సముద్ర రవాణాకు ప్రోత్సాహం
సాక్షి, విశాఖపట్నం: దేశంలో రోడ్డు, రైలు మార్గాల ద్వారా జరుగుతున్న సరుకు రవాణాను సముద్ర మార్గానికి ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామని నేషనల్ షిప్పింగ్ బోర్డు ఛైర్మన్ పీవీకే మొహన్ చెప్పారు. మొత్తం మూడు రకాలుగా ఈ రాయితీలివ్వాలని షిప్పింగ్ బోర్డు తీర్మానించిందని, ఈ మేరకు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు నివేదిక కూడా ఇచ్చామని చెప్పారాయన. ‘‘జల రవాణా చాలా చౌక. కానీ దాన్ని వినియోగించుకోవటంపై పెద్దగా అవగాహన లేదు. దాన్ని పెంచడానికి మేం ప్రయత్నిస్తున్నాం’’ అన్నారాయన. సోమవారమిక్కడ 123వ జాతీయ షిప్పింగ్ బోర్డు సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
స్టీల్, ఆహారధాన్యాలు, పంచదార, బియ్యం, సిమెంట్‌తో కలిపి మొత్తం 9 విభాగాల్లో ప్రాథమికంగా జలరవాణా అభివృద్ధి చేయదల్చామని, ఆ మేరకు ముందుకొచ్చేవారికి కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలియజేశారు. ఇతర దేశాల్ని పరిశీలించి, రవాణా ఛార్జీలను ఎలా తగ్గించవచ్చనే దానిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ‘‘ప్రస్తుతం తూర్పు తీరంలో 180 మిలియన్ టన్నుల కార్గో రవాణా అవుతోంది. మున్ముందు మరో 20 మిలియన్ టన్నులు పెరిగే అవకాశముంది. ట్రెయినింగ్ అండ్ ట్రేడింగ్ వెస్సల్స్ అనే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం. దీనికోసం రూ.350 కోట్లతో రెండు నౌకలు కొనుగోలు చేస్తున్నాం. ఒక్కో షిప్‌పై 90 మంది క్యాడెట్లకు శిక్షణ ఇచ్చేలా నౌకలను మారిటైమ్ యూనివర్సిటీ బోర్డుకు అందజేస్తాం.
ఎందుకంటే ప్రస్తుతం శిక్షణ లేకపోవటం వల్లే నేవల్ విద్యార్థులకు అవకాశాలు దొరకడం లేదు’’ అని వివరించారాయన. మారిటైం బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ను ఏళ్లతరబడి కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇది లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి కిలోమీటర్ల తీరం ఉన్నా నిధులు రావటం లేదని, ఢిల్లీ నుంచి ప్రాజెక్టులు ఇవ్వటానికి కూడా వీలు కుదరడంలేదని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి మయన్మార్‌కు వాణిజ్య సర్వీసు ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, శ్రీలంక నుంచి కూడా ఫెర్రీ ప్రణాళిక సిద్ధం చేశామని తెలియజేశారు. దుగ్గరాజుపట్నం ఓడరేవు నిర్మాణానికి కేంద్ర తరఫున ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.