అందమా అందుమా! | GHMC Planning Indore Swachh Hyderabad | Sakshi
Sakshi News home page

అందమా అందుమా!

Published Fri, Apr 19 2019 9:18 AM | Last Updated on Mon, Apr 22 2019 10:49 AM

GHMC Planning Indore Swachh Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛ’ హైదరాబాద్‌ లక్ష్యం సాకారం కావడం లేదు. ప్రతిఏటా ‘స్వచ్ఛ’ కార్యక్రమాల అమలుకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ‘స్వచ్ఛ’ ర్యాంకింగ్‌ల సమయంలో కేంద్ర బృందాలు తనిఖీలకు వచ్చినప్పుడు హడావుడి చేసే అధికారులు... ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. ఫలితంగా నగరానికి స్వచ్ఛ ర్యాంకింగ్‌లు వస్తున్నాయి కానీ... నగరం మాత్రం స్వచ్ఛంగా మారడం లేదు. అనేక ప్రాంతాల్లో వీధులను ప్రతిరోజు ఊడ్వడం లేదు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించడం లేదు. దీన్ని నివారించేందుకు, హైదరాబాద్‌ను ‘స్వచ్ఛ’, అందమైన నగరంగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ మరో కార్యాచరణకు సిద్ధమైంది. ప్రతిఏటా ‘స్వచ్ఛ’ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో నిలుస్తున్న ఇండోర్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లనుంది. ‘స్వచ్ఛ’ కార్యక్రమాల నిర్వహణకు అక్కడ అమలు చేస్తున్న ‘మైక్రో ప్లానింగ్‌’ను నగరంలో ప్రవేశ పెట్టనుంది. వంద రోజుల లక్ష్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ఈ నెల 22న ప్రారంభం కానుంది. ఇంతలోపు అవసరమైన వనరులను సమకూర్చుకోవడం, రిహార్సల్స్‌ నిర్వహించడం తదితర చేయాలనిజీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ అధికారులకు సూచించారు. 

జీహెచ్‌ఎంసీలో 18 వేలకు పైగా పారిశుధ్య కార్మికులు ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాల్లో రోజూ ఊడ్వడం లేదు. అనేక కాలనీలు, బస్తీల్లో వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఊడుస్తున్నారు. ఇక రోడ్ల పక్కన, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర పేరుకుపోయిన చెత్తాచెదారాలను అలాగే వదిలేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు నగరమంతా ఒకేసారి కాకుండా ఎంపిక చేసిన ప్రాంతాల పరిధిలో పైలట్‌ ప్రాజెక్టుగా తొలుత దీన్ని అమలు చేయనున్నారు. ఒక్కో వార్డులోని దాదాపు 2,500 ఇళ్ల పరిధి మేరకు ఇందుకు ఎంపిక చేస్తారు. గ్రేటర్‌లోని 150 వార్డులు ఉండగా.. వెరసి 3.75 లక్షల ఇళ్ల పరిధిలో దీన్ని అమలు చేస్తారు. మిగతా ప్రాంతాల్లో తర్వాతి దశల్లో చేపడతారు. అయితే ఎంపిక చేసిన వాటిలో కచ్చితంగా మురికివాడలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై కాగితాలు లేకుండా రోజుకు రెండుసార్లు తనిఖీలు చేస్తారు. ఈ కార్యక్రమం అమలులో స్వచ్ఛ ఆటోలు, కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్స్, ఎన్జీఓలు, ప్రజాప్రతినిధులు, పర్యావేరణవేత్తలు, ఆయా రంగాల్లోని ప్రముఖులు, ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. వంద రోజుల లక్ష్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్ణీత వ్యవధుల్లో ఏయే పనులు చేయాలనే దానిపై కార్యాచరణ రూపొందించారు. 

ఇంకేం చేస్తారు?  
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కాగితాలు రోడ్లపై వేయొద్దని దుకాణదారులకు సూచిస్తుంది. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానాలు వసూలు చేస్తుంది.  
ఓడీఎఫ్‌ (ప్లస్‌ ప్లస్‌) అర్హత కొనసాగేందుకు అన్ని కమ్యూనిటీ, పబ్లిక్‌ టాయిలెట్లను సక్రమంగా నిర్వహించడం.  
బహిరంగ మూత్ర విసర్జన, బహిరంగ మల విసర్జన ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం.
ఎన్జీఓల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.  
చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల సక్రమ నిర్వహణకు స్థానిక డిప్యూటీ కమిషనర్‌ వారానికి రెండుసార్లు, ఏఎంఓహెచ్‌లు వారానికి మూడుసార్లు తనిఖీలు చేసి ఇబ్బందులేమైనా ఉంటే పరిష్కరించాలి.
ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లలో పచ్చదనం పెంపొందించాలి. సుందరీకరణ పనులు చేపట్టాలి.  
ఉదయం 6గంటలకు ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ వద్ద ఎలాంటి చెత్త కనిపించకూడదు.  
దెబ్బతిన్న రహదారులు, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు చేయాలి.   
రోడ్లపై చెత్త, కాగితాలు, నిర్మాణ వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలి.   
బహిరంగ మూత్ర విసర్జనకు జరిమానాలు వేయడం.

