పాత ఇళ్లకే బిల్లులు!
పెద్దేముల్: ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై గురువారం సీబీసీఐడీ అధికారులు మండల పరిధిలోని రేగొండిలో రెండోసారి విచారణ జరిపారు. గ్రామంలో మంజూరైన 291 ఇళ్లకు 290 ఇళ్లు పూర్తిగా నిర్మాణమైనట్లు అధికారుల రికార్డుల్లో ఉంది. కాగా వీటిలో సగానికి పైగా పాత ఇళ్లకే అధికారులు బిల్లులు ఇచ్చినట్లు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబీకులకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటిపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. గ్రామంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించుకున్న కందనెల్లి వెంకటమ్మ, బంటు నర్సింలు, బంటు హన్మంతు, లక్ష్మమ్మ, వెంకటమ్మ, చంద్రమ్మ, కొలుకుందె ఎల్లమ్మ, కోనేరు లక్ష్మి, కూర నర్సింలు, కె.వెంటకమ్మ, చంద్రకళ, కూర నర్సమ్మ తదితరుల ఇళ్లతో పాటు మొత్తం 50 ఇళ్లను సీబీసీఐడీ అధికారులు గురువారం పరిశీలించారు. జిల్లాలోని బషీరాబాద్, రేగొండి, కుల్కచర్లతో పాటు పలు గ్రామాల్లో తనిఖీలు చేశామని, ఒకే రేషన్ కార్డుపై కూడా రెండు ఇళ్లు మంజూరైనట్లు గుర్తించినట్లు సీబీ సీఐడీ అధికారులు చెప్పారు.
పెద్దేముల్, బషీరాబాద్ తదితర మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లపై విచారణ జరుపగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించామని, నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటికి రూ.41,000 బిల్లు రావాల్సి ఉండగా అధికారులు కేవలం రూ.30 వేలు, 10 బస్తాల సిమెంట్ మాత్రమే ఇచ్చారని లబ్ధిదారులకు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలియచేశారు.
అధికారులు చనిపోయిన వారి పేర్ల మీద బిల్లులు ఇస్తే చర్యలు తప్పవని సీబీసీఐడీ అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను ప్రజలు స్వచ్ఛంధంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అక్రమాలకు గ్రామస్తులు సహకరించరాదని పేర్కొన్నారు. కాగా అధికారుల తనిఖీలతో కొందరు లబ్ధిదారులు తమ ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు.
ఎంతటివారైనా చర్యలు తప్పవు..
ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగితే చర్యలు తప్పవని, అక్రమార్కులు ఎంతటివారైనా కేసులు నమోదు చేస్తామని సీబీసీఐడీ అధికారులు హెచ్చరించారు. మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లు తేలినా, అధికారులు-లబ్ధిదారులు కుమ్మకై ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించినా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. బిల్లులపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
అక్రమాలు తెలుసుకునే క్రమంలో ఇళ్లు ఎప్పుడు నిర్మాణమయ్యాయనే విషయమై నిపుణుల సలహాలు కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెంట సంబంధిత శాఖ ఇన్స్పెక్టర్లు జితేందర్‌రెడ్డి, రాజ్‌గోపాల్, తాండూరు హౌజింగ్ డీఈఈ సీతారామమ్మ ఉన్నారు.