Indian Freedom
-
ఇక్కడ విన్నపాలు అక్కడ విల్లంబులు..
బొంబాయి మహా నగరంలో డిసెంబర్, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది. అది ఆంగ్లేయుల మీద ప్రతిఘటనకు అంకురమని చెప్పడం తొందరపాటు. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ఒక్కసారే తిరస్కరించకుండా, దశల వారీగా పాలనలో భారతీయులకు భాగస్వామ్యం సాధించడం ఆ సంస్థ పోరాట సూత్రం. సరిగ్గా అదే సమయంలో 1885 డిసెంబర్లోనే విశాఖ మన్యంలో ఆంగ్ల పాలన మీద ప్రతిఘటనకు వినూత్న ప్రయత్నం జరిగింది. వారి లక్ష్యం కూడా ఆంగ్ల పాలనకు నిరసనే. కానీ కాంగ్రెస్ పోకడకు పూర్తి విరుద్ధం. సడక అనే కొండగ్రామంలో ఉన్న పోతుకూరి మాలడు అనే శివసారిని, పక్క గ్రామం శివసారి సలాబి బోడడు వచ్చి కలుసుకున్నాడు. శివసారి అంటే కొండదేవతల పూజారి. ప్రఖ్యాత చరిత్రకారుడు డేవిడ్ ఆర్నాల్డ్ రాసిన ‘రెబెలియస్ హిల్మెన్: ది గూడెం రంపా రైజింగ్స్ 1839–1924’ అనే వ్యాసంలో (సబాల్టరన్ స్టడీస్–1, రైటింగ్స్ ఆన్ సౌత్ ఆసియన్ హిస్టరీ అండ్ సొసైటీ) గిరిజనోద్యమాల గురించి సవివరంగా చెప్పారు. ప్లాసీ యుద్ధం (1757) జరిగిన కొద్దికాలానికే కొండకోనలలో ప్రతిధ్వనించిన ఆ సమరాల గురించి ఎందరో చరిత్రకారులు, రచయితలు రాశారు. తెలుగు సహా అన్ని భాషలలోను వందలాది వ్యాసాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ అధికారులు రాసిన రహస్య నివేదికలలో ఎంతో సమాచారం ఉంది. డేవిడ్ ఆర్నాల్డ్ వీటి ఆధారంగానే తెలుగు ప్రాంతంలో జరగిన ఆ దశ గిరిజనోద్యమ చరిత్రకు అక్షరరూపం ఇచ్చారు. కాంగ్రెస్ తొలి సమావేశంలో పాల్గొన్నవారు 72 మంది. వారు దేశం నలుమూలల నుంచి వచ్చారు. అప్పటికే విశ్వవిద్యాలయాల వరకు వెళ్లిన ఉన్నత విద్యావంతులు. విశాఖ మన్యంలోని సడక కేంద్రంగా శివసారులు దాదాపు 20 మంది, వీరి వెనుక కొందరు మన్య గ్రామాల మునసబులు, స్థానికులు ఆంగ్ల పాలన మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆంగ్లేయుల అతిథి గృహాలనే కాదు, పోలీస్ స్టేషన్లనీ తగులబెట్టారు. బ్రిటిష్ ఏలుబడికి ఎదురైన ప్రతిఘటనలలో గిరిజనోద్యమాలు చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. ఈస్టిండియా కంపెనీ దుష్ట పాలనలోను, దీనికేమీ తీసిపోని ఇంగ్లండ్ సింహాసనం ఏలుబడిలో కూడా తమదైన పంథాలో గిరిజనులు ఆయుధమెత్తారు. వ్యవసాయంలో వ్యాపార ధోరణి పెరగడం, అటవీ సంపదను దోచుకునేందుకు అడవుల మీద ఆధిపత్యం చలాయించడం, అటవీ సంపదను మైదాన ప్రాంతాల ప్రయోజనాల కోసం తరలించడం వంటి యోచనలతో అక్కడికి రకరకాల పేర్లతో అటవీ అధికారుల పేరుతో, కాంట్రాక్టర్ల పేరుతో, వడ్డీ వ్యాపారం పేరుతో ‘నాగరికులు’ చొరబడడం, కొన్ని క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు గిరిజనులను ప్రతిఘటన ధోరణి వైపు నడిపించాయి. ఇవి దేశమంతటా కనిపించినా, చరిత్రలో తగిన స్థానం దక్కలేదు. ఇప్పుడిప్పుడే ఆ లోటును భర్తీ చేసే ప్రక్రియ ఉపందుకుంది. అయితే ఏ గిరిజనోద్యమమూ శాంతియుతంగా జరగలేదు. అవన్నీ గెరిల్లా పోరాటాలే. లక్ష్యం మాత్రం ఆంగ్లాధిపత్యం. లేదా వాళ్ల రక్షణలో తమని దోచుకుంటున్న స్వదేశీయులే. కానీ ఈ ప్రతిఘటనలలో కంపెనీ బలగాల కర్కశత్వం వాస్తవం. ఎందరో గిరిజన నేతల