భాగస్వాములు వీరు...  
సాధారణ ప్రజలు, విద్యార్థులు, దుకాణాదారులు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, ఎన్జీఓలు, కార్మికులు, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సీనియర్‌ సిటిజెన్స్, మతపెద్దలు.   
ఇక అధికారులు, సిబ్బంది విషయాని వస్తే కమిషనర్, అడిషనల్‌ కమిషనర్, జోనల్‌ కమిషనర్లు, స్వచ్ఛ భారత్‌ మిషన్, రవాణా విభాగం, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కార్యాలయ విభాగం, వెటర్నరీ వింగ్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌లు, యూసీడీ డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ జవాన్లు, శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్స్, స్వీపర్లు, చెత్త సేకరణ సిబ్బంది.   

చేయాల్సిన పనులివీ...  
ఇళ్ల నుంచి చెత్తను తరలించే స్వచ్ఛ ఆటోల రూట్‌ మ్యాప్‌. అవి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పని చేస్తున్నాయో తెలుసుకోవాలి.  
స్వచ్ఛ ఆటోలను నడిపే వారికి కేటాయించిన 600 ఇళ్లలో కనీసం 10శాతం ప్రజల నుంచి సీఆర్‌పీలు ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి.  
ఈ ఫీడ్‌బ్యాక్‌పై ఎన్జీఓ కార్యకర్తతో క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. ఇందుకుగాను కనీసం 5శాతం ఇళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి. అనంతరం ఏఎంఓహెచ్‌ ర్యాండమ్‌గా పరిశీలించాలి.  
స్వచ్ఛ ఆటోలు ప్రతిరోజూ రెండు ట్రిప్పులు పని చేయాలి.  
ఇళ్ల యజమానులు ఎవరైనా స్వచ్ఛ ఆటోలకు డబ్బులు ఇవ్వకుంటే అవగాహన కల్పించాలి.  
బహిరంగ ప్రదేశాల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు, చెట్ల కొమ్మలు వేసే ప్రాంతాలు గుర్తించి సాయంత్రం వాటిని తొలగించాలి. తిరిగి అక్కడ చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలి.  
ప్రతి స్వచ్ఛ ఆటో కనీసం 600 ఇళ్ల నుంచి చెత్త సేకరించాలి.  
ఎంపిక చేసిన ప్రాంతంలోని వీధులను పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ శుభ్రం చేయాలి. డ్రైనేజీ పొంగిపొర్లకుండా చూడాలి. చెత్త కాల్చివేయడం లాంటి పనులు చేయకుండా చూడాలి.  
కమ్యూనిటీ డస్ట్‌బిన్‌ల చుట్టూ చెత్త పేరుకుపోకుండా చూడాలి. వాటి నుంచి ఎప్పటికప్పుడు చెత్త తరలించాలి. క్రమేపీ చెత్త డబ్బాలనేవి లేకుండా చేయాలి.   
బిన్‌ ఫ్రీ, డస్ట్‌ ఫ్రీ, లిట్టర్‌ ఫ్రీ ప్రాంతంగా తీర్చిదిద్దాలి. దీన్ని నిరంతరం కొనసాగించాలి.  

ఏ పని? ఎన్ని రోజులు?
15 రోజుల్లోగా అన్ని కాలనీలు, బస్తీలకు స్వచ్ఛ ఆటోలు వెళ్లేలా చూడాలి.  
30 రోజుల్లోగా ఇంటింటి చెత్త సేకరణ వందశాతం పూర్తి చేయాలి.  
90 రోజుల్లోగా తడి, పొడి చెత్తను వేరు చేయడం వందశాతం పూర్తి చేయాలి.  
30 రోజుల్లోగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు తదితర లేకుండా చూడాలి.  
60 రోజుల్లోగా కాలనీ పార్కులు, అధిక మొత్తంలో చెత్త వెలువడే ప్రాంతాల్లో కంపోస్టు తయారీ.   
30 రోజుల్లోగా అధిక మొత్తంలో చెత్త వెలువడే ప్రాంతాల నుంచి సేకరణ ఏర్పాట్లు.  
15 రోజుల్లోగా రోడ్లను ఊడ్వడమే కాకుండా కాగితాలు లేకుండా చేయాలి.  
45 రోజుల్లోగా ఓడీఎఫ్‌ పటిష్టంగా అమలు చేయడం.  
15 రోజుల్లోగా వాణిజ్య ప్రాంతాల్లో సాయంత్రం రోడ్లు ఊడ్వడం, చెత్త సేకరణ చేపట్టడం.  
60 రోజుల్లోగా చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నిర్వహణ    మెరుగు పరచడం.  
30 రోజుల్లోగా హాట్‌స్పాట్‌ మేనేజ్‌మెంట్‌.   
15 రోజుల్లోగా బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు, 30 రోజుల్లోగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం తనిఖీలు. 

పైన పేర్కొన్న నిర్ణీత వ్యవధుల్లో ఆయా లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు వాటిని నిరంతరం కొనసాగించాలి. ఈ క్రతువులో కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్స్, ఎన్జీఓలు, పారిశుధ్య గ్రూపుల సభ్యులు, శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, స్వచ్ఛ ఆటోలు భాగస్వామ్యం కావాలి. వీరందరూ యూనిఫామ్స్‌ ధరించాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement