కళనే వలగా..
అలల జోలపాటకు బజ్జున్న పాపాయిలా ఉంటుంది ససరన్!మలేసియా దేశపు పడమటి సముద్రతీరపు గ్రామం. ఇక్కడివారికి చేపల వే టే ఆధారం. ముత్తాతల కాలం నుంచీ ఇదే జీవనవిధానం. కడలి కెరటాల్లో కళను చూసిన ఓ వ్యక్తి సంప్రదాయ వృత్తిని కాదన్నాడు. తనలోని కళల అలజడికి విలువిచ్చి వలను పట్టేది లేదని తేల్చిపారేశాడు. కళనే వలగా మార్చి తన గ్రామాన్ని ఆర్ట్ విలేజ్‌గా ప్రపంచం ముందు నిలిపాడు.
ఇంగ్‌బీ, ససరన్ గ్రామవాసి. ఆ గ్రామంలో ‘నేను చేపలు పట్టను’ అన్న ఒకే ఒక్కడు. ‘మరెట్టా బతుకుతావురా..?’ అని పెద్దలు నిలదీస్తే.. ఆర్టిస్ట్‌ను అవుతానన్నాడు. ఇంట్లో వాళ్లే కాదు, ఆ గ్రామస్తులంతా ముక్కున వేలేసుకున్నారు. అస్తమానం బొమ్మలేయడం ఇంగ్‌బీ వ్యాపకమైంది. గ్రామీణుల పడవలను, వలలను తనకు వచ్చిన కళతో తీర్చిదిద్ది వినూత్నంగా వాళ్ల కళ్లముందుంచాడు.
వెదురు బుట్టల్లో మెరిసిపోయే మార్పులు చూపాడు. మోటార్ సైకిళ్లు, కార్లపై వాటి యజమానులు ఆనందించే రంగులు వేశాడు. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం ఊరికే ఆర్ట్ వైరస్ అంటించాడు. వెల్డింగ్ చేసేవారు, గోడలు కట్టేవారు, బురదనేలపై చెక్కల రోడ్డు వేసేవారు, పడవలు నడిపేవారు.. ఇలా ఎందరో ఇంగ్‌బీ ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఆర్టిస్టులూ అయిపోయారు.
ససరన్లో ఆర్ట్ సైరన్..
దేశవిదేశాల్లో ఎక్కడ ఆర్ట్ ఫెస్టివల్ జరిగినా ఇంగ్‌బీ రెక్కలు కట్టుకుని వాలిపోయేవాడు. అలాంటి పండుగలు తన గ్రామంలో ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా తనకు పరిచయం ఉన్న ఆర్టిస్టులందరికీ తన ఊరిలో మార్పులను పరిచయం చేశాడు. మిత్రుల ద్వారా పర్యాటక సంస్థలను సంప్రదించాడు. అన్నీ అనుకూలించిన తర్వాత ససరన్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్-2008కి శ్రీకారం చుట్టాడు.
స్థానికంగా ఉన్న చైనా పాఠశాల నిర్వాహకులను సంప్రదించాడు. ఇంగ్‌బీ తొలిసారి నిర్వహిస్తున్న వేడుకకు ప్రోత్సాహం ఇచ్చేందుకు వారు ముందుకొచ్చారు. ఫెస్టివల్‌కు వచ్చిన ఆర్టిస్టులు సిగరెట్లు తాగడం, మందుకొట్టడం ఆ స్కూల్ హెడ్మాస్టర్కు రుచించలేదు. కానీ, తాగిపారేసిన సీసాలతో, ఫెస్టివల్ తర్వాత ఊళ్లో పేరుకుపోయిన చెత్తాచెదారంతో ఇంగ్‌బీ కళ్లు చెదిరే కళారూపాలను ఆవిష్కరించి వహ్వా అనిపించాడు. 2011లో రెండో ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించాడు.
ముచ్చటగా మూడోది..
ఈ ఏడాది మూడో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. గతనెల 27న ప్రారంభమైన ససరన్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్-2014 ఈ నెల 8వ తేదీ వరకూ జరగనుంది. ప్రపంచదేశాలు, ముఖ్యంగా ఆసియా దేశాల ఆర్ట్ మార్కెట్‌కు ససరన్ కనెక్ట్ అయ్యింది. ‘అన్నిచోట్లా ఆర్ట్’ (ఆర్ట్ ఇన్ ద ఎయిర్) అనే అంశంపై జరుగుతోన్న ఈ ఏడాది ఫెస్టివల్లో ఊరిలోని అణువణువూ ఆర్ట్పీస్గా మారిపోతోంది.
ఈ సంబరానికి తెలంగాణ నుంచి ప్రముఖ ఆర్టిస్ట్ ఏలె లక్ష్మణ్ ఆహ్వానితునిగా వెళ్లారు. ఆర్ట్ ఎట్ తెలంగాణను అక్కడి ప్రతినిధులకు పరిచయం చేస్తున్నారు. ససరన్లో ఆర్ట్ సృష్టించిన సంపదను, గ్రామస్తుల ఆహ్లాదకరమైన జీవితాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇంగ్‌బీ ద్వారా కిటుకులు తెలుసుకుంటున్నారు! తెలంగాణ ఒక ససరన్ను స్వప్నిస్తుందా?!