indian hacker
-
‘నాపై కేసు ఎందుకు పెట్టలేదు’
సాక్షి, హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్, భారత హ్యాకర్ సయ్యద్ షుజాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సమక్షంలోనే షుజా మాట్లాడారని, ఈవీఎంల్లో లోపాలు ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. కాకిరెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 11 మందిని హత్య చేయిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.చనిపోయిన వాళ్లపై మిస్సింగ్ కేసులు ఎక్కడ నమోదయ్యాయో, షుజా చెప్తున్న గెస్ట్ హౌజ్ ఎక్కడెక్కడ ఉందో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం వల్లే బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని భారత హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గొడవ జరగడంతో బీజేపీ నేత కిషన్ రెడ్డి తమపై గన్ మెన్లతో కాల్పులు జరిపించారనీ, ఈ ఘటనలో 11 మంది చనిపోయారని ఆరోపించారు. 2014 మే13 తెల్లవారుజామున 13 మందితో గెస్ట్‌హౌస్‌కు వెళ్లామని సుజా తెలిపారు. అక్కడే ఉన్న కిషన్ రెడ్డి.. తమను చంపేయమంటూ గన్మెన్లకు ఆదేశించారని చెప్పారు. వాళ్లు జరిపిన కాల్పుల్లో తమ వాళ్లు 11 మంది చనిపోయారని సయ్యద్ షుజా వెల్లడించారు. మృతుల్లో సమావేశం నిర్వహించిన కమల్‌రావు కూడా ఉన్నారని, తాను తప్పించుకుని అమెరికా వెళ్లిపోయానని సుజా తెలిపారు. ఆ తర్వాత వాటిని మతకలహాల మరణాలుగా మార్చారని ఆరోపించారు. ఇది చదవండి : 2014లో రిగ్గింగ్ జరిగింది! -
సంచలన ఆరోపణలు చేసిన భారతీయ హ్యాకర్!
లండన్/న్యూఢిల్లీ: అమెరికాలో తలదాచుకుంటున్న భారతీయ హ్యాకర్ ఒకరు సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) హ్యాక్ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని సయిద్ షుజా అనే హ్యాకర్ బాంబు పేల్చారు. ఇందుకు టెలికాం సంస్థ రిలయన్స్ జియో సహకరించిందని తెలిపారు. జియో రూపొందించిన మిలటరీ గ్రేడ్ లో–ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ను తన బృందం అడ్డుకోకుంటే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే విజయం సాధించేదని వెల్లడించారు. 2014 నాటికి జియో తన సేవలను ప్రారంభించకపోవడం గమనార్హం. ఈవీఎంల హ్యాకింగ్‌లో కేవలం బీజేపీనే కాకుండా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్కూ ప్రమేయం ఉందని షూజా ఆరోపించారు. తన బృందంలో కొందరిని హత్య చేయడంతో 2014లోనే తాను భారత్ విడిచి పారిపోయానన్నారు. లండన్‌లో సోమవారం స్కైప్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ముసుగు ధరించి షుజా మాట్లాడారు. అయితే తన ఆరోపణలకు తగిన సాక్ష్యాలను ఆయన చూపలేదు. లండన్ మీడియా సమావేశంలో షుజా మాట్లాడుతూ.. ‘నేను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో 2009–14 మధ్య పనిచేశాను. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను నా బృందమే డిజైన్ చేసింది. కొత్త ఈవీఎంలను హ్యాక్ చేయగలమా? ఎలా చేయగలం? అన్న విషయాన్ని పరిశీలించాలని ఈసీఐఎల్ మమ్మల్ని కోరింది. ఈసీఐఎల్, బీఈఎల్ రూపొందించే ఈవీఎం లను హ్యాక్ చేయగలం. రిలయన్స్ జియో అందించిన ఓ మాడ్యులేటర్ ద్వారా మిలటరీ గ్రేడ్ లోఫ్రీక్వెన్సీ తరంగాలతో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసింది. తద్వారా 2014 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండేను లోక్‌సభ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే చంపేశారు. 2014 ఎన్నికల తర్వాత నా బృందానికి చెందిన కొందర్ని చంపేశారు. నాపై కూడా దాడి జరిగినప్పటికీ తప్పించుకోగలిగాను’ అని తెలిపారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: ఈసీ హ్యాకర్ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఖండించింది. బీఈఎల్, ఈసీఐఎల్ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ డిమాండ్ చేశారు. అది హ్యాకింగ్ హర్రర్ షో: బీజేపీ లండన్‌లో జరిగిన మీడియా సమావేశాన్ని కాంగ్రెస్ నిర్వహించిన ‘హ్యాకింగ్ హర్రర్ షో’గా బీజేపీ అభివర్ణించింది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలను ఆ పార్టీ వెతుక్కుంటోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఈ కార్యక్రమానికి వెళ్లడం యాదృచ్ఛికం కాదనీ, సోనియా, రాహుల్ ఆయన్ను పంపారని దుయ్యబట్టారు. ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్ చేయలేరనీ, దేశవ్యతిరేక శక్తులు కాంగ్రెస్ పార్టీ బుర్రను హ్యాక్ చేశారని చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌లోనూ ప్రాబల్యం ఉందనీ, అలాంటివారు లండన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమంత పెద్దవిషయం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూపీఏ పదేళ్ల హయాంలో ఎన్నికలన్నీ ఈవీఎంల ద్వారానే జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. -
'వైన్' లోపంతో జాక్‌పాట్
ముంబై: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఓపెన్ ప్రోగ్రాం 'వైన్' లో ఉన్న లోపాన్ని కనిపెట్టిన ఓ ఇండియన్ హ్యాకర్ జాక్ పాట్ కొట్టేశాడు. వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం వైన్ లోని 'బగ్' ను భారత సంతతికి చెందిన బగ్ హ్యాకర్ అవినాశ్ సింగ్ గుర్తించాడు. ఈ భద్రతా లోపం కనిపెట్టిన అతనికి ప్రోత్సాహకాన్ని ప్రకటించింది ట్విట్టర్. సుమారు 6.7 లక్షల రూపాయల (10,080 డాలర్ల) బహుమతి ప్రకటించింది. వైన్ కు సంబంధించిన సోర్స్ కోడ్ పబ్లిక్ గా అందరికీ అందుబాటులో ఉండడాన్ని గమనించిన అవినాశ్ .. సాఫ్ట్ వేర్ లోపం కారణంగా ఇలా జరుగుతోందని గుర్తించి సంస్థకు వివరించాడు. ఈ సైట్ లో ప్రయివేటు వీడియోలను పబ్లిక్ గా షేర్ చేయడానికి వీల్లేదు. అయితే వైన్ లోని వీడియోలను నిఫ్టీ ఇంటర్నెట్ వైడ్ స్కానింగ్ టూల్ సెన్సిస్.ఎస్ ఐ అనే సెర్చ్ ఇంజిన్ లో వెతకినపుడు ప్రయివేట్ వీడియోలు సైతం పబ్లిక్ గా దర్శనమిస్తున్నాయి. ఇలా దాదాపు 80 ఇమేజెస్ ను డౌన్ చేయగలిగాడు. దీనికి 'డాకర్' అనే బగ్ ది బాధ్యత అని కనిపెట్టాడు. ఈ విషయాన్ని సంస్థ దృష్టికి తీసుకురావడంతో దాన్ని 5 నిమిషాల్లోనే సవరించుకుంది. సోషల్ మీడియా దిగ్గజాలు బగ్ నేరస్థులను వేటాడే నిపుణులైన బగ్ హ్యాకర్స్ పై దృష్టి పెట్టాయి. బిగ్ బగ్ హంటింగ్ కుర్రాళ్ళకు భారీగా నజరానాను ప్రకటిస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత్ లో హ్యాకర్స్ కు మంచి అవకాశాలు లభిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇటీవల, ఆనంద్ ప్రకాష్ అనే బెంగుళూర్ ఆధారిత ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి, ఫేస్బగ్ బగ్ ను కని పెట్టి వార్తలలోకెక్కిన సంగతి తెలిసిందే. కాగా 2012 లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం వైన్ లో ఇటీవల వీడియోల నిడివిని పెంచింది. గతంలో 30 సెకండ్లకు మాత్రమే పరిమితమైన దీన్ని 140 సెకండ్లకు పెంచింది.