Indian pair
-
Indonesia Open 2023: చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ
జకార్తా: భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి.. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ భారత ద్వయం.. వరల్డ్ ఛాంపియన్స్ ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీపై వరుస సెట్లలో (21-17, 21-18) విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకున్నారు. ఇండోనేసియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇది తొలి టైటిల్. సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గిన నెల రోజుల అనంతరం ఇండోనేసియా ఓపెన్ టైటిల్‌ను కూడా చేజిక్కించుకోవడం విశేషం. కాగా, సాత్విక్-చిరాగ్ జోడీ.. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే,ప్రస్తుత సీజన్లో సాత్విక్–చిరాగ్ జోడీ.. స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా.. మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ వరకు చేరింది. ఈ జోడీ ఇటీవలికాలంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, థామస్ కప్ స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. అలాగే సూపర్ 300 (సయ్యద్ మోదీ), సూపర్ 500 (థాయ్‌లాండ్, ఇండియా ఓపెన్), సూపర్ 750 (ఫ్రెంచ్ ఓపెన్) టైటిళ్లు సాధించారు. సాత్విక్ జోడీని అభినందించిన సీఎం జగన్ ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీని సీఎం జగన్ అభినందించారు. భవిష్యత్తులో ఈ జోడీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు సీఎం జగన్. -
చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్.. తొలి భారత జోడీగా రికార్డు
దుబాయ్: ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ఫైనల్లోకి ప్రవేశించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత జంటగా గుర్తింపు తెచ్చుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో ఆరో సిడ్ సాత్విక్–చిరాగ్...చైనీస్ తైపీకి చెందిన లీ యాంగ్ – వాంగ్ చిన్ లిన్‌పై విజయం సాధించారు. తొలి గేమ్‌ను 21–18తో గెలుచుకున్న భారత జంట రెండో గేమ్‌లో 13–14తో వెనుకబడి ఉన్న దశలో వాంగ్ చిన్ లిన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దాంతో ‘వాకోవర్’తో మన ఆటగాళ్లు ముందంజ వేశారు. 41 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీ (మలేసియా)తో భారత జోడి తలపడుతుంది. -
డబుల్స్‌లో పేస్‌కు నిరాశ
కివీస్ జంట చేతిలో భారత జోడీ ఓటమి పుణే: భారత వెటరన్ స్టార్ లియాండర్ పేస్ ప్రపంచ రికార్డుకు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరులో విష్ణువర్ధన్తో జతకట్టిన పేస్ జోడీకి అర్టెమ్ సితక్–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో పరాజయం ఎదురైంది. దీంతో డేవిస్ కప్ చరిత్రలో డబుల్స్ విభాగంలో అత్యధిక విజయాల (43)తో రికార్డు సృష్టించాలనుకున్న పేస్‌కు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ఇటలీకి చెందిన నికోలా (42)తో సమంగా నిలిచిన భారత సీనియర్ స్టార్‌కు రెండు నెలలపాటు నిరీక్షణ తప్పదేమో! శనివారం ఇక్కడి శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో పేస్ జంట 6–3, 3–6, 6–7 (6/8), 3–6తో న్యూజిలాండ్ జంట చేతిలో పోరాడి ఓడింది. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ కేవలం తొలి సెట్ మాత్రమే నెగ్గింది. తదుపరి సెట్లలో కివీస్ జంట ధాటికి చేతులెత్తేసింది. తాజా పరాజయంతో భారత్ ఆధిక్యం 2–1కు తగ్గింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత కుర్రాళ్లు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ విజయానికి రివర్స్ సింగిల్స్ కీలకమయ్యాయి. నేడు (ఆదివారం) జరిగే రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కటైనా గెలిస్తే భారత్ ముందంజ వేస్తుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం పేస్ మాట్లాడుతూ కీలకమైన సమయంలో తమకు లభించిన బ్రేక్ పాయింట్ అవకాశాల్ని చేజార్చుకోవడం వల్లే మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. సరైన సన్నాహకాలు లేకపోయినా విష్ణువర్ధన్ ఆటతీరు అద్భుతంగా ఉందని పేస్ కితాబిచ్చాడు.