ఇక్కడ విన్నపాలు అక్కడ విల్లంబులు.. | Indian Movement special Stories in funday magazine | Sakshi
Sakshi News home page

ఇక్కడ విన్నపాలు అక్కడ విల్లంబులు..

Published Sun, Dec 19 2021 1:36 PM | Last Updated on Sun, Dec 19 2021 1:36 PM

Indian Movement special Stories in funday magazine - Sakshi

బొంబాయి మహా నగరంలో డిసెంబర్, 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. అది ఆంగ్లేయుల మీద ప్రతిఘటనకు అంకురమని చెప్పడం తొందరపాటు. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ఒక్కసారే తిరస్కరించకుండా, దశల వారీగా పాలనలో భారతీయులకు భాగస్వామ్యం సాధించడం ఆ సంస్థ పోరాట సూత్రం. సరిగ్గా అదే సమయంలో 1885 డిసెంబర్‌లోనే విశాఖ మన్యంలో ఆంగ్ల పాలన మీద ప్రతిఘటనకు వినూత్న ప్రయత్నం జరిగింది. వారి లక్ష్యం కూడా ఆంగ్ల పాలనకు నిరసనే. కానీ కాంగ్రెస్‌ పోకడకు పూర్తి విరుద్ధం. సడక అనే కొండగ్రామంలో ఉన్న పోతుకూరి మాలడు అనే శివసారిని, పక్క గ్రామం శివసారి సలాబి బోడడు వచ్చి కలుసుకున్నాడు. శివసారి అంటే కొండదేవతల పూజారి. ప్రఖ్యాత చరిత్రకారుడు డేవిడ్‌ ఆర్నాల్డ్‌ రాసిన ‘రెబెలియస్‌ హిల్మెన్‌: ది గూడెం రంపా రైజింగ్స్‌ 1839–1924’ అనే వ్యాసంలో (సబాల్టరన్‌ స్టడీస్‌–1, రైటింగ్స్‌ ఆన్‌ సౌత్‌ ఆసియన్‌ హిస్టరీ అండ్‌ సొసైటీ) గిరిజనోద్యమాల గురించి సవివరంగా చెప్పారు.

ప్లాసీ యుద్ధం (1757) జరిగిన కొద్దికాలానికే కొండకోనలలో ప్రతిధ్వనించిన ఆ సమరాల గురించి ఎందరో చరిత్రకారులు, రచయితలు రాశారు. తెలుగు సహా అన్ని భాషలలోను వందలాది వ్యాసాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్‌ అధికారులు రాసిన రహస్య నివేదికలలో ఎంతో సమాచారం ఉంది. డేవిడ్‌ ఆర్నాల్డ్‌ వీటి ఆధారంగానే తెలుగు ప్రాంతంలో జరగిన ఆ దశ గిరిజనోద్యమ చరిత్రకు అక్షరరూపం ఇచ్చారు. కాంగ్రెస్‌ తొలి సమావేశంలో పాల్గొన్నవారు 72 మంది. వారు దేశం నలుమూలల నుంచి వచ్చారు. అప్పటికే విశ్వవిద్యాలయాల వరకు వెళ్లిన ఉన్నత విద్యావంతులు. విశాఖ మన్యంలోని సడక కేంద్రంగా శివసారులు దాదాపు 20 మంది, వీరి వెనుక కొందరు మన్య గ్రామాల మునసబులు, స్థానికులు ఆంగ్ల పాలన మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆంగ్లేయుల అతిథి గృహాలనే కాదు, పోలీస్‌ స్టేషన్లనీ తగులబెట్టారు. 

