Infrastructure Facilities
-
Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు
గోపేశ్వర్: ఛార్‌ధామ్ యాత్ర మొదలుకానున్న నేపథ్యంలో విచ్చేసే లక్షలాది మంది భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం చేపట్టిన మౌలికసదుపాయాలు తదితర సన్నాహక కార్యక్రమాలకు మంచు అడ్డుపడుతోంది. గురువారం భద్రీనాథ్, కేదార్నాథ్ పర్వతప్రాంతాల్లో విపరీతంగా మంచు కురిసింది. లోయ ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. ఈ ఆలయాలు కొలువుతీరిన ఛమోలీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో మంచు, వర్షం, అతిశీతల గాలులు ఉష్ణోగ్రతలను తగ్గించేస్తున్నాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో భక్తులను కేదార్నాథ్ ఆలయ దర్శనానికి అనుమతించనున్న ఈ తరుణంలో గుడికి వెళ్లే ట్రెక్ మార్గంలో మంచు పడుతోంది. అక్షయ తృతీయను పురస్కరించు కుని ఈనెల 22వ తేదీన గంగోత్రి, యము నోత్రి ఆలయాలు తెరుచు కోను న్నాయి. కేదార్నాథ్ ఆల యాన్ని 25వ తేదీన, భద్రీనాథ్ ఆలయాన్ని ఈనెల 27వ తేదీన భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. లక్షలాది మంది ఛార్‌ధామ్ యాత్రకు తరలివస్తున్న ఈ సమయంలో మంచు ముంచుకురావడంపై స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. -
పోస్ట్‌మెట్రిక్ హెచ్‌డబ్ల్యూవో సస్పెన్షన్
సీతంపేట : సీతంపేట పోస్ట్‌మెట్రిక్ వసతిగృహ సంక్షేమాధికారి కె.రాజారావును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదివారం సస్పెండ్ చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పీవో ఆకస్మికంగా ఈ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. వసతిగృహ మేనేజ్మెంట్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించకపోవడం, మౌలికవసతులు కల్పించాలని గతంలో హెచ్చరించినా సరైన మౌలికవసతులు కల్పించకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం వంటి కారణాలతో ఆయన్ని సస్పెండ్ చేసినట్టు పీవో తెలిపారు. సరైన పర్యవేక్షణ లేనందుకు ఏటీడబ్ల్యూవో వెంకటరమణకు షోకాజ్‌నోటీసు ఇవ్వనున్నట్టు చెప్పారు. -
అంగన్వా‘డీలా’
పందిరి కింద.. నార్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ, ఒడ్దెరబస్తీలోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించగా.. దొడ్డు బియ్యంతోనే భోజనం పెట్టారు. కేంద్రాలకు ఒక నెల నుంచి గుడ్లు ఇవ్వడం లేదని తెలిసింది. సొంత భవనం లేకపోవడంతో ఆరుబయటే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇందిరానగర్‌లో కేంద్రానికి సొంత భవనాలు లేకపోవడంతో కాలనీ పెద్ద మనిషి ఇంటి వరండాలో కూర్చుని అంగన్వాడీ టీచర్లు కార్యకలాపాలను నిర్వహిస్తూ కనిపించారు. గుడ్లు ప్రతి రోజు కాకుండా నెలకు ఒకేసారి ఇస్తున్నారు. మూడేళ్లలోపు పిల్లలు 21,685 ఆరేళ్లలోపు పిల్లలు 30,503 గర్భిణులు, బాలింతలు 10,520 అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలు 987 మినీ కేంద్రాలు 269 మొత్తం 1256 మూడు నెలలుగా పాల సరఫరా లేదు.. భీంపూర్(బోథ్) : మండలంలో 29 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. శుక్రవారం నిపానిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించగా.. ఐసీడీఎస్ ద్వారా అందుతున్న పౌష్టికాహారంలో భాగంగా అన్నం, పాలు అందించాల్సి ఉంది కానీ వాటి జాడ కనిపించడం లేదు. మొత్తం 34మంది పిల్లలు ఉండగా.. వీరిలో 19 మంది ప్రీస్కూల్ పిల్లలు ఉన్నారు. సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో అరకొర సౌకర్యాలతో కొనసాగుతోంది. పిల్లలకు మూడు నెలల నుంచి పాలు లేకుండా సెంటర్ నిర్వహిస్తున్నారు. బియ్యంతోపాటు ప్రతీ రోజు ఆకు కూరలతో అక్కడే వండి వడ్డించాల్సి ఉండగా.. ఆ వ్యవస్థ కనిపించలేదు. ప్రీస్కూల్ ఆటవస్తువులు కూడా లేవు. ఆదిలాబాద్ టౌన్ : అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. పర్యవేక్షణ లోపం.. అరకొర సౌకర్యాలు.. ఇరుకైన గదులు.. అమలుకు నోచుకోని మెనూ.. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందని పౌష్టికాహారం.. మూడు నెలలుగా నిలిచిన పాల సరఫరా.. వెరసి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మొక్కుబడి వ్యవహారంగా మారింది. జిల్లాలోని 18 మండలాల్లో ఐదు ప్రాజెక్టులు, 51 సెక్టార్లు ఉన్నాయి. మొత్తం 1,256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 21,685 మంది, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 30,503 మంది, గర్భిణులు, బాలింతలు 10,520 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతి రోజు ఒక పూట మధ్యాహ్నం పూర్తి స్థాయి భోజనం వండిపెట్టాలి. కానీ ఏ కేంద్రంలోనూ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. చాలా కేంద్రాల్లో పాలు, నూనె, పప్పు సరుకులు లేవు. నాణ్యమైన భోజనం వండిపెట్టకపోవడంతో లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా.. ఉడికించకుండానే కార్యకర్తలు వాటిని ఇంటికి పంపిస్తున్నారు. లోపించిన పర్యవేక్షణ.. ఐసీడీఎస్‌లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. ఆదిలాబాద్ అర్బన్ ప్రాజెక్టుకు ఐదారేళ్లుగా ఇన్చార్జీ అధికారులతో కాలం వెల్లదీస్తున్నారు. చాలామంది అంగన్వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించడంలేదు. సక్రమంగా కేంద్రాలను తెరవడంలేదు. దీంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. కేంద్రాలు తెరిచిన వారిలో చాలా మంది అంగన్వాడీలు భోజనం సక్రమంగా వండిపెట్టలేదు. సరుకులు ఉన్న కేంద్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. పర్యవేక్షించాల్సి కొందరు సూపర్వైజర్లు కార్యాలయానికి పరిమితం అవుతున్నారు. కొందరు అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన గుడ్లు, ఇతర సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదిలాబాద్ అర్బన్ ప్రాజెక్టులో డిసెంబర్ నుంచి పాల సరఫరా లేదు. ఉట్నూర్, బోథ్ ప్రాజెక్టులో కూడా అదే పరిస్థితి ఉంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. హాజరు అంతంతమాత్రమే.. బోథ్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–2, సాయినగర్‌లోని అంగన్వాడీ కేంద్రం–2ను ‘సాక్షి’ బుధవారం పరిశీలించింది. బోథ్ కేంద్రంలో 6 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 45 మంది ఉండగా, మూడు నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు 35మందితో కలిపి మొత్తం 80 మంది ఉన్నారు. కాగా ‘సాక్షి’ సందర్శించిన సమయానికి మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 16 మంది మాత్రమే కనిపించారు. పాలు రెండు నెలల తరువాత ఫిబ్రవరిలో వచ్చాయి. రెండు నెలలుగా చిన్నారులకు పాలు సరఫరా చేయలేదని అంగన్వాడీ కార్యకర్త చారుశీల పేర్కొన్నారు. సాయినగర్‌లో 2వ అంగన్వాడీ కేంద్రంలో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 20 మంది ఉండగా, మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు 18 మంది కలిపి మొత్తం 38 మంది ఉన్నారు. వీరిలో 16 మంది మాత్రమే హాజరయ్యారు. పాలు రెండు నెలలుగా రాలేదని, నాలుగు రోజుల క్రితం వచ్చాయని కేంద్రం నిర్వాహకురాలు లలిత తెలిపారు. బాలామృతం బంద్.. జైనథ్ మండలం బాలపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం 11.20 గంటలకు ‘సాక్షి’ సందర్శించింది. ఏడుగురు చిన్నారులు కనిపించారు. 