ఇక ఇన్ఫోకస్ ఎల్ఈడీ టీవీలు..
♦ ధరల శ్రేణి రూ.10-70 వేలు
♦ కస్టమర్ల ఇంటివద్ద ఉచిత డెమో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయంలో ఉన్న అమెరికన్ కంపెనీ ఇన్ఫోకస్... ఎల్ఈడీ టీవీల విభాగంలోకి ప్రవేశించింది. 24, 32 అంగుళాల సైజులో హెచ్డీ ఎల్ఈడీ టీవీలను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.9,999, రూ.15,999 ఉన్నాయి. అలాగే ఫుల్ హెచ్డీ ఎల్ఈడీల శ్రేణిలో 50, 60 అంగుళాల సైజులో టీవీలను తీసుకొచ్చింది. ఈ మోడళ్ల ధర వరుసగా రూ.34,999, రూ.69,999గా నిర్ణయించింది. మొబైల్ ఫోన్ల విక్రయం ద్వారా భారత్‌లో 10 లక్షల మందికి చేరువయ్యామని ఈ సందర్భంగా ఇన్ఫోకస్ ఇండియా హెడ్ సచిన్ థాపర్ చెప్పారు. ఇదే ఊపుతో ఇప్పుడు టీవీలను తీసుకొచ్చామన్నారు. ‘టీవీలకు అత్యుత్తమ డిస్ప్లే ప్యానళ్లను వినియోగించాం.జపాన్‌లో తయారైన షార్ప్ ప్యానెల్‌తో 60 అంగుళాల టీవీని రూపొందించాం. పరిశ్రమలో తొలిసారిగా ఫ్రీ డెమోను ప్రారంభించాం’ అని వివరించారు.
ఇంటివద్ద ఉచిత డెమో..:ఇన్ఫోకస్ మొబైళ్లతోపాటు టీవీలను ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది. ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్‌లో మాత్రమే ఫిబ్రవరి 29 నుంచి టీవీలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ అనుభూతిని తిరగరాస్తూ ఇన్ఫోకస్ తొలిసారిగా ‘ఫ్రీ డెమో ఎట్ హోం’ను ప్రకటించింది. కస్టమర్ల ఇంటి వద్ద 50 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీ పనితీరును డెమో ద్వారా వివరిస్తారు. 18 ప్రధాన నగరాల్లో ఈ సౌకర్యం ఉందని స్నాప్‌డీల్ పార్ట్నర్షిప్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నవీన్ తెలిపారు. కాగా, స్మార్ట్ యూవీ2ఏ టెక్నాలజీని టీవీల్లో వాడారు. వీక్షకుల కళ్లపై తక్కువ కాంతి పడుతుందని కంపెనీ తెలిపింది.