సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛహైదరాబాద్’లో భాగంగాజీహెచ్‌ఎంసీ చేపట్టినకార్యక్రమాల్లో ఎలక్ట్రిక్ కార్లు ఒకటి. పెట్రోలు, డీజిల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తే వాహన కాలుష్యం, ఇంధన వ్యయం తగ్గుతుందని, పర్యావరణ పరంగానూ మేలు చేకూరుతుందని జీహెచ్‌ఎంసీ భావించింది. తొలుత బల్దియా అధికారుల కోసంవినియోగిస్తున్న అద్దె కార్ల స్థానంలోనే వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిదశలో 20 మంది అధికారులకు అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ కార్లను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు ఏడాది క్రితం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్, యూఎన్‌ఈపీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్ కార్లను లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ వాహనాలకు చరమగీతం పాడతామని, జీహెచ్‌ఎంసీలో దశలవారీగా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెడతామని ప్రకటించారు. మలి దశలో చెత్త తరలించే స్వచ్ఛ ఆటోలు సైతం ఎలక్ట్రిక్‌వే వినియోగిస్తామని పేర్కొన్నారు. కానీ ఏడాదవుతున్నా ఎలక్ట్రిక్ కార్లు వినియోగంలోకి రాలేదు. ప్రారంభించిన ఆ కార్లు ఏమయ్యాయో తెలియదు. ఇక ఎలక్ట్రిక్ కార్లే వాడతారనే ప్రచారం జరగడంతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం సహా జోన్లలోనూ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు ఎలక్ట్రిక్ కార్లే రాలేదు.
అసలేం జరిగింది?
జీహెచ్‌ఎంసీలో అధికారుల కోసం దాదాపు 350 అద్దె కార్లను వినియోగిస్తున్నారు. దశలవారీగా వాటన్నింటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. తొలుత ఆరేళ్ల కాలానికి ఈఈఎస్‌ఎల్ నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకొని.. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఒప్పందం పొడిగించుకోవాలని అనుకున్నారు. డ్రైవర్ వేతనం కాకుండా నెలకు ఒక్కో కారును రూ.22,500 అద్దెకు ఇచ్చేందుకు ఈఈఎస్‌ఎల్ అంగీకరించింది. జీహెచ్‌ఎంసీలో ఖాళీగా ఉన్న డ్రైవర్ల సేవల్ని వినియోగించుకోవాలనుకున్నారు. ఎలక్ట్రిక్ కారు ధర దాదాపు రూ.11 లక్షలు. నెలనెలా జీహెచ్‌ఎంసీ చెల్లించే అద్దెనే ఈఎంఐగా కడితే కారునే కొనుక్కోవచ్చు. ఈఈఎస్‌ఎల్ సైతం జీహెచ్‌ఎంసీ ద్వారా లభించే అద్దెనే ఈఎంఐగా కట్టి రుణంపై కార్లు అందుబాటులోకి తేనుందని తెలుసుకున్న అధికారులు... రుణంగా తీసుకుంటే కారే జీహెచ్‌ఎంసీ సొంతమవుతుందని భావించారు. అయితే వాహనాల కొనుగోళ్లపై ప్రభుత్వ నిషేధం ఉంది. అద్దెకైతే ఎన్ని కార్లయినా తీసుకోవచ్చు గానీ... కొనడానికి జీహెచ్‌ఎంసీకి అవకాశం లేకపోవడంతో వీల్లేకపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు ఈఈఎస్‌ఎల్‌తో జరిపిన సంప్రదింపులతో ఒప్పందం మేరకు ఆరేళ్ల అద్దె గడువు ముగిశాక అప్పటి పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని దాదాపు రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తే అద్దెకార్లను జీహెచ్‌ఎంసీ పరం చేసేందుకు ఈఈఎస్‌ఎల్ అంగీకరించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. చట్టపరంగానూ ఇబ్బందులు లేకుండా చూడాల్సి ఉంది. వీటిపై వెంటనే శ్రద్ధ చూపితే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చి ఉండేవేమో. కానీ సంబంధిత అధికారులు ఈ అంశంపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పటి వరకు కార్యాచరణకు నోచుకోలేదు. కేటీఆర్ చేతుల మీదుగా జరిగిన ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభోత్సవం కేవలం ‘ఫొటో ఫినిష్’ కార్యక్రమంగా మిగిలిపోయింది.
లక్ష్యం.. 2030
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ తదితర సంప్రదాయ ఇంధన వాహనాల వినియోగాన్ని భవిష్యత్తులో రద్దు చేయనుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ఇంధన, పరిశ్రమల మంత్రిత్వ శాఖలు కలిసి ‘నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టాయి. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలే రోడ్లపై తిరగాలనేది దీని లక్ష్యం.
ప్రయోజనాలివీ...
♦ బ్యాటరీని 6–8 గంటల సమయంతో పూర్తిగా చార్జింగ్ చేయొచ్చు.
♦ ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 100–130 కి.మీ.ల వరకు ప్రయాణించొచ్చు. అత్యవసరంగా చార్జింగ్ కావాలనుకుంటే ఏసీ చార్జర్ బదులు డీసీ చార్జర్ వినియోగిస్తే గంటన్నరలోనే చార్జింగ్ పూర్తవుతుంది.
♦ వీటితో వాయు, ధ్వని కాలుష్యం ఉండదు. కార్బన్ డయాక్సైడ్ వెలువడదు.
♦ చార్జింగ్ వల్ల కిలోమీటరు ప్రయాణానికి దాదాపు రూ.0.89 పైసల విద్యుత్ ఖర్చవుతుంది.
♦ బ్యాటరీ జీవితకాలం లక్ష కిలోమీటర్ల ప్రయాణం.
Comments
Please login to add a commentAdd a comment