6 నెలల నుంచి మూడేళ్లలోపు 23 మంది చిన్నారులకు గాను 10 మంది పేర్లు రిజిస్ట్రర్‌లో నమోదై ఉన్నాయి. ఏడుగురు కేంద్రంలో కనిపించారు. మిగతా ముగ్గురు ఇంటికి వెళ్లినట్లు సిబ్బంది చెప్పారు. కేంద్రం పరిధిలో గర్భిణులు, బాలింతలు ఐదుగురు చొప్పున ఉండగా.. ఇద్దరు గర్భిణులు మాత్రమే కేంద్రంలో కనిపించారు. కేంద్రానికి సంవత్సరం నుంచి పాలు సరఫరా కావడం లేదు. 2 నెలలుగా పిల్లలకు ఇచ్చే మురుకులు, బాలామృతం సరఫరా కావడం లేదు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో 1 నుంచి 3 సంవత్సరాల చిన్నారులు 27 మంది ఉన్నారు. వీరికి బాలామృతం రెండు రోజుల నుంచి రావడం లేదు. గర్భిణులు, బాలింతలు భోజనం చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. అనారోగ్యలక్ష్మి గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. చాలా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో అనారోగ్యలక్ష్మిగా మారింది. జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, నూనె, పప్పు సరఫరా కావడం లేదు. కోడిగుడ్లు సరఫరా అవుతున్నా కొన్ని కేంద్రాల్లో సక్రమంగా పంపిణీ చేయడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు, పెరుగుతో కూడిన పౌష్టికాహారం అందించాల్సి ఉన్నప్పటికీ కనీసం పప్పు అన్నం కొన్ని కేంద్రాల్లో పెట్టడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. చాలా కేంద్రాల్లో వంట చేయడం లేదు. సమయానికి కేంద్రాలు తెరవడం లేదు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటోంది. చాలా అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదుల్లో కూర్చుంటూ అవస్థలకు గురవుతున్నారు. ఆరోగ్యలక్ష్మి మెనూ ఇదీ.. వారం ఇవ్వాల్సిన భోజనం సోమవారం అన్నం, కూరగాయలతో సాంబారు, గుడ్డు కూర, పాలు మంగళవారం అన్నం, పప్పు, ఆకు కూరలు, గుడ్డు, పాలు బుధవారం అన్నం, ఆకు కూరలతో పప్పు, గుడ్డుకూర, గుడ్డు, పాలు గురువారం అన్నం, కూరగాయలతో సాంబారు, పెరుగు, గుడ్డుకూర, పాలు శుక్రవారం అన్నం, పప్పు, ఆకుకూరలతో కూర, గుడ్డు, పాలు శనివారం ఆకుకూరలతో పప్పు, పెరుగు, గుడ్డు, పాలు ఈ మోను ప్రకారం భోజనం పెట్టాలి. కానీ ఏ కేంద్రంలోనూ పాటించడం లేదు. ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు జాడలేదు. పప్పునీళ్లు, గుడ్డు మాత్రమే ఇస్తున్నారు. దొడ్డు బియ్యంతో భోజనం పెట్టడంతో చాలామంది తినడానికి కేంద్రానికి రావడం లేదు. భవనం లేక ఇబ్బందిగా ఉంది మా కాలనీలో అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేదు. ఆరుబయటే కూర్చుని భోజనం చేయాల్సి వస్తొంది. ఆయమ్మ లేకపోవడంతో వంట కూడా సరిగా> చేయడం లేదు. ఈ నెల గుడ్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. పెద్ద సార్లు పట్టించుకోని సమస్యలు పరిష్కరించాలి. – రమబాయి, గ్రామం: ఇందిరనగర్, మం : నార్నూర్ భారం భరించలేకుండా ఉన్నాం అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగా మారుతోంది. సహాయకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సిలిండర్‌కు రూ.150 ఇస్తున్నారు. ఇవి ఎటూ సరిపోవడం లేదు. డబ్బులను స్వంతంగా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అద్దె భవనాలకు సంవత్సరానికి ఒకసారి అద్దె చెల్లిస్తున్నారు. దీనివల్ల యాజమానులు ఖాళీ చేయాలంటున్నారు. మరోవైపు చిన్నారులకు రెండు నెలలుగా పాలు సరఫరా చేయడం లేదు. ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చాలి. – చారుశీల, అంగన్వాడీ కేంద్ర నిర్వాహకురాలు సమయ పాలన పాటించాలి.. అంగన్వాడీ కార్యకర్తలు సమయ పాలన పాటించాలి. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కంది పప్పు, నూనె, బియ్యం సరుకులు అందుబాటులో ఉన్నాయి. పా లకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి సరఫరా కావడం లేదు. ఈ విష యం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. – మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి -
‘మహా’ మేలు!
- ‘స్వచ్ఛ హైదరాబాద్’తో శివారుకు మహర్దశ - అభివృద్ధి పనులకు సన్నాహాలు - మౌలిక వసతుల వైపు అడుగులు - అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో రూ.123 కోట్ల పనులు సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’ పుణ్యమా అని గ్రేటర్‌లోని కొన్ని నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుంది. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సౌకర్యాలకు రూ.100 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో రూ.10 కోట్లలోపు పనులు జరగనున్నాయి. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో శివారులోని నాలుగు నియోజకవర్గాల నుంచి రూ.వంద కోట్లకు పైగా ఖర్చయ్యే వినతులు అందాయి. కోర్‌సిటీలోని కొన్ని నియోజకవర్గాల నుంచి రూ.పది కోట్లలోపు వ్యయమయ్యే విజ్ఞప్తులు అందాయి. ఆమేరకు అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.వంద కోట్లకు పైగా పనులు ప్రతిపాదించిన నియోజకవర్గాల్లో కుత్బుల్లాపూర్ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడి పనులకు దాదాపు రూ.123 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. ఆ తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి (రూ.108 కోట్లు), ఎల్బీ నగర్ (రూ.107 కోట్లు), కూకట్పల్లి (రూ.100 కోట్లు) ఉన్నాయి. రూ.పది కోట్లలోపు ప్రతిపాదనల్లో కంటోన్మెంట్, యాకుత్‌పురా, నాంపల్లి, సనత్‌నగర్, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. నిధులెలా తెస్తారో? ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు రూ.200 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సిద్ధమయ్యాయి. వినతులు అందుకు మూడు రెట్లకు పైగా ఉన్నాయి. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా బస్తీలకు నేతృత్వం వహించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రజల విజ్ఞప్తులను జీహెచ్ఎంసీకి నివేదించారు. వీటికి రూ.700 కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కేవలం పారిశుద్ధ్య కార్యక్రమంగా మిగలరాదని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించనిదే దానికి సార్థకత లేదని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో అధికారులు విభాగాలు, యూనిట్ల వారీగా పనులను క్రోడీకరించే పనిలో పడ్డారు. ఈ నెల 26న గ్రేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమీక్షించి పనులు చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీ నిధులు రూ.200 కోట్లతో వెంటనే పనులు చేపట్టేందుకు ఇబ్బంది లేనప్పటికీ, మిగతా రూ. 500 కోట్లు బాండ్ల ద్వారా సేకరిస్తారా.. ప్రభుత్వం కేటాయిస్తుందా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. -
వ్యాపారుల, పేదల పక్షపాత వ్యాఖ్యలు సరైనవే: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇటు వ్యాపార వర్గాలు, అటు పేద ప్రజల పక్షపాతిగా ఉంటుందన్న తన వ్యాఖ్యల్లో వైరుధ్యమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇవి రెండూ ఒకదానికి మరొకటి భిన్నమైనవేమీ కావన్నారు. వ్యాపార వర్గాల ద్వారా వచ్చే ఆదాయాలతోనే ఇన్ఫ్రా సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు సాధ్యపడుతుందని వివరించారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో సోమవారం తన కవర్ ఫొటో మార్చిన సందర్భంగా జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వానికి ఆదాయం వస్తే తప్ప.. మౌలిక సదుపాయాల కల్పన, పేదల సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార, పేద వర్గాల పక్షపాతిగా ఉంటుందన్న నా వ్యాఖ్యల్లో వైరుధ్యమేమీ లేదు’ అని పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. వ్యాపార, పేద వర్గాలకు తమ ప్రభుత్వం అనుకూలమైనదని జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదాయాలు మెరుగుపర్చుకునేందుకు, ఖర్చు చేసే సంస్కృతిని పెంచేందుకు.. తద్వారా పేద వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండటం అవసరమని అప్పట్లో ఆయన చెప్పారు. -
జేఎన్టీయూకు మహర్దశ
యూనివర్సిటీ: జేఎన్టీయూ అనంతపురం ప్రగతి పథంలో పయనించడానికి అడుగులు వేస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక సాధారణ బడ్జెట్లో జేఎన్టీయూకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహాని పిలుపు మేరకు మంగళవారం వీసీ ఆచార్య కే లాల్‌కిశోర్, రిజిస్ట్రార్ కే హేమచంద్రారెడ్డిలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఆ వివరాలను బుధవారం వీసీ ఆచార్య లాల్‌కిశోర్ వెల్లడించారు. 2013-14 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. ఆ కళాశాలను 300మంది విద్యార్ధులతో ప్రారంభించామని, 2015-16 విద్యా సంవత్సరానికి వీరి సంఖ్య 900 మందికి చేరుకుంటుందని చెప్పారు. అలాగే ఖాళీగా వున్న బోధనా పోస్టుల భర్తీకై ఆర్థిక పరమైన అనుమతులను బడ్జెట్లో పొందుపరచాలని కోరామన్నారు. నూతనంగా రెండు కళాశాలలకు అటానమస్ హోదా 2014-15 విద్యా సంవత్సరానికి జేఎన్టీయూ పరిధిలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెన్సైస్, కడపలోని కేఎస్ఆర్ఎం కళాశాలలకు అటానమస్ హోదాను కల్పించారు. దీంతో జేఎన్టీయూఏ పరిధిలో 10 కళాశాలలకు అటానమస్ హోదా కల్పించినట్లైంది. జేఎన్టీయూ కాకినాడ, హైదరాబాద్‌ల కంటే ఎక్కువ అటానమస్ కళాశాలలను ప్రోత్సహిస్తున్న యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అలాగే నూతనంగా తాడిపత్రి సీవీ రామన్ కళాశాలలో ఎంబీఏ కోర్సు ప్రారంభానికి అనుమతి ఇచ్చారు. ఫుల్‌టైం పీహెచ్డీ ప్రోగ్రాంకు శ్రీకారం ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో ఫుల్‌టైం పీహెచ్డీ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. అనుబంధ కళాశాలలకు కూడా ఈ విధానాన్ని వర్తింపచేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది రీసెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. -
జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ బాధ్యతల స్వీకరణ
- జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి పాతగుంటూరు: జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ సోమవారం తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు జెడ్పిటీసీ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు. అనంతరం జానీమూన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాపరిషత్ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ లక్ష్యసాధనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పని చేయూలని అన్నారు. పాలన వ్యవహారాలను తెరవెనుక నుంచి ఎవరైనా చూస్తారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా తాను ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేశానని, అన్ని అంశాలను సొంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలో తనకు తెలుసని చెప్పారు. అధికారులను సమన్వయం చేసుకుని పని చేస్తామని వివరించారు.