'బాబుది అబద్దాల ప్రభుత్వం'
-ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు
విజయవాడ: ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి రహిత పాలన ఇస్తాననడం విడ్డూరంగా ఉందని, బాబుది అబద్దాల ప్రభుత్వమని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు ఎద్దేవా చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన సమ్మిట్లో 331 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు టీడీపీ ప్రభుత్వం తెలిపిందని...దీంతో రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నారు. ఇందుకు సింగిల్ విండో సిస్టమ్ అని.. 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని ప్రకటించారు. మరి ఇప్పటికి ఏ పరిశ్రమ రాష్ట్రానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పారదర్శకత అంటూ ప్రసంగాలు ఇచ్చే సీఎం అవినీతి రహిత పాలన అందిస్తా అంటున్నారు.. మరి ఈ పరిశ్రమలకు సంబంధించి ఏ వివరాలు డెరైక్టర్ ఆఫ్ ఇండస్ట్రీకి కి అందజేయలేదన్నారు. ఆర్టీఏ ద్వారా పరిశ్రమల వివరాలు అడిగినపుడు 'మా వద్ద పరిశ్రమల ఒప్పందాలకు సంబంధించి ఎటువంటి వివరాలు లేవని' డెరైక్టర్ ఆఫ్ ఇండస్ట్రీ సమాధానమిచ్చిందని ఆయన గుర్తు చేశారు. మరి చంద్రబాబు 331 సంస్థలతో ఒప్పందాలు జరిగినట్లు ఫోటోలు ఎలా చూపుతున్నారని ప్రశ్నించారు. ఆయన ప్రజలను ఎల్లవేళలా మోసం చేయలేరన్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి జరిగిన ఒప్పందాలు, వాటి వివరాలు, వాటితొ ఎంత మందికి ఉపాధి కల్గిందో అన్ని వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.