ఇన్ టాక్ పాలక మండలి సభ్యుడిగా వేదకుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్టాక్) పాలక మండలి సభ్యుడిగా ప్రముఖ పర్యావరణ, హెరిటేజ్ కార్యకర్త ఎం.వేదకుమార్ ఎన్నికయ్యారు. చారిత్రక వారసత్వ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికిగాను ఇన్టాక్ సభ్యులు ఆయనను పాలక మండలికి ఎన్నుకున్నారు. వేదకుమార్ వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ.. ప్రవృత్తి రీత్యా హెరిటేజ్ కార్యకర్త. గత రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో కృషి చేస్తున్నారు.
ఎన్నో చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం ఉద్యమించారు. 2014 సెప్టెంబర్ వరకు ఇన్టాక్ ఏపీ రాష్ట్ర శాఖకు కో-కన్వీనర్‌గా పని చేశారు. ఈ సమయంలో అనేక ప్రహరీలు, శిలల సహజ సిద్ధ ఆకృతులు, కట్టడాలు, స్థానిక నిర్మాణ శైలులను కాపాడేందుకు కృషి చేశారు. చారిత్రక, వారసత్వ కట్టడాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. హెరిటేజ్ కార్యకర్తగా రోమ్, పారిస్, బెర్లిన్, ఇన్‌ఫాహాస్, హమెదాస్ (ఇరాన్), ఇస్తాంబుల్ తదితర నగరాల్లో పర్యటించారు. జర్మనీకి చెందిన హమ్‌బోల్డ్ యూనివర్సిటీతో కలసి మూసీ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్టుకు సారథ్యం వహించారు.