బ్రిటిష్‌ ఏలుబడికి ఎదురైన ప్రతిఘటనలలో గిరిజనోద్యమాలు చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. ఈస్టిండియా కంపెనీ దుష్ట పాలనలోను, దీనికేమీ తీసిపోని ఇంగ్లండ్‌ సింహాసనం ఏలుబడిలో కూడా తమదైన పంథాలో గిరిజనులు ఆయుధమెత్తారు. వ్యవసాయంలో వ్యాపార ధోరణి పెరగడం, అటవీ సంపదను దోచుకునేందుకు అడవుల మీద ఆధిపత్యం చలాయించడం, అటవీ సంపదను మైదాన ప్రాంతాల ప్రయోజనాల కోసం తరలించడం వంటి యోచనలతో అక్కడికి రకరకాల పేర్లతో అటవీ అధికారుల పేరుతో, కాంట్రాక్టర్ల పేరుతో, వడ్డీ వ్యాపారం పేరుతో ‘నాగరికులు’ చొరబడడం, కొన్ని క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు గిరిజనులను ప్రతిఘటన ధోరణి వైపు నడిపించాయి. ఇవి దేశమంతటా కనిపించినా, చరిత్రలో తగిన స్థానం దక్కలేదు. ఇప్పుడిప్పుడే ఆ లోటును భర్తీ చేసే ప్రక్రియ ఉపందుకుంది. అయితే ఏ గిరిజనోద్యమమూ శాంతియుతంగా జరగలేదు. అవన్నీ గెరిల్లా పోరాటాలే. లక్ష్యం మాత్రం ఆంగ్లాధిపత్యం. లేదా వాళ్ల రక్షణలో తమని దోచుకుంటున్న స్వదేశీయులే. కానీ ఈ ప్రతిఘటనలలో కంపెనీ బలగాల కర్కశత్వం వాస్తవం. ఎందరో గిరిజన నేతల కంఠాలకు ఉరి బిగిసింది. 

భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన కంటే ఎంతో ముందు నుంచే కొండకోనలలో గిరిజనులు ఆంగ్ల పాలనను సుస్పష్టంగా ప్రతిఘటించారు. నిర్ద్వంద్వంగా నిరాకరించారు.  వీటి వెనుక స్వేచ్ఛా సంస్కృతుల రక్షణ, ఆర్థికకోణం ఉన్నాయి. అడవి మీద తమ హక్కును రక్షించుకోవడానికి జరిగినవే కూడా. అలాగే ఒకటి రెండు సందర్భాలలో మైదాన ప్రాంతంలో, ఉత్తర భారతంలో ఆరంభమై, దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించిన 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరం ప్రభావం తమ మీద ఉన్నట్టు ఒకరిద్దరు గిరిజన నాయకులు చెప్పడం విస్మయం కలిగిస్తుంది. కాబట్టి స్వరాజ్య పోరాట చరిత్ర అంటే మైదాన ప్రాంతంలో జరిగిన ఉద్యమంతో సమాంతరంగా అడవిబిడ్డల పోరాటం గురించి చెప్పడం సరైన చారిత్రక దృష్టి, స్పృహ అవుతాయని గుర్తించాలి. బెంగాల్‌లోని మిద్నపూర్‌ ప్రాంతం, జంగల్‌మహల్‌ అనేచోట చౌర్స్‌ గిరిజనులు ఉంటారు. వీరు స్థానిక జమీందారుల దగ్గర పనిచేసేవారు. వీళ్లకి జీతాల బదులు పన్ను కట్టనవసరం లేని భూమి ఇచ్చేవారు.

కానీ కంపెనీ భూమి మీద విపరీతంగా పన్నులు వేయడంతో జమీందార్లు తిరుగుబాటు చేశారు. 1768–69, 1799లలో ఈ తిరుగుబాట్లు జరిగాయి. 1768లో మొదట ఘటశిల జమీందారు లేదా ధల్భూవ్‌ు రాజు జగన్నాథ్‌ సింగ్‌ తిరుగుబాటు ఆరంభించాడు. ఇతడికి ఇతర జమీందారులు, 50,000 మంది చౌర్స్‌ మద్దతుగా నిలిచారు. దీనితో జగన్నాథ్‌కు జమీని తిరిగి ఇచ్చేసింది ఈస్టిండియా కంపెనీ. ధద్కర్‌ శ్యామ్‌ గంజన్‌ నాయకత్వంలో మళ్లీ 1771లో మరొకసారి తిరగబడ్డారు. ఈసారి విజయం సాధించలేదు. 1783–84,1789–90లలో మూడో దశ తిరుగుబాటు జరిగింది. ఇందులో ప్రముఖమైనది దుర్జల్‌ సింగ్‌ నాయకత్వంలో జరిగిన 1789–90 ఉద్యమం. దీనిని అతి దారుణంగా అణచివేశారు. ఈ ఉద్యమం మిద్నపూర్, బంకురా, బీర్భూవ్‌, దల్భూవ్ ప్రాంతాలలో జరిగింది. అక్కడికి కొన్ని వందల మైళ్ల దూరంలోని గోదావరి లోయ రంపలో, విశాఖ మన్యంలోనూ అలాంటి ప్రతిఘటనలే కనిపిస్తాయి. రంప దేశం లేదా ప్రాంతంలో 1798లో కొత్తపల్లి, ఇందుకూరుపేట అనే కుగ్రామాలలో ఆంగ్లేయులకు ప్రతిఘటన ఎదురైంది.

కలకత్తా నుంచి మద్రాసు వరకు కంపెనీ సాగించిన అధికార విస్తరణ తరువాతి పరిణామమిది. విజయనగరం, బొబ్బిలి జమీందారీలలోని  ప్రాంతాలు తమ అధీనమైనాయని ప్రకటించుకోవడానికి ఆ రెండు గ్రామాలలోను ఈస్టిండియా కంపెనీ బలగాలు శిబిరాలు వేసి, కవాతు నిర్వహించాయి. పండుదొర అనే ఒక గిరిజనుడి నాయకత్వంలో ఏకమైన స్థానికులు ఆ శిబిరాల మీద దాడి చేశారు. అదొక గట్టి నిరసనగానే ఉండిపోయింది. అప్పటికి ఆధునిక ఆయుధాలు ఉన్న కంపెనీ బలగాలు సంప్రదాయక విల్లంబులతో పోరాడే గిరిజనుల ప్రతిఘటనను సులభంగానే అణచివేశాయి. మళ్లీ ఆ సంవత్సరం ఆగస్ట్‌ 31న పండుదొర నాయకత్వంలోనే అక్కడే పురుషోత్తమపట్నం అనేచోట రేవు దగ్గర స్థానికులు వారితో తలపడ్డారు. లెఫ్టినెంట్‌ మెక్లియోడ్‌ నాయకత్వంలో ఈ చిన్నయుద్ధంలోను కంపెనీయే విజయం సాధించింది.

పదిహేనేళ్ల తరువాత మళ్లీ రంప మన్సబ్‌దారు రాజా రామ్‌భూపతిదేవ్‌ రంప దేశం తనదని ప్రకటించుకున్నాడు. ఇతడిని అరెస్టు చేసి, రాజమండ్రి తీసుకెళ్లి కంపెనీ అధికారులు ఒప్పందానికి ఒప్పించారు. మున్సబ్‌దారు అనే హోదా నుంచి కొన్ని గ్రామాల మీద అధిపతిగా మొఖాసుదారుగా నిలిపారు. 1835లో ఇతడు  చనిపోయిన తరువాత వారసత్వం విషయంలో మునసబులకూ, రామ్‌భూపతిదేవ్‌ కుటుంబానికీ మధ్య విభేదాలు వచ్చాయి. ఇదే అదనుగా కంపెనీ చొరబడి రంపదేశాన్ని తన అధీనంలోకి తీసుకుంది. కంపెనీ నిర్ణయంతో ఆగ్రహించిన పాలెపు పెద్దిరెడ్డి, ఒకటో కారం తమ్మనదొర అనే ఇద్దరు గిరిజనులు 1840లో తిరుగుబాటు లేవదీశారు. ఈ ప్రతిఘటనలోనే 12 మంది పోలీసులు చనిపోవడం సంచలనం సృష్టించింది. 1837లో ఇదే తరహా వారసత్వ ఘర్షణను అడ్డం పెట్టుకుని విశాఖమన్యంలో, అంటే గొలుగొండ జమీందారీలో కంపెనీ తలదూర్చింది. దీనితో రంప నుంచి విశాఖ మన్యానికీ ప్రతిఘటనలు విస్తరించాయి.

చదవండి: హనీ ట్రాపింగ్‌.. ఐఎస్‌ఐ ఏజెంట్‌ పట్టించిన రా ఏజెంట్‌ నిధి!
    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement