ఎంత ఘోరమమ్మా..
అనంతపురం క్రైం, న్యూస్లైన్ : ‘ఇంటి పని ఎంత వరకొచ్చిందో చూసొస్తామన్నారు.. ఆటోలో వెళతామని చెప్పారు.. జాగ్రత్తగా వెళ్లండని చెప్పాను.. ఈరోజు వద్దని చెప్పినా బావుండేది.. ఇంతమంది చనిపోయారు.. దేవుడు మాకు అన్యాయం చేశాడు..’ అంటూ కట్టుకున్న భార్య, కన్నబిడ్డ, కన్నతల్లి, పిల్లనిచ్చిన అత్త ఒకేసారి మృత్యువాత పడటం.. మరో కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం చూసి పెద్ద తిమ్మరాజు ఆస్పత్రిలో గుండెలవిసేలా రోదించాడు. అతడిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. అనంతపురంలోని ఉమానగర్కు చెందిన ఇండేన్ గ్యాస్ డెలివరీ బాయ్ పెద్ద తిమ్మరాజు ఇటీవల కక్కలపల్లిలో సొంతిల్లు కట్టిస్తున్నాడు. శుక్రవారం నిర్మాణ పనులు చూద్దామని ఆయన భార్య మల్లేశ్వరి (28), ఎనిమిది నెలల కుమారుడు మహేష్, కుమార్తె దీపతో పాటు తల్లి అలివేలమ్మ (45), అత్త సావిత్రమ్మ(50)తో కలిసి ఆటోలో బయలుదేరారు.
కక్కలపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిని దాటే క్రమంలో బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు ఆటోను ఢీకొనడం తో పసికందు మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స ప్రారంభించేలోపే మల్లేశ్వరి, అలివేలమ్మ, సావిత్రమ్మ మృతి చెందారు. మల్లేశ్వరి కుమార్తె దీప్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆటో డ్రైవర్ను మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మృతదేహాలను, రోదిస్తున్న బంధువులను చూసిన జనం.. దేవుడా ఎంత పనిచేశావయ్యా.. అంటూ కంట నీరు పెట్టుకున్నారు.
ఆ దేవుడు అన్యాయం చేశాడయ్యా..
‘దేవుడా వాడి కడుపు కొట్టి కుటుంబాన్నే తీసుకెళితివా.. అష్టకష్టాలు పడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.. కష్టపడి ఊరి చివర చిన్న ఇల్లొకటి కట్టుకుంటున్నాడు.. కొద్ది రోజుల్లో సొంతింట్లోకి వెళుదామనుకుంటున్న వారికి అన్యాయం చేశావు స్వామీ..’ అంటూ తిమ్మరాజును పట్టుకుని బందువులు చేసిన రోదన.. ఆ దృశ్యాన్ని చూస్తున్న వారి గుండెలను కదిలించాయి.
‘ఇల్లు కట్టుకుంటున్నాం పిన్నీ... త్వరలో అక్కడే ఉంటాం.. అంటూ నవ్వుతూ చెప్పిన నీ భార్య ఎక్కడికెళ్లిందయ్యా.. బంగారం లాంటి బిడ్డ పుట్టాడని ఆనంద పడితివే.. ఎంత త్వరగా దేవుడు పగ బట్టె నాయనా...’ అంటూ ఓ మహిళ కన్నీరుమున్నీరైంది. నాన్నా మహేష్.. ఏమే అంటూ కొడుకు, భార్య మృతదేహాలున్న మార్చురీవైపు పరుగెత్తుతున్న తిమ్మరాజును ఆపడం బంధువులకు కష్టతరమైంది. కారులో ప్రయాణిస్తున్న కేరళకు చెందిన అరుణ్కుమార్ దాస్, ఆయన భార్య జ్యోతిదాస్, కుమారుడు అబిదిస్దాస్లు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ అయిన అరుణ్దాస్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో స్థిరపడ్డారు. కన్స్ట్రక్షన్ పనిపై బెంగళూరు వెళ్లిన కుటుంబ సభ్యులు.. తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.