స్వచ్ఛ భారతీయుడు
ఆదర్శం
ఇప్పుడంటే పారిశుధ్యం గురించి ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మారుమోగి పోతోందిగానీ, మూడు నాలుగు దశాబ్దాల క్రితం... అది ప్రజల్లో అంతగా అవగాహన లేని విషయం. ‘ఇది కూడా ఓ సమస్యేనా’ అనుకునే కాలం. అలాంటి కాలంలోనే డా॥మపుస్కర్ పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కలిగించడానికి శంఖం పూరించారు. గత 50 ఏళ్లుగా పల్లెల్లో పారిశుధ్యం కోసం నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. మెడిసిన్ పూర్తి చేసిన తరువాత పునే(మహారాష్ట్ర)కు దగ్గరిలోని దెహు గ్రామ హాస్పిటల్లో డాక్టర్‌గా చేరారు మపుస్కర్.
డ్యూటీలో చేరిన తొలిరోజు రాత్రి హాస్పిటల్ బయట పడుకోవడానికి సిద్ధమైనప్పుడు- ‘‘అయ్యా! ఇక్కడ పడుకోవడం ప్రమాదకరం. దెయ్యాలు తిరుగుతుంటాయి’’ అన్నారు ఒకరు. ఆ మాటలు తేలిగ్గా తీసుకొని హాయిగా నిద్రపోయాడు యువ డాక్టర్. తెల్లవారిన తరువాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి టాయిలెట్ కోసం వెతుకుతుంటే, ‘‘ఊళ్లలో టాయిలెట్‌లు ఉండవు సార్. చెట్ల చాటుకు వెళ్లాల్సిందే’’ అన్నాడు సిబ్బందిలో ఒకరు. అప్పుడే దృఢంగా అనుకున్నారు... ‘ఈ పరిస్థితిలో మార్పు తేవాలి’ అని!
దానికి తోడు దెహు గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడు తున్నారని తెలిసింది. పారిశుధ్య లోపమే ప్రజల అనారోగ్యానికి కారణమవుతుందని ఆయనకు అర్థమైంది.
ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే బహిరంగ మలవిసర్జన అలవాటును మానిపించాలి. టాయిలెట్ల విలువ గురించి తెలియజేయాలి అనుకున్నారు మపుస్కర్. ‘దెయ్యాలున్నాయి’ అని చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్లి- ‘‘నిజమే... ఈ ఊళ్లో దెయ్యాలున్నాయి. అయితే అవి మీరనుకునే దెయ్యాలు కాదు.
అపరిశుభ్రత అనే దెయ్యాలు’’ అన్నారు మపుస్కర్. తన కోసం హాస్పిటల్ పరిసరాల్లో తాత్కాలికంగా ట్రెంచ్ టాయిలెట్ నిర్మించారు. దీనికి మందుల బాక్సుల అట్టలను నలువైపులా గోడలుగా అమర్చారు. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) వాళ్లు వేసిన ఒక పుస్తకం నుంచి ఓ నమూనాను ఎంపిక చేసుకుని, దాని ప్రకారం గ్రామంలో పది టాయిలెట్లు నిర్మించారు. కానీ డబ్ల్యూహెచ్‌వో పుస్తకంలోని డిజైన్లు ఇండియాకు సరిపోవనే విషయం అర్థమైంది. వానాకాలంలో అవి పనికి రాకుండా పాడైపోయాయి.
అయినా తన ప్రయత్నం వీడకుండా పరిసరాల పరిశుభ్రత గురించి అలుపెరు గని ప్రచారాన్ని నిర్వహించారు మపుస్కర్. అయితే ఆయన తపనను తక్కువమంది అర్థం చేసుకున్నారు. ‘ఈయనకు పెద్దగా పని లేనట్లు ఉంది’, ‘చాదస్తం కాకపోతే పల్లెల్లో టాయిలెట్లు ఏమిటి?’ లాంటి కామెంట్లు ఎక్కువగా వినిపించేవి. అయినా తగ్గకుండా మరుగుదొడ్ల ప్రాము ఖ్యతను గురించి గ్రామంలో విసృ్తత ప్రచారం నిర్వహించారు. ఊరేగింపులు, చర్చలతో మొదలైన ప్రచారం చివరికి ఉద్యమ రూపం తీసుకుంది.
ప్రజలు టాయిలెట్ల గురించి ఆసక్తిగా ఆరా తీయడం మొదలైంది. గ్రామ మరుగుదొడ్డి నిర్మాణ కమిటీ కూడా ఏర్పడింది. ‘నో ప్రాఫిట్-నో లాస్’ సూత్రంతో ఏర్పడిన ఈ కమిటీ ఒక్క నెలలోనే వంద టాయిలెట్లను నిర్మించింది. 1980 వచ్చేసరికి లక్ష్యానికి 90 శాతం చేరువయింది.
ఆ తరువాత బయోగ్యాస్ టాయిలెట్ల గురించి ప్రచారం మొదలు పెట్టారు మపుస్కర్. దాంతో గ్రామంలో చాలామంది బయోగ్యాస్ టాయిలెట్ల నిర్మాణం వైపు మొగ్గు చూపారు.
కేవలం దెహు గ్రామం దగ్గరే ఆగిపోలేదు మపుస్కర్. ‘జ్యోత్స్న ఆరోగ్య ప్రభోధన్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా పారిశుధ్యం గురించి ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్యనే వృత్తి విరమణ పొందారు కానీ లక్ష్యం నుంచి మాత్రం కాదు!