డబుల్స్‌లో పేస్‌కు నిరాశ
కివీస్ జంట చేతిలో భారత జోడీ ఓటమి
పుణే: భారత వెటరన్ స్టార్ లియాండర్ పేస్ ప్రపంచ రికార్డుకు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరులో విష్ణువర్ధన్‌తో జతకట్టిన పేస్ జోడీకి అర్టెమ్ సితక్–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంట చేతిలో పరాజయం ఎదురైంది. దీంతో డేవిస్ కప్ చరిత్రలో డబుల్స్ విభాగంలో అత్యధిక విజయాల (43)తో రికార్డు సృష్టించాలనుకున్న పేస్‌కు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ఇటలీకి చెందిన నికోలా (42)తో సమంగా నిలిచిన భారత సీనియర్ స్టార్‌కు రెండు నెలలపాటు నిరీక్షణ తప్పదేమో! శనివారం ఇక్కడి శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో పేస్ జంట 6–3, 3–6, 6–7 (6/8), 3–6తో న్యూజిలాండ్ జంట చేతిలో పోరాడి ఓడింది.
రెండున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ కేవలం తొలి సెట్ మాత్రమే నెగ్గింది. తదుపరి సెట్లలో కివీస్ జంట ధాటికి చేతులెత్తేసింది. తాజా పరాజయంతో భారత్ ఆధిక్యం 2–1కు తగ్గింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత కుర్రాళ్లు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ విజయానికి రివర్స్ సింగిల్స్ కీలకమయ్యాయి. నేడు (ఆదివారం) జరిగే రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కటైనా గెలిస్తే భారత్ ముందంజ వేస్తుంది.
మ్యాచ్ ముగిసిన అనంతరం పేస్ మాట్లాడుతూ కీలకమైన సమయంలో తమకు లభించిన బ్రేక్ పాయింట్ అవకాశాల్ని చేజార్చుకోవడం వల్లే మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. సరైన సన్నాహకాలు లేకపోయినా విష్ణువర్ధన్ ఆటతీరు అద్భుతంగా ఉందని పేస్ కితాబిచ్చాడు.