‘మహా’ మేలు!
- ‘స్వచ్ఛ హైదరాబాద్’తో శివారుకు మహర్దశ
- అభివృద్ధి పనులకు సన్నాహాలు
- మౌలిక వసతుల వైపు అడుగులు
- అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో రూ.123 కోట్ల పనులు
సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’ పుణ్యమా అని గ్రేటర్‌లోని కొన్ని నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుంది. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సౌకర్యాలకు రూ.100 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో రూ.10 కోట్లలోపు పనులు జరగనున్నాయి. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో శివారులోని నాలుగు నియోజకవర్గాల నుంచి రూ.వంద కోట్లకు పైగా ఖర్చయ్యే వినతులు అందాయి. కోర్‌సిటీలోని కొన్ని నియోజకవర్గాల నుంచి రూ.పది కోట్లలోపు వ్యయమయ్యే విజ్ఞప్తులు అందాయి.
ఆమేరకు అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.వంద కోట్లకు పైగా పనులు ప్రతిపాదించిన నియోజకవర్గాల్లో కుత్బుల్లాపూర్ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడి పనులకు దాదాపు రూ.123 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. ఆ తర్వాతి స్థానాల్లో శేరిలింగంపల్లి (రూ.108 కోట్లు), ఎల్‌బీ నగర్ (రూ.107 కోట్లు), కూకట్‌పల్లి (రూ.100 కోట్లు) ఉన్నాయి. రూ.పది కోట్లలోపు ప్రతిపాదనల్లో కంటోన్మెంట్, యాకుత్‌పురా, నాంపల్లి, సనత్‌నగర్, జూబ్లీహిల్స్ తదితర నియోజకవర్గాలు ఉన్నాయి.
నిధులెలా తెస్తారో?
‘స్వచ్ఛ హైదరాబాద్’లో ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు రూ.200 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సిద్ధమయ్యాయి. వినతులు అందుకు మూడు రెట్లకు పైగా ఉన్నాయి. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా బస్తీలకు నేతృత్వం వహించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రజల విజ్ఞప్తులను జీహెచ్‌ఎంసీకి నివేదించారు.
వీటికి రూ.700 కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కేవలం పారిశుద్ధ్య కార్యక్రమంగా మిగలరాదని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించనిదే దానికి సార్థకత లేదని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో అధికారులు విభాగాలు, యూనిట్ల వారీగా పనులను క్రోడీకరించే పనిలో పడ్డారు. ఈ నెల 26న గ్రేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమీక్షించి పనులు చేపట్టనున్నారు. జీహెచ్‌ఎంసీ నిధులు రూ.200 కోట్లతో వెంటనే పనులు చేపట్టేందుకు ఇబ్బంది లేనప్పటికీ, మిగతా రూ. 500 కోట్లు బాండ్ల ద్వారా సేకరిస్తారా.. ప్రభుత్వం కేటాయిస్తుందా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది.