ఇది తెలుసుకున్న రోహిత్‌ శర్మ తనను వారించినట్లు, రిషభ్‌ పంత్‌ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని ఆ అభిమాని ట్విట్టర్‌ వేదికగా పంచుకోవడంతో ఈ సంగతి సీఏ దృష్టికి వచ్చింది.  

► బయో బబుల్‌ దాటి వచ్చారనే ఆరోపణలతో తాజాగా సీఏ ఈ ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచింది. దీంతో వీరు ప్రయాణాల్లో, ప్రాక్టీస్‌ సమయాల్లో... మిగతా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7 నుంచి జరుగనున్న మూడో టెస్టు కోసం ఇరు జట్లు 2 రోజుల ముందుగా సిడ్నీకి వస్తాయి.   

► ‘ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మన వాళ్లకు నిబంధనల గురించి బాగా తెలుసు. వారిపై బీసీసీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టడం లేదు.  రెండో టెస్టు లో భారత్‌ చేతిలో ఓటమి అనంతరం ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఇలాంటి ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేస్తోంది.  మూడో టెస్టు ముందర భారత జట్టును కలవరపెట్టేందుకు ఇది ఓ ప్రయత్నమైతే, ఇది చాలా చెడ్డ కుట్ర అని భావించవచ్చు. ఇప్పుడు ఈ వివాదం 2007–08లో జరిగిన ‘మంకీ గేట్‌’ నాటి  పరిస్థితులను తలపిస్తోంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వివరణ ఇచ్చారు.
రెస్టారెంట్‌లో భారత క్రికెటర్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement