‘కూ’ కోసం దేశీ ఇన్వెస్టర్ల క్యూ!
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా తెరపైకొచ్చిన దేశీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం ‘కూ’ భారీగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. టికెట్ల బుకింగ్ పోర్టల్ బుక్‌మైషో సీఈవో ఆశీష్ హేమ్‌రాజానీ, డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కొత్త ఇన్వెస్టర్లు ముందుకొస్తుండటంతో.. మరో ఉత్పత్తి కోసం గతంలో ‘కూ’లో ఇన్వెస్ట్ చేసిన చైనా సంస్థ షున్‌వై .. తన వాటాలను విక్రయించి పూర్తిగా వైదొలగాలని భావిస్తోంది. పలువురు దేశీ ఔత్సాహిక వ్యాపారవేత్తలు .. ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్నట్లు ‘కూ’ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు.
బుక్‌మైషో వ్యవస్థాపకుడు, సీఈవో ఆశీష్ హేమ్‌రాజానీ, బౌన్స్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు వివేకానంద హలెకెరె, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ సహా పలువురు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినట్లు వివరించారు. ‘దేశీ ఇన్వెస్టరు 3వన్4 క్యాపిటల్ సారథ్యంలోని ఇన్వెస్టర్లు .. ‘కూ’ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్‌లో ఇటీవలే 4.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. మా సంస్థలో భారతీయ ఇన్వెస్టర్లు మరింతగా పెట్టుబడులు పెడుతున్నారనడానికి ఇదే నిదర్శనం‘ అని రాధాకృష్ణ తెలిపారు. గతంలో వోకల్ అనే ఉత్పత్తి కోసం ‘కూ’ లో ఇన్వెస్ట్ చేసిన షున్‌వై .. కొత్త ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించి పూర్తిగా వైదొలగనుందని ఆయన వివరించారు. ‘ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన 3వన్4 క్యాపిటల్, కలారి తదితర సంస్థలు కూడా మరికొంత వాటాలు కొనుగోలుచేయనున్నాయి’ అని రాధాకృష్ణ తెలిపారు.
పది రెట్లు పెరిగిన డౌన్లోడ్స్ ..
ప్రస్తుతం ‘కూ’ యాప్‌నకు ముప్ఫై లక్షలకు పైగా యూజర్లు ఉన్నారు. ఈ వారంలో యాప్ డౌన్లోడ్లు ఏకంగా పది రెట్లు పెరిగాయి. భారతీయ వ్యవస్థాపకులు, దేశీయంగా రిజిస్ట్రేషన్‌తో పూర్తి దేశీ యాప్‌గా కూ కొద్ది రోజులుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు మొదలుకుని వివిధ ప్రభుత్వ శాఖలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నాయి. విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను కట్టడి చేయాలన్న ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ ట్విటర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కేంద్ర ఐటీ శాఖ కూడా ‘కూ’ నే ఎంచుకుంది. పీయూష్ గోయల్ లాంటి కేంద్ర మంత్రులు సైతం ‘కూ’ యాప్‌నకు మళ్లాలంటూ పిలుపునివ్వడంతో.. దీనికి మరింతగా ప్రాచుర్యం పెరిగింది.
ఆత్మనిర్భర్ చాలెంజ్ విజేత..
‘కూ’ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ గతంలో ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సంస్థ ట్యాక్సీఫర్ష్యూర్ను నెలకొల్పారు. ఆ తర్వాత దాన్ని మరో ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ కంపెనీ ఓలాకు విక్రయించారు. అటుపైన మయాంక్ బిదావత్కాతో కలిసి 2017లో ప్రాంతీయ భాషల్లో ఆన్లైన్ ప్రశ్నోత్తరాల ప్లాట్‌ఫాం వోకల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘కూ’ ప్లాట్‌ఫామ్‌ను గతేడాది ఆవిష్కరించారు. యూజర్లు భారతీయ భాషల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికగా దీన్ని రూపొందించారు. తెలుగు, హిందీ, బెంగాలీ సహా పలు ప్రాంతీయ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన ఆత్మనిర్భర్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో గెలుపొందిన వాటిల్లో ‘కూ’ కూడా ఒకటి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్ టీవీ మోహన్‌దాస్ పాయ్ వంటి ప్రముఖులు .. దీనికి మద్దతుగా ఉన్నారు. గత వారమే యాక్సెల్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్, డ్రీమ్ ఇన్క్యుబేటర్, 3వన్4 క్యాపిటల్ తదితర సంస్థలు ‘కూ’లో ఇన్వెస్ట్ చేశాయి.