కంఠాలకు ఉరి బిగిసింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ఎంతో ముందు నుంచే కొండకోనలలో గిరిజనులు ఆంగ్ల పాలనను సుస్పష్టంగా ప్రతిఘటించారు. నిర్ద్వంద్వంగా నిరాకరించారు. వీటి వెనుక స్వేచ్ఛా సంస్కృతుల రక్షణ, ఆర్థికకోణం ఉన్నాయి. అడవి మీద తమ హక్కును రక్షించుకోవడానికి జరిగినవే కూడా. అలాగే ఒకటి రెండు సందర్భాలలో మైదాన ప్రాంతంలో, ఉత్తర భారతంలో ఆరంభమై, దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించిన 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరం ప్రభావం తమ మీద ఉన్నట్టు ఒకరిద్దరు గిరిజన నాయకులు చెప్పడం విస్మయం కలిగిస్తుంది. కాబట్టి స్వరాజ్య పోరాట చరిత్ర అంటే మైదాన ప్రాంతంలో జరిగిన ఉద్యమంతో సమాంతరంగా అడవిబిడ్డల పోరాటం గురించి చెప్పడం సరైన చారిత్రక దృష్టి, స్పృహ అవుతాయని గుర్తించాలి. బెంగాల్‌లోని మిద్నపూర్ ప్రాంతం, జంగల్‌మహల్ అనేచోట చౌర్స్ గిరిజనులు ఉంటారు. వీరు స్థానిక జమీందారుల దగ్గర పనిచేసేవారు. వీళ్లకి జీతాల బదులు పన్ను కట్టనవసరం లేని భూమి ఇచ్చేవారు. కానీ కంపెనీ భూమి మీద విపరీతంగా పన్నులు వేయడంతో జమీందార్లు తిరుగుబాటు చేశారు. 1768–69, 1799లలో ఈ తిరుగుబాట్లు జరిగాయి. 1768లో మొదట ఘటశిల జమీందారు లేదా ధల్భూవ్ు రాజు జగన్నాథ్ సింగ్ తిరుగుబాటు ఆరంభించాడు. ఇతడికి ఇతర జమీందారులు, 50,000 మంది చౌర్స్ మద్దతుగా నిలిచారు. దీనితో జగన్నాథ్‌కు జమీని తిరిగి ఇచ్చేసింది ఈస్టిండియా కంపెనీ. ధద్కర్ శ్యామ్ గంజన్ నాయకత్వంలో మళ్లీ 1771లో మరొకసారి తిరగబడ్డారు. ఈసారి విజయం సాధించలేదు. 1783–84,1789–90లలో మూడో దశ తిరుగుబాటు జరిగింది. ఇందులో ప్రముఖమైనది దుర్జల్ సింగ్ నాయకత్వంలో జరిగిన 1789–90 ఉద్యమం. దీనిని అతి దారుణంగా అణచివేశారు. ఈ ఉద్యమం మిద్నపూర్, బంకురా, బీర్భూవ్, దల్భూవ్ ప్రాంతాలలో జరిగింది. అక్కడికి కొన్ని వందల మైళ్ల దూరంలోని గోదావరి లోయ రంపలో, విశాఖ మన్యంలోనూ అలాంటి ప్రతిఘటనలే కనిపిస్తాయి. రంప దేశం లేదా ప్రాంతంలో 1798లో కొత్తపల్లి, ఇందుకూరుపేట అనే కుగ్రామాలలో ఆంగ్లేయులకు ప్రతిఘటన ఎదురైంది. కలకత్తా నుంచి మద్రాసు వరకు కంపెనీ సాగించిన అధికార విస్తరణ తరువాతి పరిణామమిది. విజయనగరం, బొబ్బిలి జమీందారీలలోని ప్రాంతాలు తమ అధీనమైనాయని ప్రకటించుకోవడానికి ఆ రెండు గ్రామాలలోను ఈస్టిండియా కంపెనీ బలగాలు శిబిరాలు వేసి, కవాతు నిర్వహించాయి. పండుదొర అనే ఒక గిరిజనుడి నాయకత్వంలో ఏకమైన స్థానికులు ఆ శిబిరాల మీద దాడి చేశారు. అదొక గట్టి నిరసనగానే ఉండిపోయింది. అప్పటికి ఆధునిక ఆయుధాలు ఉన్న కంపెనీ బలగాలు సంప్రదాయక విల్లంబులతో పోరాడే గిరిజనుల ప్రతిఘటనను సులభంగానే అణచివేశాయి. మళ్లీ ఆ సంవత్సరం ఆగస్ట్ 31న పండుదొర నాయకత్వంలోనే అక్కడే పురుషోత్తమపట్నం అనేచోట రేవు దగ్గర స్థానికులు వారితో తలపడ్డారు. లెఫ్టినెంట్ మెక్లియోడ్ నాయకత్వంలో ఈ చిన్నయుద్ధంలోను కంపెనీయే విజయం సాధించింది. పదిహేనేళ్ల తరువాత మళ్లీ రంప మన్సబ్‌దారు రాజా రామ్భూపతిదేవ్ రంప దేశం తనదని ప్రకటించుకున్నాడు. ఇతడిని అరెస్టు చేసి, రాజమండ్రి తీసుకెళ్లి కంపెనీ అధికారులు ఒప్పందానికి ఒప్పించారు. మున్సబ్‌దారు అనే హోదా నుంచి కొన్ని గ్రామాల మీద అధిపతిగా మొఖాసుదారుగా నిలిపారు. 1835లో ఇతడు చనిపోయిన తరువాత వారసత్వం విషయంలో మునసబులకూ, రామ్భూపతిదేవ్ కుటుంబానికీ మధ్య విభేదాలు వచ్చాయి. ఇదే అదనుగా కంపెనీ చొరబడి రంపదేశాన్ని తన అధీనంలోకి తీసుకుంది. కంపెనీ నిర్ణయంతో ఆగ్రహించిన పాలెపు పెద్దిరెడ్డి, ఒకటో కారం తమ్మనదొర అనే ఇద్దరు గిరిజనులు 1840లో తిరుగుబాటు లేవదీశారు. ఈ ప్రతిఘటనలోనే 12 మంది పోలీసులు చనిపోవడం సంచలనం సృష్టించింది. 1837లో ఇదే తరహా వారసత్వ ఘర్షణను అడ్డం పెట్టుకుని విశాఖమన్యంలో, అంటే గొలుగొండ జమీందారీలో కంపెనీ తలదూర్చింది. దీనితో రంప నుంచి విశాఖ మన్యానికీ ప్రతిఘటనలు విస్తరించాయి. చదవండి: హనీ ట్రాపింగ్.. ఐఎస్ఐ ఏజెంట్ పట్టించిన రా ఏజెంట్ నిధి! -
స్వచ్ఛ భారతీయుడు
ఆదర్శం ఇప్పుడంటే పారిశుధ్యం గురించి ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మారుమోగి పోతోందిగానీ, మూడు నాలుగు దశాబ్దాల క్రితం... అది ప్రజల్లో అంతగా అవగాహన లేని విషయం. ‘ఇది కూడా ఓ సమస్యేనా’ అనుకునే కాలం. అలాంటి కాలంలోనే డా॥మపుస్కర్ పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కలిగించడానికి శంఖం పూరించారు. గత 50 ఏళ్లుగా పల్లెల్లో పారిశుధ్యం కోసం నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. మెడిసిన్ పూర్తి చేసిన తరువాత పునే(మహారాష్ట్ర)కు దగ్గరిలోని దెహు గ్రామ హాస్పిటల్లో డాక్టర్‌గా చేరారు మపుస్కర్. డ్యూటీలో చేరిన తొలిరోజు రాత్రి హాస్పిటల్ బయట పడుకోవడానికి సిద్ధమైనప్పుడు- ‘‘అయ్యా! ఇక్కడ పడుకోవడం ప్రమాదకరం. దెయ్యాలు తిరుగుతుంటాయి’’ అన్నారు ఒకరు. ఆ మాటలు తేలిగ్గా తీసుకొని హాయిగా నిద్రపోయాడు యువ డాక్టర్. తెల్లవారిన తరువాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి టాయిలెట్ కోసం వెతుకుతుంటే, ‘‘ఊళ్లలో టాయిలెట్లు ఉండవు సార్. చెట్ల చాటుకు వెళ్లాల్సిందే’’ అన్నాడు సిబ్బందిలో ఒకరు. అప్పుడే దృఢంగా అనుకున్నారు... ‘ఈ పరిస్థితిలో మార్పు తేవాలి’ అని! దానికి తోడు దెహు గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడు తున్నారని తెలిసింది. పారిశుధ్య లోపమే ప్రజల అనారోగ్యానికి కారణమవుతుందని ఆయనకు అర్థమైంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే బహిరంగ మలవిసర్జన అలవాటును మానిపించాలి. టాయిలెట్ల విలువ గురించి తెలియజేయాలి అనుకున్నారు మపుస్కర్. ‘దెయ్యాలున్నాయి’ అని చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్లి- ‘‘నిజమే... ఈ ఊళ్లో దెయ్యాలున్నాయి. అయితే అవి మీరనుకునే దెయ్యాలు కాదు. అపరిశుభ్రత అనే దెయ్యాలు’’ అన్నారు మపుస్కర్. తన కోసం హాస్పిటల్ పరిసరాల్లో తాత్కాలికంగా ట్రెంచ్ టాయిలెట్ నిర్మించారు. దీనికి మందుల బాక్సుల అట్టలను నలువైపులా గోడలుగా అమర్చారు. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) వాళ్లు వేసిన ఒక పుస్తకం నుంచి ఓ నమూనాను ఎంపిక చేసుకుని, దాని ప్రకారం గ్రామంలో పది టాయిలెట్లు నిర్మించారు. కానీ డబ్ల్యూహెచ్‌వో పుస్తకంలోని డిజైన్లు ఇండియాకు సరిపోవనే విషయం అర్థమైంది. వానాకాలంలో అవి పనికి రాకుండా పాడైపోయాయి. అయినా తన ప్రయత్నం వీడకుండా పరిసరాల పరిశుభ్రత గురించి అలుపెరు గని ప్రచారాన్ని నిర్వహించారు మపుస్కర్. అయితే ఆయన తపనను తక్కువమంది అర్థం చేసుకున్నారు. ‘ఈయనకు పెద్దగా పని లేనట్లు ఉంది’, ‘చాదస్తం కాకపోతే పల్లెల్లో టాయిలెట్లు ఏమిటి?’ లాంటి కామెంట్లు ఎక్కువగా వినిపించేవి. అయినా తగ్గకుండా మరుగుదొడ్ల ప్రాము ఖ్యతను గురించి గ్రామంలో విసృ్తత ప్రచారం నిర్వహించారు. ఊరేగింపులు, చర్చలతో మొదలైన ప్రచారం చివరికి ఉద్యమ రూపం తీసుకుంది. ప్రజలు టాయిలెట్ల గురించి ఆసక్తిగా ఆరా తీయడం మొదలైంది. గ్రామ మరుగుదొడ్డి నిర్మాణ కమిటీ కూడా ఏర్పడింది. ‘నో ప్రాఫిట్-నో లాస్’ సూత్రంతో ఏర్పడిన ఈ కమిటీ ఒక్క నెలలోనే వంద టాయిలెట్లను నిర్మించింది. 1980 వచ్చేసరికి లక్ష్యానికి 90 శాతం చేరువయింది. ఆ తరువాత బయోగ్యాస్ టాయిలెట్ల గురించి ప్రచారం మొదలు పెట్టారు మపుస్కర్. దాంతో గ్రామంలో చాలామంది బయోగ్యాస్ టాయిలెట్ల నిర్మాణం వైపు మొగ్గు చూపారు. కేవలం దెహు గ్రామం దగ్గరే ఆగిపోలేదు మపుస్కర్. ‘జ్యోత్స్న ఆరోగ్య ప్రభోధన్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా పారిశుధ్యం గురించి ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్యనే వృత్తి విరమణ పొందారు కానీ లక్ష్యం నుంచి మాత్రం కాదు! -
స్వచ్ఛ భారత్ కోసం నడుం బిగిద్దాం
సంగారెడ్డి రూరల్: స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉందని ఐఐటి హైదరాబాద్ డెరైక్టర్ , ప్రొఫెసర్ యూబీ దేశాయ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలం ఎద్దుమైలారం ఓడిఎఫ్ ఎస్టేట్‌లోని ఐఐటిలో బుధవారం స్వచ్ఛభారత్ అభియాన్‌పై విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేశాయ్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే వారని , సభర్మతీ ఆశ్రమంలోని పరిసరాలను ఆయనే స్వయంగా శుభ్రపర్చుకునేవారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ సాధన కోసం విద్యార్థులతో పాటు యువత కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఏడాది వంద గంటలు లేదా ప్రతీ వారం రెండు గంటల పాటు శ్రమదానం నిర్వహించి స్వచ్ఛ భారత్ సాధనకు తోడ్పడాలన్నారు. ముందు తన కుటుంబం, తమ వీధి, గ్రామం, కార్యాలయం, పరిశుభ్రంగా ఉండేలా చూడాలని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టు ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకునేందుకు శ్రమదానం చేయడం వల్ల పరిశుభ్రమైన భారత్‌ను సాధించేందుకు వీలుపడతుందన్నారు. అంతకు ముందు పరిశుభ్రత కోసం పాటుపడతామని విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిజ్ఙ చేశారు. అనంతరం ఐఐటి ఆవరణలో పరిసరాలను శుభ్రం చేశారు. -
స్వాతంత్ర్య పోరాటంలో తెలుగుయోధులెందరో!
ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశ విముక్తి కోసం ఎంతో మంది పోరాడారు. ఆ పోరాటంలో తెలుగువారు భోగరాజు పట్టాభి సీతారామయ్య, పింగళి వెంకయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కొండ వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య..... మేము సైతం అంటూ పాల్గొన్నారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య : భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీచే ప్రభావితుడై స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. అనతి కాలంలోనే గాంధీ మహత్ముడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం పొందారు. 1948లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఆయన ఆంధ్రాబ్యాంక్‌ను స్థాపించారు. నాటి కృష్ణా జిల్లాలోని గుండుగొలను గ్రామం (ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా)లో భోగరాజు పట్టాభి సీతారామయ్య జన్మించారు. పింగళి వెంకయ్య : దేశానికి పతాకాన్ని అందించిన యోధుడు పింగళి వెంకయ్య. ఈయన కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని మొవ్వ మండలం భట్లపెనుమర్రులో వెంకయ్య జన్మించారు. చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే ఆయన.. దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. అక్కడే మహాత్మాగాంధీని కలిశాడు. భారత్ వచ్చిన వెంకయ్య... ఆ తర్వాత జెండా రూపొందించాలనే తలంపుతో 1916 లో "భారతదేశానికొక జాతీయ జెండా " అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. ఆయన రూపొందించిన నాటి పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది. దుర్గాబాయి దేశ్‌ముఖ్ : భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త.. ఇలా భిన్న పార్శ్వాలున్న వ్యక్తి దుర్గాబాయి దేశ్‌ముఖ్. 1909, జులై 15న ఆమె తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పదేళ్ల వయసులోనే హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ బోధించేవారు. చిన్ననాటి నుంచే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. మహాత్ముడు ఆంధ్రదేశంలో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగాలను దుర్గాబాయి తెలుగులోకి అనువదించేవారు. 1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది. కొండా వెంకటప్పయ్య : కొండా వెంకటప్పయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు. 1866 ఫిబ్రవరి 22వ తేదీన పాత గుంటూరులో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్‌కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య : రామదండు అనే దళాన్ని స్థాపించి.. చీరాల - పేరాల ఉద్యమంతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య. ఈయన1889 జూన్ 2 న కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు. 1921 లో సహాయనిరాకరణోద్యమ సందర్భంగా గాంధీగారి ఉపన్యాసాలను అనువదించినందుకు ప్రభుత్వం ఈయనకు ఇచ్చిన భూమిని రద్దుచేసింది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఏడాది పాలు తిరుచిరాపల్లి జైల్లో ఉన్నారు. 1923 లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. చీరాలపేరాలలో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించిన ఘనత ఆయనదే. టంగుటూరి ప్రకాశం పంతులు : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి, మళ్లీ మరణించే సమయానికి కట్టుబట్టలతో మిగిలిన నిజాయితీపరుడు. 1940, 50లలోని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు.