నాలుగేళ్లలో మరో మూడు డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిఫెన్స్, ఏరోస్పేస్ పరికరాల తయారీ కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. వచ్చే నాలుగేళ్లలో మరో మూడు డిఫెన్స్, ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ద్వారా కొత్తగా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆదిభట్ల వద్ద తొలి పార్క్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. రెండవది ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు వద్ద 500 ఎకరాల్లో రానుంది.
మిగిలిన పార్క్‌లు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్‌లో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు బేగంపేట విమానాశ్రయంలో అకాడమీ ఏర్పాటు కోసం ఫ్రాన్స్‌కు చెందిన బోర్డాక్స్ మెట్రోపోల్‌తో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. డిఫెన్స్, ఏరోసప్లై రెండవ సదస్సు విశేషాలను వెల్లడించేందుకు టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ ఇ.వెంకట్ నర్సింహారెడ్డితో కలిసి శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
వైమానిక ప్రదర్శన నాటికి..
బేగంపేట విమానాశ్రయంలో 2016 మార్చిలో వైమానిక ప్రదర్శన జరగనుంది. ఆ సమయానికి తెలంగాణ రాష్ట్ర డిఫెన్స్, ఏరోస్పేస్ పాలసీ రెడీ అవుతుందని అరవింద్ కుమార్ వెల్లడించారు. ‘ పరిశ్రమ ఏమి కోరుతుందో ఆ అంశాల ఆధారంగా పాలసీ రూపుదిద్దుకుంటుంది. ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కూడా ప్రోత్సాహకాలు అందిస్తాం’ అని తెలిపారు.
డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో కొత్తగా రాష్ట్రంలో కళ్యాణి ఫోర్జ్ రూ.500 కోట్లు, బోయింగ్ రూ.200 కోట్లు, వాయిత్ రూ.100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. సమూహ గ్రూప్‌కు చెందిన అయిదు కంపెనీలు ప్లాంట్ల పనులను ప్రారంభించాయన్నారు.
నూతన టెక్నాలజీపై..
డిఫెన్స్, ఏరోసప్లై రెండవ ప్రదర్శన, సదస్సు నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు ఇక్కడి హెచ్ఐసీసీలో జరుగనుంది. నూతన తరం సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య అభివృద్ధిపై సదస్సు దృష్టిసారిస్తుంది. అంతర్జాతీయంగా వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఇక్కడి కంపెనీలకు సదస్సు చక్కని వేదిక అని కీన్స్ ఎగ్జిబిషన్స్ జీఎం ప్రేమ జిల్బర్మన్ తెలిపారు. సికోర్స్కీ, ఎంబ్రార్, థేల్స్ ఇండియా, ఎయిర్‌బస్, యూరోకాప్టర్ వంటి కంపెనీలకు చెందిన సుమారు 60 స్టాళ్లు ఏర్పాటయ్యాయి.