‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. సంచలనాలు వెలుగులోకి..
పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అనే అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. ఆమెను విచారిస్తున్న ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(యూపీ ఏటీఎస్)ముందు ఆమె పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. పబ్జీ ఆడుతూ భారత్‌కు చెందిన యువకుడు సచిన్ ప్రేమలో పడి, అక్రమంగా నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన సీమాకు సంబంధించిన పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి.
సీమా సోదరుడు, మామ పాక్ ఆర్మీ సభ్యులు
తాజాగా సీమా సోదరుడు ఆసిఫ్ పాకిస్తాన్ సైన్యంలో పని చేస్తున్నాడని అధికారుల విచారణలో వెల్లడయ్యింది. అలాగే ఆమె మామ గులాం అక్బర్ కూడా పాక్ పాక్ సైన్యంలోనే పనిచేస్తున్నాడని తేలింది. ఈ విషయాన్ని సీమా భర్త గులాం హైదర్ విచారణ అధికారులకు స్వయంగా చెప్పడం విశేషం. పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న ఆసిఫ్, అతని సోదరి, తన భార్య అయిన సీమా తరచూ మాట్లాడుకునేవారనే విషయాన్ని సీమా భర్త గులాం అధికారుల సమక్షంలో వెల్లడించాడు. సీమా మామ పాక్ ఆర్మీలో ఉన్నత పదవిలో కొనసాగుతున్నారని, ఆయన ఇస్లామాబాద్‌లో ఉంటున్నాడని గులామ్ తెలిపాడు. సీమా హైదర్‌కు పాక్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో గల సంబంధాలపై ఏటీఎస్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను విచారిస్తున్నారు.
ఢిల్లీలో మరికొంతమందితో ఆమెకు పరిచయం
యూపీకి చెందిన సచిన్ మీనా అనే యువకుడి ప్రేమలో పడ్డానంటూ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి నివాసముంటున్న పాక్ మహిళ సీమా గులాం హైదర్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్) పోలీసులు విచారిస్తున్నారు. పాక్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన తర్వాత సీమా ముందుగా సచిన్ మీనాను కలుసుకోలేదని విచారణలో తేలింది. ఆమెకు రాజధాని ఢిల్లీలో మరికొంతమందితో పరిచయం ఉన్నన్నదని ఏటీఎస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎస్ అధికారుల అడిగే ప్రతి ప్రశ్నకు సీమా ఎంతో ఆలోచించి తెలివిగా సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి!
ఆశ్యర్యపరుస్తున్న సీమా ఆంగ్ల పరిజ్ఞానం
విచారణలో సీమా హైదర్ ఎంతో తెలివిగా వ్యవహరిస్తోందని, ఆమె నుంచి కీలక విషయాలకు సమాధానాలు రాబట్టడం అంత సులభం కావడంలేదని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ సమయంలో సీమాకు గల ఆంగ్ల పరిజ్ఞానాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారట. ఇదిలావుండగా సీమా హైదర్ పాక్ ఏజెంట్ అని, ఆమెను తిరిగి అక్కడికి పంపాలని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ముంబయి పోలీసులకు మెసేజ్ చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమెను పాక్ పంపించండి: భర్త వేడుకోలు
యూపీ ఏటీఎస్ అధికారుల విచారణకు ముందు సీమా ఢిల్లీ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు తెలిపారు. వీసా లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి, నివాసం ఉంటున్నందున సీమాను నోయిడా పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్టు చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్‌తోపాటు అతడి తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారికి బెయిలు లభించింది. ప్రస్తుతం ఈ ముగ్గురిని యూపీ ఏటీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా సీమా తాను పూర్తిస్థాయిలో హిందువుగా మారిపోయానని, తిరిగి పాక్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లబోనని పోలీసులకు తెలిపింది. అయితే ఆమెను ఎలాగైనా పాక్‌కు పంపించాలని ఆమె భర్త గులాం హైదర్ పోలీసులను కోరుతున్నాడు.
ఇది కూడా చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి..