‘వాన్నా క్రై’.. లాజరస్ గ్రూప్ పనే!
లండన్/న్యూఢిల్లీ/ముంబై: సైబర్ ప్రపంచాన్ని వణికిస్తున్న ర్యాన్సమ్వేర్ వాన్నా క్రై.. గతంలోనూ ఇలాంటి వైరస్‌లను పంపిన లాజరస్ గ్రూప్ పనేనని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. వాన్నా క్రై పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడింది ఉత్తర కొరియాకు చెందిన లాజరస్ గ్రూపే కావొచ్చని గూగుల్ సెక్యూరిటీ రీసెర్చర్ నీల్ మెహతా తెలిపారు. వాన్నా క్రై సాఫ్ట్‌వేర్‌కు గతంలో లాజరస్ సృష్టించిన హ్యాకింగ్ టూల్స్‌కు మధ్య పోలికలు ఉన్నాయని చెప్పారు. ఒరిజినల్ వాన్నా క్రై కోడ్‌లోని అంకెలు, అక్షరాలు, సొమ్ము చెల్లించాలన్న హెచ్చరికలోని ఇంగ్లిష్ పదాల ప్రయోగం చూస్తే అది వేరే భాషలో రాసిన వాక్యాలను కంప్యూటర్ ద్వారా అనువదించినట్లు తెలుస్తోందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అలన్ వుడ్‌వర్డ్ అన్నారు. ర్యాన్సమ్వేర్ దాడితో వసూలు చేసింది 60 వేల డాలర్లేనని బిట్‌కాయిన్ సంస్థ చెబుతోంది.
మన ‘ఐటీ’పై ప్రభావం లేదు: భారత్
వాన్నాక్రై ర్యాన్సమ్వేర్ వైరస్ భారత ఐటీ వ్యవస్థపై ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేదని ప్రభుత్వం తెలిపింది. ‘మాల్వేర్ ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి సంబంధించిన 18 కంప్యూటర్లకు, కేరళ పంచాయతీ కంప్యూటర్లకు సోకడం వంటి ఐదారు విడివిడి ఉదంతాలకే పరిమితమైంది. ఐటీని కుదేలు చేసినట్లు సమాచారమేదీ రాలేదు. వివిధ సంస్థలతో కూడిన బృందం పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తోంది’ అని ఐటీ కార్యదర్శి అరుణా సుందరరాజన్ మంగళవారం తెలిపారు. భారత్‌లో వాన్నాక్రై ర్యాన్సమ్వేర్ దాడులకు 48వేల ప్రయత్నాలు జరిగాయని, వీటిలో ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్నట్లు గుర్తించామని సైబర్ భద్రత సంస్థ క్విక్ హీల్ టెక్నాలజీస్ తెలిపింది.