Indian Wells WTA Premier tournament
-
సబలెంకాకు షాక్
కాలిఫోర్నీయా: ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్, బెలారస్ స్టార్ సబలెంకాకు ఊహించని పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంకా 3–6, 6–3, 2–6తో ప్రపంచ 23వ ర్యాంకర్ ఎమ్మా నవారో (అమెరికా) చేతిలో ఓడిపోయింది. -
‘ఇండియన్ వెల్స్’ చాంప్స్ బదోసా, కామెరాన్ నోరి
కాలిఫోర్నీయా: ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్, ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో పౌలా బదోసా (స్పెయిన్), కామెరాన్ నోరి (బ్రిటన్) చాంపియన్స్‌గా అవతరించారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో పౌలా బదోసా 7–6 (7/5), 2–6, 7–6 (7/2)తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచింది. తాజా గెలుపుతో బదోసా 14 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంక్ నుంచి 13వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 26వ ర్యాంకర్ కామెరాన్ నోరి 3–6, 6–4, 6–1తో బాసిలాష్ విలి (జార్జియా)పై గెలిచి ఈ టోర్నీ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా నిలిచాడు. చాంపియన్స్ బదోసా, నోరికి 12,09,730 డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. -
ఒసాకా మరో సంచలనం
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో జపాన్ యువతార నయోమి ఒసాకా తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తోంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 20 ఏళ్ల ఒసాకా 6–3, 6–0తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను బోల్తా కొట్టించింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి జపాన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. తొలి రౌండ్లో మాజీ నంబర్‌వన్ షరపోవా (రష్యా)పై, రెండో రౌండ్లో 31వ ర్యాంకర్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గిన ఒసాకా కెరీర్లో అతి పెద్ద టైటిల్‌కు మరో విజయం దూరంలో ఉంది. మరో సెమీఫైనల్లో దరియా కసత్కినా (రష్యా) 4–6, 6–4, 7–5తో మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా)ను ఓడించి ఒసాకాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. -
సూపర్ సానియా
హింగిస్‌తో కలిసి ఇండియన్ వెల్స్ టైటిల్ కైవసం కాలిఫోర్నియా (అమెరికా): ఇద్దరు అనుభవజ్ఞులు కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి నిరూపించింది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జతకట్టిన తొలి టోర్నమెంట్‌లోనే సానియా చాంపియన్‌గా నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో సానియా-హింగిస్ జంట డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-3తో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 2,95,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 83 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇండియన్ వెల్స్ ఓపెన్‌ను సానియా గెల్చుకోవడం ఇది రెండోసారి. 2011లో ఎలీనా వెస్నినా (రష్యా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 24వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్కిది 42వ డబుల్స్ టైటిల్. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో సెట్లో సానియా జోడీ 2-4తో వెనుకబడింది. అయితే అనూహ్యంగా తేరుకొని ఈ ఇండో-స్విస్ ద్వయం వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో సానియా జంట ప్రత్యర్థి జోడీలకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. తాజా విజయంతో సానియా డబుల్స్‌లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకోనుంది. సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో సానియా మూడో స్థానానికి ఎగబాకనుంది. కాగితంపై మా ఇద్దరి పేర్లు పక్కపక్కన చూస్తే మంచి జోడీ అనుకుంటారు. అయితే పేర్లతో ఏమీ కాదు. కోర్టులో అడుగుపెట్టిన తర్వాత విజయం కోసం ప్రయత్నించాలి. ఈ టైటిల్‌తో మేమిద్దరం చాలా ఆనందంగా ఉన్నాం. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా మేము నెగ్గిన విధానం మా ఆధిపత్యాన్ని సూచిస్తోంది. హింగిస్ ఆటతీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను పాయింట్ అవకాశాలు సృష్టిస్తే ఆమె దానిని ముగిస్తున్న తీరు అద్భుతం. -సానియా