ISRO: నేడే జీఎస్ఎల్వీ సీ14 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్–3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ ఎఫ్14 ఉపగ్రహ వాహక నౌకను నేడు ఇస్రో ప్రయోగించనుంది. ఇందుకోసం శుక్రవారం మధ్యాహ్నమే కౌంట్‌డౌన్ మొదలైందని తెలిసిందే. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగిస్తారు.
గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి.
ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో)లో శాటిలైట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి మారుస్తారు.